కనెక్షన్..కరెప్షన్! | corruption in electricity department | Sakshi
Sakshi News home page

కనెక్షన్..కరెప్షన్!

Published Fri, Jun 20 2014 2:34 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

కనెక్షన్..కరెప్షన్! - Sakshi

కనెక్షన్..కరెప్షన్!

కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏపీ ఎస్‌పీడీసీఎల్‌లో ప్రతి పనికీ ఓ రేటు కట్టి వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే రెట్టింపు వేతనాలు అందుతాయి. అయితే కొందరి దృష్టి మామూళ్లపై పడింది.

అసలు కంటే వడ్డీపైనే ప్రేమ ఎక్కువ అన్న చందంగా కొందరు విద్యుత్ ఉద్యోగులకు జీతం ఎంత ఉన్న అక్రమార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. మొన్న నందవరంలో, నిన్న మిడ్తూరులో ఏఈలు ఏసీబీ వలలో చిక్కుకోగా, బుధవారం లైన్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెషన్ వేటు పడిన విషయం విధితమే. కరెంటు కనెక్షన్, మీటరు బిగించడం, స్తంభం, తీగలు మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పేరు, అడ్రస్ మార్పించడం, ఎస్టిమేట్ల వేయడం ఇలా పని ఏదైనా సిబ్బందికి మామూళ్లు ఇవ్వాల్సిందే.
 
 అడిగినంత ముట్టజెప్పితేనే ఫైల్ త్వరగా కదులుతుంది. లేదంటే నెలల తరబడి తిరిగినా అడ్డమైన నిబంధనలు, అభ్యంతరాల పేరుతో కాలయాపన చేస్తారు. మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజనీర్ల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు అక్షింతలు వేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. దరఖాస్తు చేసుకునే సమయం నుంచే మామూళ్ల ప్రక్రియ ప్రారంభం అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈక్రమంలో కొందరు ఏసీబీ వలలో చిక్కి జైలు జీవితం అనుభవించిన సందర్భాలున్నాయి.
 
పనిని బట్టి రేటు:
విద్యుత్ శాఖలో ప్రతి పనికీ ఓ రేటుంది. సంస్థ నిర్ణిత మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించినా.. పని పూర్తి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. ఇంటి కనెక్షన్‌కు రూ.వెయ్యి, త్రీఫేస్ మీటర్ బిగించేందుకు రూ.2వేలు (ఇందులో కొందరు ఏఈతో పాటు ఏడీఈకి వాటా ఉంటుందని సమాచారం), వ్యవసాయ కనెక్షన్ రూ.10 వేల వరకు, అదనపు విద్యుత్ స్ధంబాల ఏర్పాటుకు రూ.25 వేల వరకు, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు (రైతుల సంఖ్య, అవసరాలను బట్టి) వసూలు చేస్తారు.
 
పట్టణాల్లో నిర్మించే అపార్ట్‌మెంట్ కనెక్షన్లకు ఏఈకి రూ.5వేల నుంచి రూ.10వేలు, ఏడీఈకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, డీఈ కార్యాలయల్లో వర్క్ ఆర్డర్లు, ఎస్టిమేట్లు పొందేందుకు రూ.5 వేలు, ఎస్‌ఈ కార్యాలయంలో కొందరికి అడిగినంత ఇచ్చుకోవాలి. పరిశ్రమల కనెక్షన్ పొందాలంటే రూ. 20 వేల వరకు ఇచ్చుకోవాలి. వ్యాపార దుకాణం కనెక్షన్ రూ.3 వేలు, విద్యుత్ స్తంభం మార్చేందుకు రూ.5వేలు, మీటర్ మార్చేందుకు రూ.2వేల వరకు మమూళ్లు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.  
 
కొన్ని సంఘటనలు
కర్నూలు సెంట్రల్ సెక్షన్‌లో పనిచేస్తున్న లైన్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి మీటర్ బిగించేందుకు మామూళ్లు అడిగి, వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఈనెల 18వ తేదిన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈయన గతంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న షాపులకు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలడంతో రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టారు. అప్పట్లో ఓ పోల్‌టూపోల్ వర్కర్‌ను సర్వీసు నుంచి తొలగించారు.

కర్నూలు మండలం గొందిపర్ల లైన్‌మెన్ అబ్దుల్లా విద్యుత్ కనెక్షన్ కోసం రూ.23,500 పుచ్చుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఏడీఈ విజయసారధి విచారణ జరిపారు.
 
ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ మే 28వ తేదిన మిడుతూరు ఏఈ శ్రీనివాసుల నాయుడు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
 
మార్చిలో నందవరం ఏఈ గురునాథ్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
 
గతేడాది దేవనకొండ సెక్షన్‌లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ. 50వేలు, వ్యవసాయ కనెక్షన్ కోసం 16 వేలు మామూళ్లు లైన్‌మెన్, ఏఈకి అందించామని కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ వినియోగదారుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు.
 
కృష్ణగిరి మండలానికి చెందిన మాధవస్వామి అనే రైతు ట్రాన్స్‌పార్మర్ కోసం అధికారులకు రూ.60 వేలు అదనంగా చెల్లించానని, అయినా పనులు పూర్తి చేయలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు.
 
 2012 డిసెంబరు 31న బనగానపల్లె ఏడీఈ, మార్చిలో డోన్ డీఈ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు.
 
రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు: టి. బసయ్య, ఎస్‌ఈ, కర్నూలు
పనుల చేసేందుకు మామూళ్ల అడిగి వేధించే సిబ్బందిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యుత్ కనెక్షన్‌తోపాటు ఇరత పనుల కోసం నిర్ణిత మొత్తన్ని డీడీ రూపంలో చెల్లించాలి. కిందిస్థాయి సిబ్బంది, అధికారులు అదనంగా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్ డివిజన్ కేంద్రలోని కస్టమర్ సర్వీసు సెంటర్‌లో (సీఎస్‌సీ)లో సంప్రదించి సిటిజన్ చార్ట్ ప్రకారం సేవలు పొందవచ్చు. లైన్‌మెన్, ఏఈ, ఏడీఈల సంతకాల కోసం వినియోగదారులు తిరగాల్సిన అవసరం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement