Line Inspector
-
పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు
సనత్‌నగర్: విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు. డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్ ఇన్స్పెక్టర్కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు చెందిన కూకట్పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు. (చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!) -
విద్యుత్‌శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి
కావలి: పట్టణంలోని ముసునూరు ప్రాంతంలో నివాసం ఉండే విద్యుత్‌శాఖ లైన్ ఇన్స్పెక్టర్ సూరే లక్ష్మీరెడ్డి ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగాయి. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలి రూరల్ మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వరిస్తున్న లక్ష్మీరెడ్డి అక్రమాస్తులు కూడబెట్టాడని ఏసీబీ డీఎస్సీ పి.పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు ఎన్.శివకుమార్‌రెడ్డి, ఎ.శ్రీహరిరావులు సిబ్బందితో కలిసి ముసునూరులో ఉన్న అతని ఇంటిపై గురువారం ఉదయం దాడులు చేశారు. అలాగే మండల కేంద్రమైన జలదంకి, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలో ఉన్న వళ్లూరు గ్రామంలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. జలదంకిలో లక్ష్మీరెడ్డి తండ్రి నివాసం ఉంటారు. వళ్లూరు ఆయన అత్తగారు గ్రామం. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు లక్ష్మీరెడ్డి కుటుంబసభ్యులు, స్నేహితుల నివాసాలపై దాడులు చేశారు. కాగా ముసునూరులో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో ఐదు ఇళ్లు, రెండు ఇంటి ప్లాట్లు, ఇతర ప్రాంతాల్లో 45 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఇళ్లు, ఇంటి స్థలాలు విలువ రూ.4.5 కోట్లు, పొలాలు విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా లైన్‌మన్‌గా ఉన్న లక్ష్మీరెడ్డి ఇటీవలే లైన్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. విబేధాలతోనే.. విద్యుత్‌శాఖలో యూనియన్ల మధ్య ఉన్న విబేధాలతోనే నన్ను ఇబ్బందులు పెట్టడానికి ఏసీబీకి ఫిర్యాదు చేసి దాడులు చేయించారని లక్ష్మీరెడ్డి విలేకరులకు తెలిపారు. వ్యవసాయం చే యడం ద్వారా, పెద్దల ద్వారా సంక్రమించిన ఆ స్తులను పెట్టుబడిగా మార్చుకుంటూ సంపాదించానని చెప్పారు. జలదంకిలో.. జలదంకి: మండల కేంద్రంలోని లక్ష్మీరెడ్డి ఇంటిపై, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అతని తండ్రి సురే మాలకొండారెడ్డి, అక్క ఇస్కా సీతాలక్ష్మి, అన్న దశరథరామిరెడ్డిల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించి వారిని విచారించారు. -
ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
పెద్ద అంబర్పేట్ (రంగారెడ్డి జిల్లా) : పెద్ద అంబర్పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్ రూ.13,000 లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అనంతుల రవీందర్.. కుంట్లూర్ సమీపంలో ఉన్న తన అరెకరం పొలంలో కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభులాల్ లంచం అడగడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగారెడ్డి, సైబరాబాద్ ఏసీబీ డీఎస్పీ ఎమ్ ప్రభాకర్ బృందం రవీందర్ లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. -
ఏసీబీకి పట్టుబడ్డ లైన్ఇన్స్పెక్టర్
చోడవరం (విశాఖపట్నం) : పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ లైన్ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలోని కోటపాడు మండలం దాలివలస గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలంటూ లైన్ ఇన్స్పెక్టర్ అప్పాజీబాబును ఆశ్రయించారు. అయితే ఆయన రూ.10 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.8 వేలకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఆ రైతు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు ఉప్పందించారు. వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం రైతు శ్రీనివాసరావు పొలంలో స్తంభం ఏర్పాటు చేసే చోటును పరిశీలించటానికి వచ్చిన అప్పాజీబాబుకు రూ.8 వేలు లంచం అందించారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ అప్పాజీబాబును పట్టుకుని, కేసు నమోదు చేశారు. -
ఉద్యోగం అక్కడ.. జీతం ఇక్కడ
సాక్షి, ఏలూరు : విద్యుత్ శాఖలో అక్రమార్కులకు సంఖ్య పెరిగిపోతోంది. ఆ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ వ్యవహారం తాజాగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ అంగీకరిచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని డి4 సెక్షన్లో లైన్ ఇన్స్పెక్టర్ అయిన రాజు సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ విధులకు హాజరుకావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ ప్రజాప్రతినిధికి అనుచరుడిగా వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో ఆయన వెంటే ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా విధులకు హాజరుకావడం లేదు. కానీ ఇక్కడ మాత్రం జీతం తీసుకుంటున్నారు. అతను విధులకు రాకపోయినా హాజరవుతున్నట్లుగా రికార్డుల్లో రాసేస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు విచారణాధికారి పి.కొండాలు బుధవారం జిల్లాకు వచ్చి డి4 సెక్షన్లో విచారణ నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఫిర్యాదు వాస్తవమేనని తేలినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఉండటంతో పాటు తమ లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఇక్కడి అధికారులెవరూ నోరు మెదపడం లేదు. ఏలూరు నగర ఏడీఈ అంబేద్కర్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తాను వేరే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పి తప్పించుకున్నారు. కొండాలును సంప్రదించగా.. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, తదుపరి నిర్ణయం సీఎండీ తీసుకుంటారని పేర్కొన్నారు. -
కనెక్షన్..కరెప్షన్!
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏపీ ఎస్పీడీసీఎల్లో ప్రతి పనికీ ఓ రేటు కట్టి వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే రెట్టింపు వేతనాలు అందుతాయి. అయితే కొందరి దృష్టి మామూళ్లపై పడింది. అసలు కంటే వడ్డీపైనే ప్రేమ ఎక్కువ అన్న చందంగా కొందరు విద్యుత్ ఉద్యోగులకు జీతం ఎంత ఉన్న అక్రమార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. మొన్న నందవరంలో, నిన్న మిడ్తూరులో ఏఈలు ఏసీబీ వలలో చిక్కుకోగా, బుధవారం లైన్ ఇన్స్పెక్టర్పై సస్పెషన్ వేటు పడిన విషయం విధితమే. కరెంటు కనెక్షన్, మీటరు బిగించడం, స్తంభం, తీగలు మార్చడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, పేరు, అడ్రస్ మార్పించడం, ఎస్టిమేట్ల వేయడం ఇలా పని ఏదైనా సిబ్బందికి మామూళ్లు ఇవ్వాల్సిందే. అడిగినంత ముట్టజెప్పితేనే ఫైల్ త్వరగా కదులుతుంది. లేదంటే నెలల తరబడి తిరిగినా అడ్డమైన నిబంధనలు, అభ్యంతరాల పేరుతో కాలయాపన చేస్తారు. మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజనీర్ల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు అక్షింతలు వేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. దరఖాస్తు చేసుకునే సమయం నుంచే మామూళ్ల ప్రక్రియ ప్రారంభం అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈక్రమంలో కొందరు ఏసీబీ వలలో చిక్కి జైలు జీవితం అనుభవించిన సందర్భాలున్నాయి. పనిని బట్టి రేటు: విద్యుత్ శాఖలో ప్రతి పనికీ ఓ రేటుంది. సంస్థ నిర్ణిత మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించినా.. పని పూర్తి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. ఇంటి కనెక్షన్‌కు రూ.వెయ్యి, త్రీఫేస్ మీటర్ బిగించేందుకు రూ.2వేలు (ఇందులో కొందరు ఏఈతో పాటు ఏడీఈకి వాటా ఉంటుందని సమాచారం), వ్యవసాయ కనెక్షన్ రూ.10 వేల వరకు, అదనపు విద్యుత్ స్ధంబాల ఏర్పాటుకు రూ.25 వేల వరకు, ట్రాన్స్ఫార్మర్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు (రైతుల సంఖ్య, అవసరాలను బట్టి) వసూలు చేస్తారు. పట్టణాల్లో నిర్మించే అపార్ట్మెంట్ కనెక్షన్లకు ఏఈకి రూ.5వేల నుంచి రూ.10వేలు, ఏడీఈకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, డీఈ కార్యాలయల్లో వర్క్ ఆర్డర్లు, ఎస్టిమేట్లు పొందేందుకు రూ.5 వేలు, ఎస్ఈ కార్యాలయంలో కొందరికి అడిగినంత ఇచ్చుకోవాలి. పరిశ్రమల కనెక్షన్ పొందాలంటే రూ. 20 వేల వరకు ఇచ్చుకోవాలి. వ్యాపార దుకాణం కనెక్షన్ రూ.3 వేలు, విద్యుత్ స్తంభం మార్చేందుకు రూ.5వేలు, మీటర్ మార్చేందుకు రూ.2వేల వరకు మమూళ్లు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని సంఘటనలు కర్నూలు సెంట్రల్ సెక్షన్లో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ రంగస్వామి మీటర్ బిగించేందుకు మామూళ్లు అడిగి, వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఈనెల 18వ తేదిన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈయన గతంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న షాపులకు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలడంతో రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టారు. అప్పట్లో ఓ పోల్టూపోల్ వర్కర్‌ను సర్వీసు నుంచి తొలగించారు. కర్నూలు మండలం గొందిపర్ల లైన్మెన్ అబ్దుల్లా విద్యుత్ కనెక్షన్ కోసం రూ.23,500 పుచ్చుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఏడీఈ విజయసారధి విచారణ జరిపారు. ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ మే 28వ తేదిన మిడుతూరు ఏఈ శ్రీనివాసుల నాయుడు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మార్చిలో నందవరం ఏఈ గురునాథ్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతేడాది దేవనకొండ సెక్షన్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 50వేలు, వ్యవసాయ కనెక్షన్ కోసం 16 వేలు మామూళ్లు లైన్మెన్, ఏఈకి అందించామని కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ వినియోగదారుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి మండలానికి చెందిన మాధవస్వామి అనే రైతు ట్రాన్స్పార్మర్ కోసం అధికారులకు రూ.60 వేలు అదనంగా చెల్లించానని, అయినా పనులు పూర్తి చేయలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు. 2012 డిసెంబరు 31న బనగానపల్లె ఏడీఈ, మార్చిలో డోన్ డీఈ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు: టి. బసయ్య, ఎస్ఈ, కర్నూలు పనుల చేసేందుకు మామూళ్ల అడిగి వేధించే సిబ్బందిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యుత్ కనెక్షన్‌తోపాటు ఇరత పనుల కోసం నిర్ణిత మొత్తన్ని డీడీ రూపంలో చెల్లించాలి. కిందిస్థాయి సిబ్బంది, అధికారులు అదనంగా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్ డివిజన్ కేంద్రలోని కస్టమర్ సర్వీసు సెంటర్లో (సీఎస్సీ)లో సంప్రదించి సిటిజన్ చార్ట్ ప్రకారం సేవలు పొందవచ్చు. లైన్మెన్, ఏఈ, ఏడీఈల సంతకాల కోసం వినియోగదారులు తిరగాల్సిన అవసరం లేదు.