విద్యుత్‌శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడి | ACB Rides In Electricity Department Line Inspector PSR Nellore | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడి

Published Fri, Jun 22 2018 1:41 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Rides In Electricity Department Line Inspector PSR Nellore - Sakshi

కావలిలోని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీరెడ్డి ఇల్లు

కావలి: పట్టణంలోని ముసునూరు ప్రాంతంలో నివాసం ఉండే విద్యుత్‌శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సూరే లక్ష్మీరెడ్డి ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగాయి. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలి రూరల్‌ మండలంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న లక్ష్మీరెడ్డి అక్రమాస్తులు కూడబెట్టాడని ఏసీబీ డీఎస్సీ పి.పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు ఎన్‌.శివకుమార్‌రెడ్డి, ఎ.శ్రీహరిరావులు సిబ్బందితో కలిసి ముసునూరులో ఉన్న అతని ఇంటిపై గురువారం ఉదయం దాడులు చేశారు. అలాగే మండల కేంద్రమైన జలదంకి, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలో ఉన్న వళ్లూరు గ్రామంలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

జలదంకిలో లక్ష్మీరెడ్డి తండ్రి నివాసం ఉంటారు. వళ్లూరు ఆయన అత్తగారు గ్రామం. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు లక్ష్మీరెడ్డి కుటుంబసభ్యులు, స్నేహితుల నివాసాలపై దాడులు చేశారు. కాగా ముసునూరులో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో ఐదు ఇళ్లు,  రెండు ఇంటి ప్లాట్లు, ఇతర ప్రాంతాల్లో 45 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇళ్లు, ఇంటి స్థలాలు విలువ రూ.4.5 కోట్లు, పొలాలు విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా లైన్‌మన్‌గా ఉన్న లక్ష్మీరెడ్డి ఇటీవలే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.

విబేధాలతోనే..
విద్యుత్‌శాఖలో యూనియన్ల మధ్య ఉన్న విబేధాలతోనే నన్ను ఇబ్బందులు పెట్టడానికి ఏసీబీకి ఫిర్యాదు చేసి దాడులు చేయించారని లక్ష్మీరెడ్డి విలేకరులకు తెలిపారు. వ్యవసాయం చే యడం ద్వారా, పెద్దల ద్వారా సంక్రమించిన ఆ స్తులను పెట్టుబడిగా మార్చుకుంటూ సంపాదించానని చెప్పారు.

జలదంకిలో..
జలదంకి: మండల కేంద్రంలోని లక్ష్మీరెడ్డి ఇంటిపై, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అతని తండ్రి సురే మాలకొండారెడ్డి, అక్క ఇస్కా సీతాలక్ష్మి, అన్న దశరథరామిరెడ్డిల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించి వారిని విచారించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement