సాక్షి, ఏలూరు : విద్యుత్ శాఖలో అక్రమార్కులకు సంఖ్య పెరిగిపోతోంది. ఆ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్ వ్యవహారం తాజాగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ అంగీకరిచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని డి4 సెక్షన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్ అయిన రాజు సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ విధులకు హాజరుకావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ ప్రజాప్రతినిధికి అనుచరుడిగా వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో ఆయన వెంటే ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా విధులకు హాజరుకావడం లేదు. కానీ ఇక్కడ మాత్రం జీతం తీసుకుంటున్నారు.
అతను విధులకు రాకపోయినా హాజరవుతున్నట్లుగా రికార్డుల్లో రాసేస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు విచారణాధికారి పి.కొండాలు బుధవారం జిల్లాకు వచ్చి డి4 సెక్షన్‌లో విచారణ నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఫిర్యాదు వాస్తవమేనని తేలినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఉండటంతో పాటు తమ లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఇక్కడి అధికారులెవరూ నోరు మెదపడం లేదు. ఏలూరు నగర ఏడీఈ అంబేద్కర్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తాను వేరే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పి తప్పించుకున్నారు. కొండాలును సంప్రదించగా.. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, తదుపరి నిర్ణయం సీఎండీ తీసుకుంటారని పేర్కొన్నారు.
ఉద్యోగం అక్కడ.. జీతం ఇక్కడ
Published Thu, Sep 18 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement