సాక్షి,అమరావతి: విద్యుత్ శాఖలో ఉన్న చైనా సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం మార్గదర్శకాలివ్వడంతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ప్రతి విభాగాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. రాష్ట్ర ఇంధన సాంకేతిక విభాగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు చెప్పారు. కొత్తగా దిగుమతి చేసుకునే విద్యుత్ మాడ్యుల్స్ వివరాలను కేంద్రానికి తెలపడమే కాకుండా, ఇప్పటికే సబ్ స్టేషన్లలో వాడుతున్న టెక్నాలజీని జల్లెడ పట్టడానికి రాష్ట్ర సాంకేతిక సర్వీస్ విభాగం (ఏపీటీఎస్) సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.
అనుమానాలేంటి?
ఏపీ విద్యుత్ సంస్థల్లో కొన్ని చోట్ల చైనా ప్యానల్స్ వాడుతున్నారు. ఇవి ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి. చైనా వీటిని నియంత్రించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అదే జరిగితే..
► ఫైర్‌వాల్స్‌ను నెట్టేసుకుని అసంబద్ధ సంకేతాలు వచ్చే వీలుంది.
► రాష్ట్రంలో డిమాండ్ ఎంత? ఉత్పత్తి ఎంత? ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి? అనేది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) చూస్తుంది. తప్పుడు సంకేతాలు వెళ్తే గ్రిడ్ నియంత్రణ ఒక్కసారిగా దారి తప్పి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.
► విద్యుత్ పాలన వ్యవస్థ మొత్తం డిజిటల్ చేశారు. హ్యాక్ చేసే పరిస్థితే వస్తే డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి విభాగాన్ని ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉందని టెక్నికల్ విభాగం స్పష్టం చేసింది.
► విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్‌లోని క్లౌడ్ (సమాచార నిధిని భద్రతపర్చే డిజిటల్ కేంద్రం)లో నిక్షిప్తం చేశారు. ఎప్పుడైనా దీన్ని నెట్ ద్వారా వినియోగించుకునే వీలుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని భద్రతను పరిశీలించనున్నారు.
► విద్యుత్ గ్రిడ్, సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేశారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. సిబ్బందితో నిమిత్తం లేకుండానే వీటి ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకునే వీలుంది. కాబట్టి వీటి సెక్యూరిటీని పెంచాలని నిర్ణయించారు.
ఇక నుంచి..
► కొత్తగా విదేశాలు, ప్రత్యేకంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విద్యుత్ ఉపకరణాలు, మాడ్యుల్స్, టెక్నాలజీని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పరిశీలిస్తుంది. నష్టం కలిగించే మాల్‌వేర్ లేదని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తుంది.
► రాష్ట్ర స్థాయిలో ఏపీటీఎస్ సాంకేతిక ఆడిటింగ్ నిర్వహిస్తుంది. విద్యుత్ వ్యవస్థలో వాడే ప్రతి టెక్నాలజీలో హానికర సాఫ్ట్‌వేర్‌లు, వైరస్‌లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది.
క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం
కేంద్ర సమాచారం మేరకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ సాంకేతికతను పటిష్టం చేస్తున్నాం. చైనా టెక్నాలజీని వాడుతున్న సబ్ స్టేషన్లను గుర్తించి క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం.
–కేవీఎన్ చక్రధర్ బాబు, జేఎండీ ట్రాన్స్‌కో
ప్రత్యేక శిక్షణ పొందాం
విద్యుత్ రంగం టెక్నాలజీతోనే నడుస్తోండటంతో సైబర్ దాడులకు అవకాశం ఉంది. వీటిని గుర్తించి, తిప్పికొట్టేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం.
– సి.కామేశ్వర దేవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment