జనావాసాల్లో మృత్యువు | protection walls drought to transform | Sakshi
Sakshi News home page

జనావాసాల్లో మృత్యువు

Published Fri, Dec 13 2013 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

protection walls drought to transform

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రజలకు శాపమవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ గోడ నిర్మాణంలో ఆ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు వృుత్యువుతో సహజీవనం చేస్తున్నారు. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా.. పాఠశాలలు, ప్రధాన రహదారుల్లో వెలసిన ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పుడు ప్రమాదానికి కారణమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ బాధ్యతను విద్యుత్ అధికారులు పూర్తిగా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకోసం గత 15 సంవత్సరాలుగా పైసా నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం.

 ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో హడావుడి చేయడం.. ఆ తర్వాత విస్మరించడం వీరికే చెల్లింది. కనీసం ఆరు అడుగుల ఎత్తులో దిమ్మె కట్టి దానిపై ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలనే నిబంధన చాలా ప్రాంతాల్లో అమలుకు నోచుకోలేదు. ఇక చుట్టూ రక్షణ గోడ నిర్మించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖదే అయినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.20వేలు ఖర్చవుతుందని అంచనా. 15 సంవత్సరాల క్రితం వరకు రెన్యువేషన్ అండ్ మోడ్రనైజేషన్ స్కీం పేరిట ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కల్పించినా.. ఆ తర్వాత నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. వినియోగదారుల భద్రత తమ పరిధిలోని అంశం కాదనే భావన ఆ శాఖ అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

 ఫలితంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీసం రద్దీ ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లకు సైతం కంచె ఏర్పాటుకు ముందుకు రాకపోవడం ప్రజల రక్షణ పట్ల ఆ శాఖ చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లాలోని 37,927 ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ గోడుల నిర్మాణానికి రూ.75.40 కోట్ల నిధులు అవసరం కాగా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆదోని పట్టణంలోని మున్సిపల్ రోడ్డు, పెద్ద మసీదు ప్రాంతాలు నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో చాలా మంది వ్యాపారులు నిర్వహిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా.. ట్రాన్స్‌ఫార్మర్‌కు బలికాక తప్పదనే విషయం అధికారులకు తెలియనిది కాదు. అయితే కొన్నేళ్లుగా అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన పాపాన పోవడం లేదు.

 ఆళ్లగడ్డలో ఎస్సీ హాస్టల్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యార్థులతో పాటు ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. చాగలమర్రిలోని మహర్షి పాఠశాల రహదారిలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటంతో కాలనీవాసుల దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. ఆస్పరి మండలంలోని వెంగళాయిదొడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలను సంచరించే ప్రాంతంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎప్పుడు తమను విషాదంలోకి నెడుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిప్పగిరిలో రెండేళ్ల నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆత్మకూరులో ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఓ లారీ రోడ్డుపక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టినా.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తుగ్గలి మండలంలోని మారెళ్ల గ్రామంలో గత ఏడాది ప్రమాదవశాత్తు ఓ బాలుడు ట్రాన్స్‌ఫార్మర్‌ను తగిలి వృుత్యువాతపడ్డాడు. ఈ పరిస్థితుల్లో కూడా అధికారులు మేల్కొనకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement