
బదిలీల జ్వరం
ఏలూరు : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ, విద్యుత్ శాఖల్లో బదిలీల పర్వం మొదలైంది. పోలీస్ శాఖలో రెండు, మూడు రోజుల్లో బదిలీలు చేపట్టనున్నారు. తొలుత డీఎస్పీలు, ఆ తర్వాత సీఐ, ఎస్సైలకు స్థానభ్రంశం కల్పించేందుకు కసరత్తు సాగుతోంది. ఇతర శాఖల్లోనూ అధికారుల బదిలీలు ఉంటాయనే ప్రచారం సాగుతోం ది. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయు డు ఇక్కడ విధుల్లో చేరి మూడేళ్లు పూర్తరుున నేపథ్యంలో ఆయన కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాల భోగట్టా. ఇదిలావుండగా ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి రావాల్సి ఉంది.
ఎటూకాని వేళ ఎలా..
బదిలీలపై ఈ నెలాఖరు వరకు నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియ ఊపందుకుంటోంది. సంవత్సరం మధ్యలో వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనలో అధికారులు ఉన్నారు. అన్ని శాఖల్లోని అధికార పీఠాలను కదపాలని నిర్ణరుుంచిన ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే సాగేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల సిఫార్సుల కోసం అధికారులు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందుకోసం సెలవు పెట్టి మరీ వెళ్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొద్దినెలల క్రితం ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి కీలక స్థానాల్లో చేరిన అధికారులు సైతం సొంత జిల్లాలకు సమీపంలోని ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.
విజయవాడపై కన్ను
విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడ కీలక కొలువుల్లో చేరేందుకు కొందరు అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కీలక పోస్టులు భర్తీ అయ్యేనా?
జిల్లాలో డీఎంహెచ్‌వో, డెప్యూటీ డీఎంఎహెచ్‌వో, ఉద్యాన శాఖ ఏడీ-1, ఐటీడీఏ పీవో, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా సహకార అధికారి, మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్, నాలుగు డివిజన్లలో ఉప విద్యాశాఖాధికారుల పోస్టులతోపాటు బీసీ సంక్షేమాధికారి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్, ఏలూరు, కాళ్ల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత బదిలీల్లో ఈ పోస్టులు భర్తీ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.
తెలంగాణ అధికారుల సంగతేంటో
తెలంగాణకు చెందిన అధికారులు జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ నుంచి బదిలీ అవుతారా లేక ఇక్కడే కొనసాగుతారా అన్నది ఎటూ తేలలేదు. ప్రస్తుత బదిలీల్లో వారిని ఇక్కడినుంచి కదపకపోరుునా ఉద్యోగుల విభజన తర్వాత అరుునా వారిని బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీరాజ్ పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీఏ వేణుగోపాల్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బి.రమణ, సోషల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగశేషు, ఎస్సీ కార్పొరేషన్ ఈవో శర్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు.