పోస్టింగుల కోసం మొదలైన పోలీసుల పైరవీలు
నేతలను ప్రసన్నం చేసుకుంటున్న ఖాకీలు
సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తున్న నాయకులు
ఎస్సై నుంచి ఏసీపీ దాకా ఇదేపనిలో తలమునకలు
ఐపీఎస్ బదిలీల తరువాతే కిందిస్థాయి పోస్టింగులు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇప్పుడు ఏ నేత ఇంటి ఎదుట చూసినా పలువురు పాత పోలీసులు తారసపడుతున్నారు. ‘సార్.. పోస్టింగు కోసం లెటర్ కావాలి.. ఇప్పటివరకూ లూప్‌లైన్‌లో ఉన్నాం. మీరు లెటరిస్తే వెళ్లి పోస్టింగుల్లో చేరతాం’ అంటూ పైరవీలు ప్రారంభించారు. ఇది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకే పరిమితం కాలేదు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా పోస్టింగులు తెచ్చుకోవాలని మెజారిటీ పోలీసు అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.
సామాజికవర్గాల వారీగా..
పోలీసు పైరవీల్లో తొలి ప్రాధాన్యం సామాజికవర్గానికే. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండల్లో ఈ పోకడ తక్కువే గానీ, జిల్లాలో పోలీసు పోస్టింగుల్లో తొలి ప్రాధాన్యం మా త్రం సామాజికవర్గానిదే. ఈ క్రమంలోనే నేతలు కూడా తమ సామాజికవర్గాల అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. ఆ తరువాతే సమర్థత, పనితీ రు, విశ్వసనీయత, పాత పరిచయాలు తదితర విషయాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల్లో చాలామంది తమ సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులను లెటర్ల కోసం ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు.
ఐఏఎస్‌ల, ఐపీఎస్ బదిలీలతో..
గత ప్రభుత్వ హయాంలో ఉన్న పలువురు ఐఏఎ స్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీ చేసింది. తరువాత వారిస్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను మార్చింది.
సోమవారం సాయంత్రం తొలి విడతగా పలువురు ఐపీఎస్‌లను బదిలీచేసింది. జగిత్యాల ఎస్పీగా సురేశ్ కుమార్‌ను నియమించింది. ఇక్కడ పనిచేసిన సన్‌ప్రతీసింగ్‌ను సూర్యాపేటకు బదిలీ చేసింది. మరో విడతలో మరికొందరిని కూడా బదిలీ చేయనుంది. దీంతో ఎస్సై నుంచి ఏసీపీ వరకు రెండో విడత ఐపీఎస్ బదిలీ లకోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఐపీఎస్ అధికారుల్లో చాలామంది ఎన్నికల సంఘం నియమించిన వారే ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా కిందిస్థాయి అధికారి ఫలానా చోట పోస్టింగ్ కావాలని లెటర్ తెచ్చుకున్నా.. సదరు ఐపీఎస్ అధికారి వ్యతిరేకించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ అలా అంటే మొదటికే మోసం వస్తుంది. వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని భావిస్తున్నారు. అందుకే, ఈ విషయంలో కిందిస్థాయి పోలీసు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
వారు వద్దంటే వద్దు..
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు పోస్టింగుల కోసం లెటర్లు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదని, తమ డిపార్టుమెంటు ప్రభుత్వం చెప్పినట్లు వింటుందే తప్ప, తామేపార్టీ పక్షం కాదని స్పష్టంచేస్తున్నారు. దీన్ని ముందుగానే గుర్తించిన ఉమ్మడి జిల్లాలో కొందరు తెలివైన అధికారులు ఏకంగా పొరుగు జిల్లాల్లో పోస్టింగులు సాధించుకుని డ్యూటీలు చేస్తుండటం గమనార్హం.
కరీంనగర్ హాట్ కేక్..
కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వర్గాల్లో హాట్‌కేక్‌గా మారింది. చాలామంది పోలీసు అధికారులు పిల్లల చదువుల కోసం ఇక్కడే పోస్టింగులు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో నాలుగు ఆకులు ఎక్కువే చదివిన సీనియర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇతర కమిషనరేట్లకు వలసవెళ్లారు.
ఇప్పుడు ఎన్నికల సీజన్ ముగిసింది. దీంతో తిరిగి వెనక్కి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా లూప్‌లైన్‌లో ఉన్నవారు, గత ప్రభుత్వ హయాంలో పోస్టింగులు దక్కని వారు సైతం ఈసారి ఎలాగైనా లా అండ్ ఆర్డర్‌లో ఉండేందుకు, నాయకులను కలుస్తూ లెటర్లు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment