పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం | The green lands for solar park in Mahbubnagar district, 'filings' seal | Sakshi
Sakshi News home page

పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం

Published Wed, Feb 24 2016 3:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం - Sakshi

పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం

మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్కు కోసం పచ్చని భూములపై ‘బీడు’ ముద్ర
 
 గట్టు నుంచి సాక్షి ప్రతినిధులు
 మహమ్మద్ ఫసియొద్దీన్, జి.ప్రతాప్‌రెడ్డి

 రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం గల మండలంగా గట్టు రికార్డులకెక్కింది. దశాబ్దాల కిందటి వరకు ఈ మండలంలో కనుచూపు మేర పచ్చదమే కనిపించేది కాదు. అప్పట్లో తొండలు గూడు పెట్టని భూములవి. ఇక్కడి రైతులకు వలసలే దిక్కు. 1950 నుంచి దశల వారీగా జరిగిన అసైన్డ్ భూముల కేటాయింపులతో ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. రాళ్లు రప్పలతో నిండిన భూములను చదును చేసి ఇక్కడి కుటుంబాలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయి. వారసత్వంగా ఈ భూములు రెండు మూడు తరాల చేతులు మారాయి. ప్రస్తుతం ఆ భూముల్లో బోరు, బావులు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం పరిజ్ఞానంతో సాగుచేస్తున్నారు. సూర్య కిరణాలు తీవ్రత ఎక్కువగా ఉండే గట్టు మండలం సౌర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో అత్యంత  అనువైన ప్రాంతమని ఓ సర్వేలో తేలింది. ఇక్కడ 1000 మెగావాట్ల సోలార్ పార్కు మంజూరైంది. ఇప్పుడిదే ఆ రైతుల పాలిట శాపంగా మారింది.

 సంజాయిషీ కూడా లేకుండా రద్దు
 కేటాయించిన మూడేళ్లలోపు సాగులోకి తీసుకోరాకపోతే అసైన్డ్ భూముల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేయవచ్చని అసెన్డ్ భూముల చట్టం పేర్కొంటోంది. ఈ ని‘బంధ’నల్లోనే అన్యాయంగా రైతులను ఇరికించారు. గతేడాది స్థానిక వీఆర్వోలు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. వారి నివేదిక ఆధారంగానే.. బీడుగా పడి ఉన్న ఆ భూముల కేటాయింపులను ఎందుకు రద్దు చేయవద్దో చెప్పాలంటూ గత సెప్టెంబ ర్‌లో రైతులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఏప్రిల్ 2015న జారీ చేసినట్టు నోటీసులపై పాత తేదీలు వేశారు. కొందరు రైతులకు షోకాజ్‌తో పాటే భూ కేటాయింపుల రద్దు ఉత్తర్వులను ఒకేసారి ఇచ్చారు. ఆందోళనకు గురైన కొందరు రైతులు ఈ నోటీసులు స్వీకరించ లేదు. రైతుల సంజాయిషీ వినకుండానే సోలార్ పార్కు కోసం నాలుగు గ్రామాల్లో ఇప్పటి వరకు 3,354.37 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులు రద్దు చేసేశారు. ఇందులో పడావుగా పెట్టడం వల్ల 2,130 ఎకరాలను, మిగులుగా ఉండడంతో 1,226.26 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేశామని గట్టు మండల రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు.

 ఆ రెండు గ్రామాలు ఇక ఎడారేనా..
 సోలార్ పార్కు కోసం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కుంటే సగానికి పైగా వ్యవసాయం ఆగిపోయి కుచినేర్ల, కాలూర్ తిమ్మన్‌దొడ్డి గ్రామాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. జీవనోపాధి కోసం బెంగళూరు, రాయచూరు, హైదరాబాద్‌కు వలస వెళ్లక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుచినేర్ల జనాభా 7,259 ఉండగా 10,099 ఎకరాల భూములున్నాయి. ఇందులో 1,146 ఎకరాల తరి, 6,568 ఎకరాలు మెట్ట భూములు మాత్రమే సాగుకు యోగ్యమైనవి. సోలార్ పార్కు కోసం ఈ గ్రామం నుంచి 2,072.05 ఎకరాలు సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 1,586.35 ఎకరాలను లాగేసుకుంది. ఇక కాలూర్‌తిమ్మన్‌దొడ్డిలో జనాభా 2,625 ఉండగా కేవలం 5,131 ఎకరా ల భూములే ఉన్నాయి. ఉన్నాయి. ఇందులో 679 ఎకరాల తరి, 2,911 ఎకరాల మెట్ట భూ ములు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రామం నుంచి 2,524.13  కరాలను సేకరిం చాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వర కు 1204.14 ఎకరాలను తీసేసుకున్నారు. వీటితోపాటు మరో రెండు గ్రామాలైన రాయపురంలో 246.24 ఎకరాలు, ఆలూరులో 317.02 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను సైతం అధికారులు రద్దు చేశారు.
 
 పరిహారం ఎగ్గొటేందుకు ‘బీడు’ అంటున్నారు..
 సోలార్ పార్కు కోసం గట్టు మండల పరిధిలోని కాలూర్‌తిమ్మన్‌దొడ్డి, ఆలూరు, కుచినేర్ల, రాయపురంలల్లో 5,622 ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ చట్టం-2013 కింద ఈ భూములు సేకరిస్తే మార్కెట్ రేటుకు మూడింతల పరిహారంతోపాటు పునరావాస ప్యాకేజీ  కింద ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సి ఉంది. ఈ గ్రామాల్లో ఎకరా విలువ రూ.3 లక్షల వరకు ఉండగా... భూసేకరణ చట్టం కింద ఒక్కో ఎకరాకు రూ.9 లక్షల చొప్పున మొత్తం రూ.505 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉం టుంది. అయితే పరిహారం ఎగ్గొట్టేందుకు స్థానిక అధికారులు భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టారు. వాటిని బీడు భూములుగా చూపి, కేటాయింపులు రద్దు చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చి అసైన్డ్‌దారులు భూములను సాగు చేసుకోవడం లేదు కాబట్టి స్వాధీనం చేసుకుంటున్నామంటూ అందులో పేర్కొన్నారు. ఈ నోటీసుల వెంటనే కేటాయింపు రద్దు ఉత్తర్వులు జారీ చేసేశారు.
 
 బిందు సేద్యంతో మామిడి, వరి సాగు
 కుచినేర్లకు చెందిన ఈ రైతు పేరు ముత్త వేమారెడ్డి(60). ఈయనకు ఐదెకరాల అసైన్డ్ భూమి ఉంటే మూడెకరాల్లో ఏడేళ్లుగా మామిడి తోట, రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా మామిడి తోటకు నీళ్లు పెట్టుతున్నారు. విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. బావి సైతం తవ్వించారు. వేమారెడ్డి గతేడాది పంట నష్టపరిహారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయన సాగు చేస్తున్న భూముల్ని బీడుగా పేర్కొంటూ అధికారులు కేటాయింపులు రద్దు చేశారు.
 
 చనిపోయిన రైతుకు షోకాజ్ నోటీసు
 కుచినేర్లకు చెందిన ఉట్టి బాబు(24) అనే రైతు 2011 డిసెంబర్ 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారసత్వంగా బాబుకు సంక్రమించిన 2.5 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ అతడి పేరుతో అధికారులు గత సెప్టెంబర్‌లో కుటుంబ సభ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
 
 పరిహారం ఇప్పించండి
 కాలూర్ తిమ్మన్‌దొడ్డికి చెందిన దళిత రైతు దొమ్మరి శేషాద్రి కుటుంబానికి 15 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా, పదెకరాల్లో  మామిడి, నిమ్మ, దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు 5 బోర్లు వేశారు. ఈ భూములనే బ్యాంకులో తనఖా పెట్టి తీసుకున్న రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. బ్యాంకు రుణం తీసుకున్నట్లు పాసుపుస్తకాల్లో నమోదై ఉంది. ఈ 15 ఎకరాల అసైన్డ్ భూమికి పరిహారంగా కనీసం 5 ఎకరాల పట్టా భూమి ఇప్పించాలని శేషాద్రి కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement