Solar Park
-
ఇసుక నుంచి సోలార్ ప్యానెల్స్.. ఎలా తయారు చేస్తారో తెలుసా?
గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కేంద్రంగా సోలార్ ప్యానెల్ గిగాఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆర్ఐఎల్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ సోల్ ప్యానెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రసంగించారు. జామ్ నగర్లో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరుతో 5,000 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా ఫ్యాక్టరీ నిర్మాణాలు పూర్తి చేసుకొని, 2025 చివరి నాటికి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ గిగా ఫ్యాక్టరీలో ఇసుక నుంచి సోలార్ ప్యానళ్లను తయారు చేస్తామని, వీటితో పాటు పీవీ మాడ్యూల్స్, బ్యాటరీలు, వేపర్స్, ఇన్గట్స్, పాలిసిలికాన్, గ్లాస్‌లను తయారు కానున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ గిగా ఫ్యాక్టరీ 5,000 ఎకరాల్లో నిర్మిస్తున్న సోలార్ ఈ గిగా ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందుకోసం సుమారు రూ.75,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఇప్పటికే ముఖేష్ అంబానీ రిలయన్స్ తన 41వ ఏజీఎం సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా సంస్థ కొనుగోలు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైనా ప్రభుత్వానికి చెందిన రసాయనాలు తయారు చేసే చైనా నేషనల్ బ్లూస్టార్ గ్రూప్‌కు చెందిన ఆర్ఈసీ సోలార్ సంస్థను 771 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. 28 ఏళ్లక్రితం స్థాపించిన ఈ కంపెనీ సింగపూర్ కేంద్రంగా పీవీ సెల్స్, మాడ్యుల్స్‌ను తయారు చేసేది. వార్షిక సోలార్ ప్యానెల్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 గిగావాట్స్(GW) ఉంటుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 10GW కెపాసిటీని ఇన్స్టాల్ చేసింది. -
ఆ భూములపై రైతులకే హక్కులు..
సాక్షి, అమరావతి: రాయదుర్గం సోలార్ పార్క్ కోసం రైతుల నుంచి భూములను సేకరించడం లేదని, ప్రభుత్వం కేవలం లీజు అగ్రిమెంట్ మాత్రమే చేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ నెడ్‌క్యాప్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. - రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులుంటాయి. ఎకరానికి ఏటా ఇచ్చే లీజును ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పెంచి రైతులకు సోలార్ పార్కు ద్వారా అధిక ఆదాయం సమకూరేలా చేసింది. రైతులకు ఇంత అధిక ఆదాయం వచ్చేలా చేస్తుంటే ప్రతిపక్షం రైతులకు ద్రోహం చేసేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం. - రైతుల ఆదాయం పెంచేలా ప్రభుత్వం పాలసీ తెచ్చింది. రైతుల నుంచి లీజుకు తీసుకునే భూమికి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు చెల్లించడమే కాకుండా ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచుతుంది. భూములను లీజుకు తీసుకోవడంలో నెడ్‌క్యాప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రైతులు పూర్తిగా అంగీకారం తెలిపాకే లీజుకు తీసుకుంటోంది. రాష్ట్రంలో నాలుగు సోలార్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటైంది. - నెడ్‌క్యాప్ అనుభవం లేని సంస్థ అనడంలో అర్థంలేదు. నెడ్‌క్యాప్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. దీర్ఘకాలంగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. -
సాగరంలో సౌరవిహారం..
ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల జోరు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సౌరశక్తితో నడిచే వాహనాలు కూడా కొన్నిచోట్ల నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన జాహా హాడిడ్ ఆర్కిటెక్ట్స్ సంస్థ వందశాతం సౌరశక్తితో పనిచేసే 42 మీటర్ల పొడవైన విలాసవంతమైన నౌకను రూపొందించింది. ఈ నౌక పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఇందులోని బ్యాటరీలను నిరంతరం చార్జ్ చేస్తుంటాయి. ఫలితంగా పొద్దుగూకిన తర్వాత కూడా ఈ బ్యాటరీలు భేషుగ్గా పనిచేస్తాయి. మామూలు ఇంధనంతో పనిచేసే నౌకలు దాదాపు 40 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఈ సౌరనౌక నుంచి కార్బన్ డయాక్సైడ్ ఏమాత్రం విడుదల కాదు. ఇలాంటి వాహనాలు విరివిగా వినియోగంలోకి తెస్తే, ఉద్గారాల జోరుకు కళ్లాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!
కార్బన్‌డైయాక్సైడ్ పేరు చెబితేనే... విషవాయువు అన్న భావన మన మనసులో మెదలుతుంది. ఇది నిజం కూడా. అయితే ఈ విషం నుంచే శరీరానికి పుష్టినిచ్చే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేందుకు సోలార్ ఫుడ్స్ అనే కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గాల్లోంచి సేకరించే కార్బన్‌డైయాక్సైడ్ ను సోలిన్ అనే ప్రొటీన్‌గా మార్చేందుకు ఈ కంపెనీ ఓ వినూత్నమైన టెక్నాలజీని రూపొందించింది. ఆకు కూరలు, కాయగూరల వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ల కంటే సోలిన్ ప్రొటీన్ వందరెట్లు ఎక్కువ వాతావరణ అనుకూలమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, సోలార్ ఫుడ్స్ సీఈవో పసి వైనిక్కా తెలిపారు. సోలార్ ఫుడ్స్ అభివృద్ధి చేసిన ప్రక్రియలో మొట్టమొదటగా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. ఇందులోని హైడ్రోజన్‌కు కార్బన్‌డైయాక్సైడ్, పొటాషియం, సోడియం, కొన్ని ఇతర పోషకాలను చేరుస్తారు. ఫలితంగా తయారైన పదార్థాన్ని సూక్ష్మజీవులకు ఆహారంగా ఇచ్చినప్పుడు 50 శాతం ప్రొటీన్‌తోపాటు 25 శాతం కార్బోహైడ్రేట్ల్రు, పదిశాతం వరకూ కొవ్వులు ఉంటాయి. వ్యవసాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ప్రొటీన్ ఉత్పత్తి కావడం గమనార్హం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో సోలిన్ ప్రొటీన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రొటీన్‌షేక్ లేదా పెరుగులాంటి పానీయం రూపంలో దీన్ని అందుబాటులోకి తెస్తామని పసి వైనిక్కా తెలిపారు. -
సోలార్ ప్రాజెక్టులో గొడ్డళ్లతో విధ్వంసం
సాక్షి, జమ్మలమడుగు/మైలవరం(కడప) : మైలవరం మండల పరిధిలోని పొన్నంపల్లి, రామచంద్రాయపల్లి తది తర ప్రాంతాల పరిధిలో ఉన్న సోలార్ ప్రాజెక్టులో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు ప్రాజెక్టులో ఉన్న దాదాపు 1719 సోలార్ మాడ్యుల్స్‌ను గొడ్డళ్లతో పగులగొట్టారు. సోమవారం తెల్లవారు జామున సోలార్ అధికారులు విషయాన్ని తెలుసుకున్నారు. రూ. 3 కోట్ల నష్టం.. ఐదువేల ఎకరాల్లో రూ.6వేల కోట్లతో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. అందులో మొదటి విడత కింద రూ.1500 కోట్లతో 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఎవరూ లేని సమయంలో దుండగులు1719 సోలార్కు సంబంధించిన మాడ్యుల్స్ పగులగొట్టినట్లు కంపెనీ యాజమాన్యం గుర్తించింది. పగుల కొట్టిన మాడ్యుల్స్ విలువ దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు మైలవరం పోలీసు స్టేషన్లో ఎస్ఐ పెద్దినేని ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనేనా.! సోలార్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీకి చెందిన నాయకులు సోలార్ ప్లాంట్‌లో పనులు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కంపెనీ యాజమాన్యం కొందరిని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వారు కక్ష గట్టి సోలార్ మాడ్యుల్స్‌ను పగులగొట్టారనే వాదన స్థానిక అధికారులు, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి వినిపిస్తోంది. -
ప్రపంచ దేశాలకే ఆదర్శం
- శకునాల- గని మధ్య సోలార్ పార్కు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ - నిర్మాణ పనుల పరిశీలన - జూన్ నెలలో ప్రారంభానికి సన్నాహాలు ఓర్వకల్లు : పెరిగిపోతున్న ఇంధన అవసరాలను అధిగమించే దిశగా గడివేముల మండలం శకునాల-గని గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ పార్కు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా మారుతుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. అజయ్‌జైన్‌తో పాటు జేసీ హరికిరణ్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, సోలార్ ప్రాజెక్టు ఎండీ ఆదిశేషు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి శుక్రవారం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ 1000 మెగా వాట్ల సామర్థ్యం కల్గిన పార్కుకు సంబంధించి ఇప్పటివరకు 900 మెగా వాట్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగతా 100 మెగావాట్ల పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఎండీ ఆదిశేషుకు సూచించారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఇటీవలే మరో 300 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కోసం సేకరించిన భూములను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనాథ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన... : సోలార్ బాధిత రైతులకు పరిహారం చెల్లించే వరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంగీకరించేంది లేదని పేర్కొంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు నాగన్న, చంద్రబాబు, రామన్న తదితరులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తర్వాత అజయ్‌జైన్‌కు వినతిపత్రం అందించారు. -
కర్నూలుకు ప్రధాని మోదీ!
- జూన్‌లో భారీ సోలార్ పార్క్ ప్రారంభోత్సవం - జపాన్ ప్రధానికీ ఆహ్వానం... సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచంలోనే అతిపెద్దదైన కర్నూలు జిల్లాలోని సోలార్ పార్కు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉంది. ఒకే చోట ఏకంగా 1000 మెగావాట్ల సోలార్ పార్కు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. కర్నూలు జిల్లాలోని గని–శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటైన ఈ మెగా సోలార్ పార్కు జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సుమారు 900 మెగావాట్ల సామర్థ్యం వరకూ సోలార్ పార్కు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 100 మెగావాట్ల పనులు కూడా పూర్తయిన తర్వాత జూన్ నెలలో ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇక్కడ సోలార్ ప్లాంటును నెలకొల్పిన జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ద్వారా జపాన్ ప్రధానిని కూడా రప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఎక్కువ రేటుకు ఒప్పందాలెందుకు..!
- డిస్కంలను ప్రశ్నించిన టీఎస్ఈఆర్సీ - వినియోగదారులపై అధిక భారం మోపొద్దు సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో చౌకగా లభిస్తున్న సౌర విద్యుత్తును ఎక్కువ రేటుతో కొనుగోలు చేసేలా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) డిస్కంలను ప్రశ్నించింది. సోలార్ పార్కుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? ఉమ్మడి రాష్ట్ర నియంత్రణ మండలి కాలంలో కుదుర్చుకున్న పీపీఏలపై అప్పటి కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదు? అని వివరణ కోరింది. సోలార్ పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 2017 మార్చి వరకే గడువు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచొద్దని ఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. నేరుగా సోలార్ పవర్ ఉత్పత్తి సంస్థలతోనే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని, త్రైపాక్షిక ఒప్పందాలతో వినియోగదారులపై అధిక భారం మోపవద్దని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్రిచ్ ఎనర్జీ, రేయ్స్ పవర్ ఇన్ఫ్రా కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్సీ శుక్రవారం బహిరంగ విచారణ నిర్వహించింది. సింగరేణి భవన్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ విచారణ నిర్వహించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఆర్ఈడీసీ చైర్మన్ శ్రీనివాస్‌ను పలు అంశాలపై కమిషన్ సభ్యులు వివరణ కోరారు. సోలార్ పార్కుకు ఉమ్మడి రాష్ట్రంలో చట్టబద్ధత లేదని ఏపీపీసీసీ(ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేస్ కో ఆర్డినేషన్ కమిటీ) ఇచ్చిన అనుమతిని ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని అడిగింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన పలువురు తమ వాదనలను ఈఆర్సీ ఎదుట వినిపించారు. ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నారు కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 20 ఏళ్ల పాటు రూ.4.50కే సోలార్ విద్యుత్తు అందిస్తామని అధికారికంగా లేఖ రాసింది. ఈ రోజుల్లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ విద్యుత్తు లభ్యమవుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా యూనిట్‌కు రూ.6.49 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా జెన్కో ప్రాజెక్టులను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. దీంతో డిస్కంలు రూ.623 కోట్లను జెన్కోకు వృథాగా చెల్లించాల్సి వస్తోంది. -వేణుగోపాల్‌రావు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ రూ.4.50కే అనుమతించాలి ఎన్రిచ్ సంస్థ 60 మెగావాట్లకు అనుమతి తీసుకున్నా 30 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తోంది. ఈ ఒప్పందాన్ని 30 మెగావాట్లకే నియంత్రించాలి. యూనిట్‌కు రూ.4.50కు మించకుండా ధరను నిర్ణయించాలి. - భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో 202 మెగావాట్లకు ఉత్పత్తికి అర్హత సాధించాం. సోలార్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో, ఈఆర్సీ అనుమతికి లేఖ రాశాం. 183 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పీపీఏ కుదిరింది. ఇతర ఉత్పత్తి సంస్థలతో కలసి 106 మెగావాట్లు సరఫరా చేస్తున్నాం. పీపీఏను టీఎస్ఈఆర్సీ అనుమతించకపోవటంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాం. - ఎన్రిచ్ సంస్థ ప్రతినిధి ప్రదీప్ పాటిల్ తక్కువ కోట్ రేట్‌కే పీపీఏ 2012లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి టెండర్లు పిలిచాం. 183 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు వచ్చాయి. తక్కువ ధర కోట్ చేసిన ప్రకారమే రూ.6.49 చొప్పున 34 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. అనుకున్నంత స్పందన రానందున రూ.6.49 రేటుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. అప్పుడు 202 మెగావాట్ల ఉత్పత్తికి కంపెనీలు ముందుకొచ్చాయి. - టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి -
సోలార్ పార్కుల అభివృద్ధికి భారత్ కు రూ.5,681 కోట్లు
యూఎస్ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్‌లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్‌కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి. -
పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం
మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్కు కోసం పచ్చని భూములపై ‘బీడు’ ముద్ర గట్టు నుంచి సాక్షి ప్రతినిధులు మహమ్మద్ ఫసియొద్దీన్, జి.ప్రతాప్‌రెడ్డి రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం గల మండలంగా గట్టు రికార్డులకెక్కింది. దశాబ్దాల కిందటి వరకు ఈ మండలంలో కనుచూపు మేర పచ్చదమే కనిపించేది కాదు. అప్పట్లో తొండలు గూడు పెట్టని భూములవి. ఇక్కడి రైతులకు వలసలే దిక్కు. 1950 నుంచి దశల వారీగా జరిగిన అసైన్డ్ భూముల కేటాయింపులతో ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. రాళ్లు రప్పలతో నిండిన భూములను చదును చేసి ఇక్కడి కుటుంబాలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయి. వారసత్వంగా ఈ భూములు రెండు మూడు తరాల చేతులు మారాయి. ప్రస్తుతం ఆ భూముల్లో బోరు, బావులు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం పరిజ్ఞానంతో సాగుచేస్తున్నారు. సూర్య కిరణాలు తీవ్రత ఎక్కువగా ఉండే గట్టు మండలం సౌర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో అత్యంత అనువైన ప్రాంతమని ఓ సర్వేలో తేలింది. ఇక్కడ 1000 మెగావాట్ల సోలార్ పార్కు మంజూరైంది. ఇప్పుడిదే ఆ రైతుల పాలిట శాపంగా మారింది. సంజాయిషీ కూడా లేకుండా రద్దు కేటాయించిన మూడేళ్లలోపు సాగులోకి తీసుకోరాకపోతే అసైన్డ్ భూముల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేయవచ్చని అసెన్డ్ భూముల చట్టం పేర్కొంటోంది. ఈ ని‘బంధ’నల్లోనే అన్యాయంగా రైతులను ఇరికించారు. గతేడాది స్థానిక వీఆర్వోలు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. వారి నివేదిక ఆధారంగానే.. బీడుగా పడి ఉన్న ఆ భూముల కేటాయింపులను ఎందుకు రద్దు చేయవద్దో చెప్పాలంటూ గత సెప్టెంబ ర్లో రైతులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఏప్రిల్ 2015న జారీ చేసినట్టు నోటీసులపై పాత తేదీలు వేశారు. కొందరు రైతులకు షోకాజ్‌తో పాటే భూ కేటాయింపుల రద్దు ఉత్తర్వులను ఒకేసారి ఇచ్చారు. ఆందోళనకు గురైన కొందరు రైతులు ఈ నోటీసులు స్వీకరించ లేదు. రైతుల సంజాయిషీ వినకుండానే సోలార్ పార్కు కోసం నాలుగు గ్రామాల్లో ఇప్పటి వరకు 3,354.37 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులు రద్దు చేసేశారు. ఇందులో పడావుగా పెట్టడం వల్ల 2,130 ఎకరాలను, మిగులుగా ఉండడంతో 1,226.26 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేశామని గట్టు మండల రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఆ రెండు గ్రామాలు ఇక ఎడారేనా.. సోలార్ పార్కు కోసం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కుంటే సగానికి పైగా వ్యవసాయం ఆగిపోయి కుచినేర్ల, కాలూర్ తిమ్మన్దొడ్డి గ్రామాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. జీవనోపాధి కోసం బెంగళూరు, రాయచూరు, హైదరాబాద్‌కు వలస వెళ్లక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుచినేర్ల జనాభా 7,259 ఉండగా 10,099 ఎకరాల భూములున్నాయి. ఇందులో 1,146 ఎకరాల తరి, 6,568 ఎకరాలు మెట్ట భూములు మాత్రమే సాగుకు యోగ్యమైనవి. సోలార్ పార్కు కోసం ఈ గ్రామం నుంచి 2,072.05 ఎకరాలు సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 1,586.35 ఎకరాలను లాగేసుకుంది. ఇక కాలూర్‌తిమ్మన్‌దొడ్డిలో జనాభా 2,625 ఉండగా కేవలం 5,131 ఎకరా ల భూములే ఉన్నాయి. ఉన్నాయి. ఇందులో 679 ఎకరాల తరి, 2,911 ఎకరాల మెట్ట భూ ములు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రామం నుంచి 2,524.13 కరాలను సేకరిం చాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వర కు 1204.14 ఎకరాలను తీసేసుకున్నారు. వీటితోపాటు మరో రెండు గ్రామాలైన రాయపురంలో 246.24 ఎకరాలు, ఆలూరులో 317.02 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను సైతం అధికారులు రద్దు చేశారు. పరిహారం ఎగ్గొటేందుకు ‘బీడు’ అంటున్నారు.. సోలార్ పార్కు కోసం గట్టు మండల పరిధిలోని కాలూర్‌తిమ్మన్‌దొడ్డి, ఆలూరు, కుచినేర్ల, రాయపురంలల్లో 5,622 ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ చట్టం-2013 కింద ఈ భూములు సేకరిస్తే మార్కెట్ రేటుకు మూడింతల పరిహారంతోపాటు పునరావాస ప్యాకేజీ కింద ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సి ఉంది. ఈ గ్రామాల్లో ఎకరా విలువ రూ.3 లక్షల వరకు ఉండగా... భూసేకరణ చట్టం కింద ఒక్కో ఎకరాకు రూ.9 లక్షల చొప్పున మొత్తం రూ.505 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉం టుంది. అయితే పరిహారం ఎగ్గొట్టేందుకు స్థానిక అధికారులు భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టారు. వాటిని బీడు భూములుగా చూపి, కేటాయింపులు రద్దు చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చి అసైన్డ్‌దారులు భూములను సాగు చేసుకోవడం లేదు కాబట్టి స్వాధీనం చేసుకుంటున్నామంటూ అందులో పేర్కొన్నారు. ఈ నోటీసుల వెంటనే కేటాయింపు రద్దు ఉత్తర్వులు జారీ చేసేశారు. బిందు సేద్యంతో మామిడి, వరి సాగు కుచినేర్లకు చెందిన ఈ రైతు పేరు ముత్త వేమారెడ్డి(60). ఈయనకు ఐదెకరాల అసైన్డ్ భూమి ఉంటే మూడెకరాల్లో ఏడేళ్లుగా మామిడి తోట, రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా మామిడి తోటకు నీళ్లు పెట్టుతున్నారు. విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. బావి సైతం తవ్వించారు. వేమారెడ్డి గతేడాది పంట నష్టపరిహారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయన సాగు చేస్తున్న భూముల్ని బీడుగా పేర్కొంటూ అధికారులు కేటాయింపులు రద్దు చేశారు. చనిపోయిన రైతుకు షోకాజ్ నోటీసు కుచినేర్లకు చెందిన ఉట్టి బాబు(24) అనే రైతు 2011 డిసెంబర్ 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారసత్వంగా బాబుకు సంక్రమించిన 2.5 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ అతడి పేరుతో అధికారులు గత సెప్టెంబర్‌లో కుటుంబ సభ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పరిహారం ఇప్పించండి కాలూర్ తిమ్మన్దొడ్డికి చెందిన దళిత రైతు దొమ్మరి శేషాద్రి కుటుంబానికి 15 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా, పదెకరాల్లో మామిడి, నిమ్మ, దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు 5 బోర్లు వేశారు. ఈ భూములనే బ్యాంకులో తనఖా పెట్టి తీసుకున్న రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. బ్యాంకు రుణం తీసుకున్నట్లు పాసుపుస్తకాల్లో నమోదై ఉంది. ఈ 15 ఎకరాల అసైన్డ్ భూమికి పరిహారంగా కనీసం 5 ఎకరాల పట్టా భూమి ఇప్పించాలని శేషాద్రి కోరుతున్నారు. -
మెగా సోలార్ పార్కుకు ఓకే
- తొర్మామిడిలో ఎన్టీపీసీ ప్రతినిధి బృందం స్థల పరిశీలన - 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు - 1300 ఎకరాలు కేటాయించాలని ఎన్‌హెచ్‌పీసీ లేఖ - టీఐఐసీకి స్థల బదలాయింపు పనుల్లో జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మెగా సౌర విద్యుత్ ప్లాంట్ రానుంది. బంట్వారం మండలం తొర్మామిడిలో ఈ సోలార్‌పార్కును ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ముందుకొచ్చింది. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది నవంబర్‌లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్వీవీ) సంస్థల ప్రతినిధులు తోర్మామిడిని సందర్శించారు. బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్ర సర్కారు సౌర విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బంట్వారం అనుబంధ గ్రామమైన బస్వాపూర్ సర్వే నంబర్ 263లోని 1300 ఎకరాల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల పరిశీలన జరిపిన ప్రతినిధి బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్‌హెచ్‌పీసీ మెగా సోలార్‌పార్కును నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ)కు ఎన్‌హెచ్‌పీసీ లేఖ రాసింది. ఈ క్రమంలో తక్షణమే ఈ భూమిని బదలయించాలని ఆదేశిస్తూ ఆ సంస్థ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు స్పష్టం చేసింది. -
మహబూబ్‌నగర్‌లో త్వరలో సోలార్ పార్క్
ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర పొదుపు పాటించిన 48 కంపెనీలకు అవార్డుల ప్రదానం సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్, సహజ, ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రదీప్‌చంద్ర అన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో విద్యుత్ పొదుపు అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్2014 అంశంపై మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 15వ జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశంలో విద్యుత్, ఇంధన వనరులను పొదుపు చేసిన 48 కంపెనీలకు అవార్డులను అందించారు. జనరల్, ఆటోమోబైల్, బిల్డింగ్, సిమెంట్, పవర్, పేపర్, షుగర్ విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అశ్రీయ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్., టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెక్కన్ పార్క్, విప్రో లిమిటెడ్, సీటీఆర్ఎల్ఎస్ డాటా సెంటర్ ప్రై.లిమిటెడ్‌లు ఉన్నాయి. అనంతరం ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. మారుతోన్న కాలంలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారినట్టు తెలిపారు. అందుకే పారిశ్రామిక పాలసీ రూపకల్పనలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. ఇంధన, సహజ వనరుల పొదుపు అనేది వ్యక్తితో ముడిపడకుండా పారిశ్రామిక స్థాయిలో జరగాల్సిన అవసరముందని గుర్తుచేశారు. పరిశ్రమలు తమ కార్యకలాపాల వినియోగంలో పాత పద్ధతుల్లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్పర్సన్ వనితా దాట్ల, సీఐఐ గోద్రెజ్ జీబీసీ నేషనల్ అవార్డ్ స్కీమ్ చైర్మన్ ఎల్ఎస్ గణపతి, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ పాల్గొన్నారు. -
సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తున్న సైరస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సైరస్ సోలార్ రెండు సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నల్గొండలో 100 మెగావాట్లతో, మరొకటి కర్నాటకలో 50 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతోంది. పార్కు స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులను నల్గొండ పార్కులో ఆరు నెలల్లో, కర్నాటక పార్కులో ఏడాదిలో పూర్తి చేస్తామని సైరస్ సోలార్ సీఈవో, ఫౌండర్ విష్ణువర్ధన్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకుగాను రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. పార్కుల్లో పెట్టుబడి పెట్టేందుకు 10-15 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. ప్రైవేటు ఈక్విటీ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎంత వాటా విక్రయించేదీ ఇప్పుడే చెప్పలేమని, మెజారిటీ వాటాదారుగా తాము ఉంటామని అన్నారు. సోలార్ పరికరాల తయారీ.. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన సైరస్ సోలార్ దేశవ్యాప్తంగా ఇప్పటికే 90 మెగావాట్ల ప్రాజెక్టులను వివిధ కంపెనీల కోసం ఏర్పాటు చేసింది. మరో 100 మెగావాట్లకు ఆర్డర్లున్నాయని, 18 నెలల్లో పూర్తి చేస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. తమతో కలిసి సోలార్ పరికరాల తయారీ చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ సమీపంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాంటును నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.100 కోట్లు వ్యయం చేస్తామన్నారు. సోలార్ మాడ్యులర్లు, ఫ్రేమ్‌ల వంటి పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. విద్యుత్ కొరత నుంచి బయట పడాలంటే సౌర విద్యుత్ చక్కని పరిష్కారమని అన్నారు. సోలార్ పాలసీ కోసం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే సోలార్ పాలసీ కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నామని సీఈవో చెప్పారు. పంపిణీ నష్టాలు, రాష్ట్రాలు, డివిజన్ల మధ్య పంపిణీ చార్జీల వంటి అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందన్నారు. సోలార్ పంపుసెట్ల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. -
పాలమూరు జిల్లాలో భారీ సోలార్ పార్కు
5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ప్లాంటు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు మండలంలో భారీ సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన పార్కును ఏర్పాటు చేసేందుకు సోలార్ ఎనర్జీ కో-ఆపరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సోలార్ పార్కులో రూ. 600 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. మొదటి దశలో 500 మెగావాట్లు, రెండో దశలో మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పార్కు అమలు ఏజెన్సీగా నెడ్‌క్యాప్ వ్యవహరించనుందన్నారు. సోలార్ ప్లాంట్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల(విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు మొదలైనవి)ను ఎస్ఈసీఐ అభివృద్ధి చేయనుంది. ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేయనున్నారు.