- ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి
- రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర
- పొదుపు పాటించిన 48 కంపెనీలకు అవార్డుల ప్రదానం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్, సహజ, ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రదీప్‌చంద్ర అన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో విద్యుత్ పొదుపు అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్2014 అంశంపై మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 15వ జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దేశంలో విద్యుత్, ఇంధన వనరులను పొదుపు చేసిన 48 కంపెనీలకు అవార్డులను అందించారు. జనరల్, ఆటోమోబైల్, బిల్డింగ్, సిమెంట్, పవర్, పేపర్, షుగర్ విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అశ్రీయ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్., టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెక్కన్ పార్క్, విప్రో లిమిటెడ్, సీటీఆర్‌ఎల్‌ఎస్ డాటా సెంటర్ ప్రై.లిమిటెడ్‌లు ఉన్నాయి.
అనంతరం ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. మారుతోన్న కాలంలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారినట్టు తెలిపారు. అందుకే పారిశ్రామిక పాలసీ రూపకల్పనలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. ఇంధన, సహజ వనరుల పొదుపు అనేది వ్యక్తితో ముడిపడకుండా పారిశ్రామిక స్థాయిలో జరగాల్సిన అవసరముందని గుర్తుచేశారు.
పరిశ్రమలు తమ కార్యకలాపాల వినియోగంలో పాత పద్ధతుల్లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్‌పర్సన్ వనితా దాట్ల, సీఐఐ గోద్రెజ్ జీబీసీ నేషనల్ అవార్డ్ స్కీమ్ చైర్మన్ ఎల్‌ఎస్ గణపతి, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ పాల్గొన్నారు.