సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తున్న సైరస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సైరస్ సోలార్ రెండు సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నల్గొండలో 100 మెగావాట్లతో, మరొకటి కర్నాటకలో 50 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతోంది. పార్కు స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులను నల్గొండ పార్కులో ఆరు నెలల్లో, కర్నాటక పార్కులో ఏడాదిలో పూర్తి చేస్తామని సైరస్ సోలార్ సీఈవో, ఫౌండర్ విష్ణువర్ధన్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
మౌలిక వసతుల కల్పనకుగాను రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. పార్కుల్లో పెట్టుబడి పెట్టేందుకు 10-15 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. ప్రైవేటు ఈక్విటీ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎంత వాటా విక్రయించేదీ ఇప్పుడే చెప్పలేమని, మెజారిటీ వాటాదారుగా తాము ఉంటామని అన్నారు.
సోలార్ పరికరాల తయారీ..
ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ అయిన సైరస్ సోలార్ దేశవ్యాప్తంగా ఇప్పటికే 90 మెగావాట్ల ప్రాజెక్టులను వివిధ కంపెనీల కోసం ఏర్పాటు చేసింది. మరో 100 మెగావాట్లకు ఆర్డర్లున్నాయని, 18 నెలల్లో పూర్తి చేస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. తమతో కలిసి సోలార్ పరికరాల తయారీ చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ సమీపంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాంటును నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.100 కోట్లు వ్యయం చేస్తామన్నారు. సోలార్ మాడ్యులర్లు, ఫ్రేమ్‌ల వంటి పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. విద్యుత్ కొరత నుంచి బయట పడాలంటే సౌర విద్యుత్ చక్కని పరిష్కారమని అన్నారు.
సోలార్ పాలసీ కోసం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే సోలార్ పాలసీ కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నామని సీఈవో చెప్పారు. పంపిణీ నష్టాలు, రాష్ట్రాలు, డివిజన్ల మధ్య పంపిణీ చార్జీల వంటి అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందన్నారు. సోలార్ పంపుసెట్ల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు.