గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కేంద్రంగా సోలార్ ప్యానెల్ గిగాఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆర్‌ఐఎల్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ సోల్ ప్యానెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రసంగించారు.
జామ్ నగర్‌లో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరుతో 5,000 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా ఫ్యాక్టరీ నిర్మాణాలు పూర్తి చేసుకొని, 2025 చివరి నాటికి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ గిగా ఫ్యాక్టరీలో ఇసుక నుంచి సోలార్ ప్యానళ్లను తయారు చేస్తామని, వీటితో పాటు పీవీ మాడ్యూల్స్, బ్యాటరీలు, వేపర్స్, ఇన్‌గట్స్, పాలిసిలికాన్, గ్లాస్‌లను తయారు కానున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ గిగా ఫ్యాక్టరీ
5,000 ఎకరాల్లో నిర్మిస్తున్న సోలార్ ఈ గిగా ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందుకోసం సుమారు రూ.75,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఇప్పటికే ముఖేష్ అంబానీ రిలయన్స్ తన 41వ ఏజీఎం సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
చైనా సంస్థ కొనుగోలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైనా ప్రభుత్వానికి చెందిన రసాయనాలు తయారు చేసే చైనా నేషనల్ బ్లూస్టార్ గ్రూప్‌కు చెందిన ఆర్‌ఈసీ సోలార్ సంస్థను 771 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. 28 ఏళ్లక్రితం స్థాపించిన ఈ కంపెనీ సింగపూర్ కేంద్రంగా పీవీ సెల్స్, మాడ్యుల్స్‌ను తయారు చేసేది. వార్షిక సోలార్ ప్యానెల్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 గిగావాట్స్(GW) ఉంటుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 10GW కెపాసిటీని ఇన్‌స్టాల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment