ఎక్కువ రేటుకు ఒప్పందాలెందుకు..!
- డిస్కంలను ప్రశ్నించిన టీఎస్‌ఈఆర్‌సీ
- వినియోగదారులపై అధిక భారం మోపొద్దు
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో చౌకగా లభిస్తున్న సౌర విద్యుత్తును ఎక్కువ రేటుతో కొనుగోలు చేసేలా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్‌సీ) డిస్కంలను ప్రశ్నించింది. సోలార్ పార్కుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? ఉమ్మడి రాష్ట్ర నియంత్రణ మండలి కాలంలో కుదుర్చుకున్న పీపీఏలపై అప్పటి కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదు? అని వివరణ కోరింది. సోలార్ పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 2017 మార్చి వరకే గడువు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచొద్దని ఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది.
నేరుగా సోలార్ పవర్ ఉత్పత్తి సంస్థలతోనే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని, త్రైపాక్షిక ఒప్పందాలతో వినియోగదారులపై అధిక భారం మోపవద్దని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌రిచ్ ఎనర్జీ, రేయ్స్ పవర్ ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్‌సీ శుక్రవారం బహిరంగ విచారణ నిర్వహించింది. సింగరేణి భవన్‌లోని ఈఆర్‌సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ విచారణ నిర్వహించారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఆర్‌ఈడీసీ చైర్మన్ శ్రీనివాస్‌ను పలు అంశాలపై కమిషన్ సభ్యులు వివరణ కోరారు. సోలార్ పార్కుకు ఉమ్మడి రాష్ట్రంలో చట్టబద్ధత లేదని ఏపీపీసీసీ(ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేస్ కో ఆర్డినేషన్ కమిటీ) ఇచ్చిన అనుమతిని ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని అడిగింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన పలువురు తమ వాదనలను ఈఆర్‌సీ ఎదుట వినిపించారు.
ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నారు
కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 20 ఏళ్ల పాటు రూ.4.50కే సోలార్ విద్యుత్తు అందిస్తామని అధికారికంగా లేఖ రాసింది. ఈ రోజుల్లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ విద్యుత్తు లభ్యమవుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా యూనిట్‌కు రూ.6.49 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా జెన్‌కో ప్రాజెక్టులను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. దీంతో డిస్కంలు రూ.623 కోట్లను జెన్‌కోకు వృథాగా చెల్లించాల్సి వస్తోంది.
-వేణుగోపాల్‌రావు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్
రూ.4.50కే అనుమతించాలి
ఎన్‌రిచ్ సంస్థ 60 మెగావాట్లకు అనుమతి తీసుకున్నా 30 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తోంది. ఈ ఒప్పందాన్ని 30 మెగావాట్లకే నియంత్రించాలి. యూనిట్‌కు రూ.4.50కు మించకుండా ధరను నిర్ణయించాలి. - భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి
సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌లో 202 మెగావాట్లకు ఉత్పత్తికి అర్హత సాధించాం. సోలార్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో, ఈఆర్‌సీ అనుమతికి లేఖ రాశాం. 183 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పీపీఏ కుదిరింది. ఇతర ఉత్పత్తి సంస్థలతో కలసి 106 మెగావాట్లు సరఫరా చేస్తున్నాం. పీపీఏను టీఎస్‌ఈఆర్‌సీ అనుమతించకపోవటంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాం. - ఎన్‌రిచ్ సంస్థ ప్రతినిధి ప్రదీప్ పాటిల్
తక్కువ కోట్ రేట్‌కే పీపీఏ
2012లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి టెండర్లు పిలిచాం. 183 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు వచ్చాయి. తక్కువ ధర కోట్ చేసిన ప్రకారమే రూ.6.49 చొప్పున 34 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. అనుకున్నంత స్పందన రానందున రూ.6.49 రేటుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. అప్పుడు 202 మెగావాట్ల ఉత్పత్తికి కంపెనీలు ముందుకొచ్చాయి.
- టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి