‘భూములు లాక్కుంటే ఊరుకోం..’
గద్వాల న్యూటౌన్: గట్టు మండలంలో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకుంటే ఉద్యమిస్తామని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్, అసంఘటిత కార్మికసంఘాల సమాఖ్య నాయకుడు గోపాల్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం స్థానిక రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 5,528 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వగా రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. రైతుల నుంచి భూములు తీసుకునేందుకు నోటీసులు జారీచేశారని విమర్శించారు. సాగు భూములను పడావు భూములుగా చూపించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూములు తీసుకునే ప్రయత్నాలు మానుకుని, గట్టు హైలెవల్ కెనాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. శేషాద్రి, చిన్నరాముడు, రాములు, నాగప్ప, గోవిందమ్మ, కొండమ్మలతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.