అక్రమ ఖ‘నిజం’!
పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఖనిజాన్ని తవ్వేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా యార్డు ముసుగులో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఖనిజం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
పెండ్లిమర్రి మండలంలో 10 ఇనుప ఖనిజం, రెండు డోలమైట్ మైనింగ్‌లు ఉన్నాయి. వాటిలో 9 మైనింగ్‌లకు ఖనిజాన్ని తవ్వేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు.
ఒక్క మైనింగ్‌కు మాత్రమే ఖనిజాన్ని తవ్వి తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. మైనింగ్‌లకు అనుమతులు ఇప్పట్లో వచ్చేలా లేవని భావించిన అధికారపార్టీకి చేందిన ఓ నేత మండలంలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 8,9లో అంజనీ లాజస్టిక్స్ పేరుతో ఇనుప ఖనిజం నిల్వ ఉంచుకునేందుకు గనులు, భూగర్భశాఖ అధికారుల నుంచి యార్డుకు అనుమతి తెచ్చుకున్నాడు. యార్డు ముసుగులో పర్మిట్ లేకుండానే రాత్రి పూట ఖనిజాన్ని తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులే సదరు నేతను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో పగడాలపల్లె, తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పొలాల్లో యార్డు పర్మిషన్ ఇవ్వాలని మైనింగ్ అధికారులకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పర్మిషన్ ఇస్తే అక్రమ రవాణా జరుగుతుంది. అందువల్ల అనుమతి ఇవ్వమని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నేతకు ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘అక్కడ యార్డుకు పర్మిషన్ ఇస్తే మనమే అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లు ఉంటుందని మైనింగ్ ఉన్నతాధికారికి చెప్పాం. అయినా అనుమతి ఇచ్చారు’ అని ఓ మైనింగ్ అధికారే పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వ ఆదాయానికి గండి
యార్డులో నుంచి ఖనిజాన్ని రవాణా చేసేటప్పుడు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఒక్కొక్క లారీకి 25, 35 టన్నుల ఖనిజాన్ని తరలించాలి. ఆ మేరకే రాయల్టీ రాస్తారు. కానీ ఒక్కో లారీకి 40, 45 టన్నుల ఖనిజాన్ని వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పర్మిషన్ ఇచ్చాను అంతే..!
తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పొలంలో అంజనీ లాజస్టిక్స్ పేరుతో యార్డు పర్మిషన్ ఇచ్చాను. ఖనిజం అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమ రవాణా గురించి కింది స్థాయి సిబ్బంది చూసుకుంటారు. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఏడీ గారిని అడగండి. పర్మిషన్ ఇచ్చాను అంటూ గనులు, భూగర్భశాఖ జిల్లా డెరైక్టర్ పుల్లయ్య సమాధానం ఇచ్చారు.