రంగారెడ్డి జిల్లాగా శంషాబాద్ | Shamshabad as Ranga Reddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాగా శంషాబాద్

Published Mon, Oct 3 2016 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

Shamshabad as Ranga Reddy district

వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లా యథాతథం
- మూడు రకాలుగా మండలాల వర్గీకరణ
- గండీడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చాలి
- సీఎం కీలక నిర్ణయాలు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మండలాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించనుంది. ఐదు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 ముఖ్యాంశాలివీ..
► తెలంగాణ కోసం ఉద్యమించిన కొండా వెంకట రంగారెడ్డి స్వగ్రామం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం. ఆ మండలం ప్రస్తుతం శంషాబాద్ జిల్లాలో చేరుతోంది. అందుకే శంషాబాద్ పేరు పెట్టాలనుకున్న జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలి. వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లా యథాతథంగా ఉంటుంది
► మూడు కేటగిరీలుగా మండలాలుండాలి. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే మండలాల్లో అధికార యంత్రాంగం ఒక విధంగా ఉండాలి. సాధారణ మండలాలకు అధికారుల కూర్పు ఒకలా ఉండాలి. చిన్న మండలాలకు అవసరమైన అధికారులుండాలి
► రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న గ్రామాలను విధిగా ఒకే మండలంలో కొనసాగించాలనే నియమం లేదు. ఆ గ్రామాలను రెండు వేర్వేరు మండలాల్లో చేర్చాల్సి వస్తే సదరు గ్రామాలన్నింటినీ ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి. రెవెన్యూ గ్రామం అనే వంకతో దూరంగా ఉన్నా సరే అదే మండల కేంద్రంలో కొనసాగించవద్దు
► ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాలు, కొత్తగా ఏర్పాటయ్యే కడ్తాల మండలం ప్రతిపాదిత శంషాబాద్(రంగారెడ్డి) జిల్లాలో చేర్చాలని ప్రజాభిప్రాయం వచ్చినందున అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
► కొడంగల్, బొమ్రాస్‌పేట మండలాలు వికారాబాద్ జిల్లాలో చేర్చాలి. దౌల్తాబాద్ మండలం ఏ జిల్లాలో ఉండాలనే విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలి
► కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దొమ్మరి పోచమ్మ పేరును గండి మైసమ్మ మండలంగా మార్చాలి
► నల్లగొండ జిల్లాలో ముసాయిదాలో ప్రకటించిన 7 కొత్త మండలాలతో పాటు మద్దిరాల, నేరెడుకొమ్ము, మల్లారెడ్డిగూడెం మండలాల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది
► సంస్థాన్ నారాయణపూర్ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలనే వినతులు వస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఈ మండలాన్ని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలి
► ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మండలం ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలి
► గండీడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చాలి
► ఆందోల్ నియోజకవర్గంలో వట్టిపల్లి మండలం ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలి
► ప్రతిపాదిత కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, ప్రతిపాదిత మెదక్ జిల్లాలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి
► కామారెడ్డి జిల్లాలో బీబీపేటను కొత్త మండలంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement