Telangana Electricity
-
విచారణకు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్
-
రివర్షన్లు.. ప్రమోషన్లు.. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల్లో మార్పులు జరగనున్నాయి. విద్యుత్ సంస్థలు గతంలో ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర విభజనకు ఒకరోజు ముందు అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా పదోన్నతులను సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో.. తెలంగాణ ఉద్యోగులు, గతంలో రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఏపీ ఉద్యోగులను కలిపి కొత్త సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం విద్యుత్ సౌధలో సమీక్షించారు. అయితే ఏపీకి రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఉద్యోగుల్లో చాలా మంది సీని యర్లు ఉన్నారని.. వారు కొత్త జాబితాల్లో పైన ఉంటారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ప్రమోషన్ పొందిన తెలంగాణ ఉద్యోగులు తిరిగి పాత హోదాలకు రివర్షనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కోల్పోయే వారిలో తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాలకు చెందినవారు 150 మందికిపైగా ఉంటారని పేర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే పొందిన పదోన్నతులకు రక్షణ కల్పించేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యుత్ మంతిజి.జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టికి విద్యుత్ సంస్థలు సుముఖంగా లేనట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదీ చదవండి: జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు -
ఎస్పీడీసీఎల్కు ఆరు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)కు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలలో సమష్టి ప్రతిభ కనబర్చినందుకు ఎస్పీడీసీఎల్కు మొదటి ర్యాంకు లభించింది. ఢిల్లీ పవర్ సంస్థకు రెండో ర్యాంకు రాగా, ఏపీ విద్యుత్ సంస్థకు మూడో ర్యాంకు లభించింది. సామర్థ్య నిర్వహణ, వినియోగదారుల సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పనితీరు సామర్థ్యంలో కూడా జాతీ యస్థాయిలో మొదటి, గ్రీన్ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా ఆన్లైన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల డిస్కంల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో అవార్డులను ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ నిరంతర, రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోన్న తెలంగాణ విద్యుత్ సంస్థలను, ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ఫ్రభుత్వం విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం అన్ని రకాల తోడ్పాటునందిస్తోంద న్నారు. ఎస్పీడీసీఎల్కు అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు. -
మేలో కూడా ‘కనీస’ వసూలే..
సాక్షి, హైదరాబాద్: గత ఏప్రిల్ తరహాలోనే ప్రస్తుత మే నెలలో కూడా గృహాలు (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), తాగునీటి సరఫరా (ఎల్టీ–6బీ) కేటగిరీల విషయంలో మీటర్ రీడింగ్ తీయకుండా ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్నారు. 2019 మే నెలలో వసూలు చేసిన విద్యుత్ బిల్లులకు సమానమైన బిల్లును ప్రస్తుత మే నెలలో ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. గృహేతర/వాణిజ్య సముదాయా లు (ఎల్టీ–2) , సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4), సాధారణ (ఎల్టీ–7), తాత్కాలిక (ఎల్టీ–8) కేటగిరీల వినియోగదారులకు మే నెల విద్యుత్ బిల్లు ల చెల్లింపు విషయంలో కాస్త ఊరట లభించనుంది. మే 7 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తే ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి కనీస బిల్లులు మాత్రమే వసూలు చేయనున్నారు. లాక్డౌన్ పొడిగించకపోతే మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు చెల్లించాల్సి ఉం టుంది. ఈ మేరకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ ముగిసే వరకు ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశముంది. లాక్డౌన్ ముగిసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి తాత్కాలిక విధానంలో చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దనున్నారు. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, డిస్కంల వెబ్సైట్ల ద్వారా వినియోగదారులందరికీ వారికి సంబంధించిన మే నెల బిల్లుల వివరాల ను తెలియజేయాలని ఈఆర్సీ కోరిం ది. లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం మీటర్ రీడింగ్ సేకరించకుండా ప్రత్యామ్నాయ పద్ధతి లోనే విద్యుత్ బిల్లులు వసూ లు చేసే అవకాశముంది. భారీ పరిశ్రమలకు వాస్తవ బిల్లింగ్.. హైటెన్షన్ కేటగిరీ (హెచ్‌టీ) పరిధిలోకి వచ్చే భారీ పరిశ్రమల నుంచి మీటర్ రీడింగ్ సేకరించి దాని ఆధారంగానే బిల్లులను జారీ చేస్తున్నారు. ప్రస్తుత మే నెలలో సైతం మీటర్ రీడింగ్ తీసి బిల్లులు చేయనున్నారు. అయితే, లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నష్టపోయిన నేపథ్యంలో ఫిక్స్డ్ చార్జీల వసూళ్లను ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కేవలం ఎనర్జీ చార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోనుంది. ఎవరూ నష్టపోకుండా చర్యలు.. లాక్డౌన్ కాలంలో మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా సగటున నెలకు ఎన్ని యూనిట్లు వినియోగించి ఉంటారని లెక్కించి ప్రత్యామ్నాయ విధానంలో వసూలు చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిచేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే అధికంగా బిల్లులు చెల్లించిన వారికి తదుపరి బిల్లులను ఈ మేరకు తగ్గించి సర్దుబాటు చేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే ఎవరైనా తక్కువ బిల్లులు చెల్లిస్తే తదుపరి కాలానికి సంబంధించిన బిల్లులను ఆ మేరకు పెంచి డిస్కంలు నష్టపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని డిస్కంలు తయారు చేసి ఈఆర్సీ నుంచి అనుమతి తీసుకోనున్నాయి. -
స్థానికత ఆధారంగానే విభజన జరగాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ)లు డిమాండ్ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాల్సిందేనని ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీఈఈజేఏసీ చైర్మన్ ఎన్.శివాజీ, టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు మింట్‌కాంపౌండ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా 582 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. -
30న నివేదిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఏఆర్ఆర్తోపాటు ఈఆర్సీకి సమర్పించడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి కొత్త విద్యుత్ టారిఫ్‌ను ఖరారు చేసేందుకు ఈఆర్సీకి కనీసం 120 రోజులు అవసరం కానుంది. ఏటా నవంబర్ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో వచ్చే ఏడాది టారిఫ్ పెంపు ప్రతిపాదనలు మినహా ఏఆర్ఆర్ నివేదికను మాత్రమే ఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గృహ, వాణిజ్యం తదితర కేటగిరీల వారీగా పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈఆర్సీకి అందజేయనున్నాయి. యూనిట్‌పై రూ.1.66 నష్టం.. ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు 2018–19లో డిస్కంలు సగటున రూ. 6.91 ఖర్చు చేయగా, బిల్లుల వసూళ్ల ద్వారా సగటున రూ.5.25 మాత్రమే ఆదాయాన్ని ఆర్జించాయి. ప్రతి యూనిట్ విద్యుత్ సరఫరాపై సగటున రూ.1.66 నష్టపోయాయి. 2015–16లో యూనిట్ విద్యుత్‌పై రూ.0.95 ఉన్న ఆదాయలోటు 2016–17లో రూ.1.55కు, 2017–18లో రూ.1.42కు, 2018–19లో 1.66కు పెరిగింది. ఏటా 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. 2018– 19లో రూ.9970. 98 కోట్ల ఆర్థికలోటు ఎదుర్కోనున్నామని అప్పట్లో ఈఆర్సీకి ఇచ్చిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకోవాలని డిస్కంలు భావించినా వరుస ఎన్నిక ల నేపథ్యంలో మూడేళ్లుగా విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదు. కాగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2019–20 ముగిసే నాటికి ఆర్థికలోటు రూ.11 వేల కోట్లకు చేరనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన రూ.6,079 కోట్లు విద్యుత్ రాయితీలకు పోగా రూ.5 వేల కోట్ల ఆర్థికలోటు మిగిలి ఉండనుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి వచ్చే ఏడాది చార్జీల పెంపు తప్పదని అధికారులు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీజ్ చేసిన 1,157 మంది ఉద్యోగుల్లో హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లడానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మంది ఉద్యోగులను పోస్టులతో సంబంధం లేకుండా చేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు, ఉద్యోగుల విభజనకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఇరు విద్యుత్ సంస్థలతో సమావేశమైన ఆయన ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మిగిలిన ఉద్యోగులను తీసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు జస్టిస్ డీఎం ధర్మాధికారికి నివేదించాయి. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రికి కూడా గుర్తు చేశాయి. దాంతో 613 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే 1,157 మంది ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల వివాదం దాదాపు సమసినట్లే. ఇదిలా ఉండగా 613 మందిలో 202 మందిని మాత్రమే చేర్చుకోగలమని, ఆ మేరకు తమకు మంజూరైన పోస్టులున్నాయని ఏపీ వాదించింది. అయితే మిగతా వారిని చేర్చుకోలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. అయితే ఏపీలో పనిచేస్తున్న 229 మందిని స్వచ్ఛందంగా తెలంగాణ ఇప్పటికే చేర్చుకున్నందున 613 మందిని నిరభ్యంతరంగా చేర్చుకోవాలని జస్టిస్ ధర్మాధికారి స్పష్టం చేశారు. ఆదేశాలతో తెలంగాణకు రావడానికి ఆప్షన్లు సమర్పించిన 265 మంది విషయంలో రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పరస్పరం చర్చించుకుని, కేసు టూ కేస్ పరిశీలించి...నిర్ణయం తీసుకోవాలని, తుది కేటాయింపులు తన అనుమతితో జరగాలని నిర్దేశించారు. తదుపరి సమావేశం నవంబరు 2, 3 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి విజయవాడలో జరుగనుంది. ఇదే సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు శాశ్వత పరిష్కారం కలగనుంది. -
విద్యుత్ సౌధ ముట్టడిపై పోలీసుల ఉక్కుపాదం
-
సమ్మె సాగుతుంది
సాక్షి, హైదరాబాద్: ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్రావు, కన్వీనర్ గంబో నాగరాజు నేతృత్వంలో ముట్టడికి ప్రయత్నించగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈశ్వర్రావు, నాగరాజు మాట్లాడుతూ.. తాము కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదని, సీఎం హామీ మేరకే కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నామని చెప్పారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరసన తెలిపేందుకు వస్తే అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సమ్మె ఆగదని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కమిటీల అభిప్రాయాలు తీసుకుని మధ్యాహ్నానికి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు 16 రకాల డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కొలిక్కి రాని చర్చలు సమ్మె విరమణ కోసం మంగళవారం సాయంత్రం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, సాయిలుతో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చర్చలు జరిపారు. దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిగినా వివాదం కొలిక్కిరాలేదు. సమాన పనికి సమాన వేతనం, విద్యుత్ సంస్థల్లో విలీనం వేగవంతం, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆన్మాన్ గ్యాంగ్‌గా పని చేస్తున్న 1,600 మందిని ఆర్టిజన్లగా గుర్తించాలని యూనియన్ ప్రతినిధులు అధికారులను కోరారు. వివాదం న్యాయస్థానంలో ఉన్నందున పరిష్కరించలేమని అధికారులు వెల్లడించారు. విలీనం కేసులో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ లోగా పే–స్కేలు వర్తింపచేయాలని కార్మిక నేతలు కోరగా.. కౌంటర్ పిటీషన్ దాఖలు చేస్తామని, పే–స్కేలు వర్తింపజేయలేమని స్పష్టం చేశారు. ఆర్టిజన్ల తొలగింపునకు చర్యలు సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులను యాజమా న్యాలు ఆదేశించాయి. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు షోకాజ్ నోటీసులిచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించాయి. కాగా, కార్మికులను భయపెట్టి సమ్మె విరమింపజేయాలని యాజమాన్యాలు ఈ చర్యలకు దిగాయని కార్మిక నేతలు ఆరోపించారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
తెలంగాణకు విద్యుత్ ఆపేద్దాం!
సీఎస్‌తో సమావేశంలో అధికారులు సాక్షి, అమరావతి: తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిశ్చయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ నేతృత్వంలో వెలగపూడిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ వివాదాలపై చర్చించారు. -
ఎక్కువ రేటుకు ఒప్పందాలెందుకు..!
- డిస్కంలను ప్రశ్నించిన టీఎస్ఈఆర్సీ - వినియోగదారులపై అధిక భారం మోపొద్దు సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో చౌకగా లభిస్తున్న సౌర విద్యుత్తును ఎక్కువ రేటుతో కొనుగోలు చేసేలా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) డిస్కంలను ప్రశ్నించింది. సోలార్ పార్కుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? ఉమ్మడి రాష్ట్ర నియంత్రణ మండలి కాలంలో కుదుర్చుకున్న పీపీఏలపై అప్పటి కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదు? అని వివరణ కోరింది. సోలార్ పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 2017 మార్చి వరకే గడువు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచొద్దని ఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. నేరుగా సోలార్ పవర్ ఉత్పత్తి సంస్థలతోనే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని, త్రైపాక్షిక ఒప్పందాలతో వినియోగదారులపై అధిక భారం మోపవద్దని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్రిచ్ ఎనర్జీ, రేయ్స్ పవర్ ఇన్ఫ్రా కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్సీ శుక్రవారం బహిరంగ విచారణ నిర్వహించింది. సింగరేణి భవన్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ విచారణ నిర్వహించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఆర్ఈడీసీ చైర్మన్ శ్రీనివాస్‌ను పలు అంశాలపై కమిషన్ సభ్యులు వివరణ కోరారు. సోలార్ పార్కుకు ఉమ్మడి రాష్ట్రంలో చట్టబద్ధత లేదని ఏపీపీసీసీ(ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేస్ కో ఆర్డినేషన్ కమిటీ) ఇచ్చిన అనుమతిని ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని అడిగింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన పలువురు తమ వాదనలను ఈఆర్సీ ఎదుట వినిపించారు. ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నారు కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 20 ఏళ్ల పాటు రూ.4.50కే సోలార్ విద్యుత్తు అందిస్తామని అధికారికంగా లేఖ రాసింది. ఈ రోజుల్లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ విద్యుత్తు లభ్యమవుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా యూనిట్‌కు రూ.6.49 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా జెన్కో ప్రాజెక్టులను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. దీంతో డిస్కంలు రూ.623 కోట్లను జెన్కోకు వృథాగా చెల్లించాల్సి వస్తోంది. -వేణుగోపాల్‌రావు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ రూ.4.50కే అనుమతించాలి ఎన్రిచ్ సంస్థ 60 మెగావాట్లకు అనుమతి తీసుకున్నా 30 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తోంది. ఈ ఒప్పందాన్ని 30 మెగావాట్లకే నియంత్రించాలి. యూనిట్‌కు రూ.4.50కు మించకుండా ధరను నిర్ణయించాలి. - భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో 202 మెగావాట్లకు ఉత్పత్తికి అర్హత సాధించాం. సోలార్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో, ఈఆర్సీ అనుమతికి లేఖ రాశాం. 183 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పీపీఏ కుదిరింది. ఇతర ఉత్పత్తి సంస్థలతో కలసి 106 మెగావాట్లు సరఫరా చేస్తున్నాం. పీపీఏను టీఎస్ఈఆర్సీ అనుమతించకపోవటంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాం. - ఎన్రిచ్ సంస్థ ప్రతినిధి ప్రదీప్ పాటిల్ తక్కువ కోట్ రేట్‌కే పీపీఏ 2012లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి టెండర్లు పిలిచాం. 183 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు వచ్చాయి. తక్కువ ధర కోట్ చేసిన ప్రకారమే రూ.6.49 చొప్పున 34 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. అనుకున్నంత స్పందన రానందున రూ.6.49 రేటుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. అప్పుడు 202 మెగావాట్ల ఉత్పత్తికి కంపెనీలు ముందుకొచ్చాయి. - టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి -
భారం ప్రభుత్వమే భరించాలి
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజా సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు భగ్గుమన్నారు. చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బుధవారమిక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆధ్వర్యంలో సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీ ధరలు తదితర అంశాలపై బహిరంగ విచారణ జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి రా త్రి 9.30 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి సమక్షంలో వివిధ సంఘాల నేతలు, నిపుణులు తమ వాదనలను వినిపించారు. ఎన్నికల తర్వాత పెంపు ప్రతిపాదనలా? ఉప ఎన్నికలు, హైదరాబాద్, ఇతర కార్పొరేషన్లలో ఎన్నికలు ముగిశాకే చార్జీలను వడ్డించే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్‌కు చెందిన వేణుగోపాలరావు పేర్కొన్నారు. గృహోపయోగ కనెక్షన్లకు 200 యూనిట్లు దాటితే 20 శాతం, 400 యూనిట్లు దాటితే 35 శాతం చార్జీల పెంపుదల భారం అన్ని వర్గాల ప్రజలపై వేయడం సరికాదన్నారు. సమగ్ర ఆదాయ, అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో పేర్కొన్న మిగులు విద్యుత్ కనిపించడం లేదని, ఇందుకు సంబంధించిన వివరాలేవి డిస్కం ఇవ్వలేదన్నారు. మణుగురులో సబ్‌క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాలకు కేంద్రం అవసరమైనంత మేర సహజ వాయువు, బొగ్గు సరఫరా చేయడం లేదని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వాలి టీపీసీసీ కిసాన్‌సెల్ నేత ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ... 2004లో వైఎస్ హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు రైతుల పాత బకాయిలను మాఫీ చేసి, వారిపై పెట్టిన కేసులు ఎత్తేసినట్లు గుర్తుచేశారు. పంట పొలాల్లో 400 కేవీ లైన్లు, టవర్లు వేస్తే రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగం పెరిగినట్లుగా డిస్కంలు చూపడం నమ్మదగినదిగా లేదని పీపుల్స్ మానిటరింగ్ గ్రూపు కన్వీనర్ తిమ్మారెడ్డి అన్నారు. జెన్కో ద్వారా తక్కువ ధరకు కాకుండా స్వల్ప కాలిక ఒప్పందాలతో ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వల్లే అదనపు భారం పడుతోందన్నారు. గ్రామానికి ఒక లైన్మెన్ను నియమించాలన్నారు. కొత్త కనెక్షన్ల కోసం 75 వేల దరఖాస్తులుంటే అందుల మహబూబ్‌నగర్ జిల్లాలోనే సగం ఉన్నాయని చెప్పారు. డిస్కంలకు ప్రభుత్వం అందించే సహాయానికి సంబంధించి ముందుగానే ప్రభుత్వం అఫిడివిట్ సమర్పించేలా చూడాలని పీపుల్ మానిటరింగ్ గ్రూప్‌కు చెందిన డి.నర్సింహారెడ్డి అన్నారు. కరెంట్ బిల్లును సులభతరం చేసి, అందులో పేర్కొన్న అంశాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చూడాలన్నారు. కరెంట్ వైర్లు, షాకు ఇతరత్రా కారణాలతో మృత్యువాత పడుతున్న వారిని వారిని ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక నేత ఎస్.జీవన్‌కుమార్ సూచించారు. ‘మా వాళ్లను ఏసీబీకి పట్టివ్వండి’ విద్యుత్ శాఖలో అవినీతి గురించి అందరూ మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించొద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. రూ.10 అవినీతి జరిగినా ఏసీబీని ఆశ్రయించాలని ఆయన సూచించారు. తాను సీఎండీగా అన్ని అంశాలపై స్పందించలేనని, కొందరి వల్ల శాఖకు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ఏసీబీని ఆశ్రయిస్తే తాను కూడా వినియోగదారులకు సహకరిస్తానని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లైన్లు ఇలా అన్నింటి కోసం జనవరి 1 నుంచి ఒక లిస్ట్‌ను పెట్టామని, దాని ప్రకారమే అవి వస్తాయని చెప్పారు. అందువల్ల నిబంధనల ప్రకా రం దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. జాతీయ ఎక్స్ఛేంజ్ ద్వారా వెంట నే విద్యుత్ వస్తుందనే నమ్మకం లేకే స్వ ల్పకాలిక విద్యుత్ ఒప్పందాలకు మొగ్గు చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
బహిరంగ విచారణపై సస్పెన్స్
♦ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ ♦ బహిరంగ విచారణకు విద్యుత్ సంస్థల వెనకడుగు ♦ కీలకంగా మారిన కమిషన్ నిర్ణయం.. సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై వ్యక్తమైన అభ్యంతరాలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహిస్తుందా? లేదా ? అన్న అంశం కీలకంగా మారింది. రాజకీయ నేతలు, విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై బహిరంగ విచారణ నిర్వహించాల్సిందేనని పిటిషన్‌దారులు గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు బహిరంగ విచారణ వద్దని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఈఆర్సీపై ఒత్తిడి పెంచాయి. విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాన్ని ఆమోదించాలని ట్రాన్స్‌కో యాజమాన్యం కోరినట్లు తెలిసింది. తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావుతో మూడు రోజుల కింద ఈఆర్సీ సభ్యకార్యదర్శి సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అదేవిధంగా శనివారం స్వయంగా ఆయనే ఈఆర్సీ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్వీకరించిన అభ్యంతరాలపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన సమాధానాల పట్ల ఈఆర్సీ సంతృప్తి వ్యక్తం చేస్తే బహిరంగ విచారణ ఉండే అవకాశం లేదని ట్రాన్స్‌కో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒప్పందం అమలుపై సర్వత్రా ఆందోళన లోపభూయిష్టంగా రూపొందించిన ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా అనవసర భారం పడనుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందానికే కట్టుబడి ఉంది. విద్యుత్ కొనుగోలు ధరలు, విద్యుదుత్పత్తి కేంద్రంపై పెట్టుబడి వ్యయం లాంటి కీలక సమాచారం ఈ ఒప్పందంలో లేకపోగా, ఒప్పందంలో రాసుకున్న నిబంధనలు పూర్తిగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందంలోని లోపాలపై వివిధ వర్గాల నుంచి అందిన పిటిషన్లలో భారీ ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందులో 30 అభ్యంతరాలను ఈఆర్సీ విచారణకు స్వీకరించింది. ఇలాంటి కీలక అంశాలపై గతంలో బహిరంగ విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోలేదు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెగ్యులేటరీ కమిషన్ వైఖరి పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయడానికి పరిమితమైందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.