
బహిరంగ విచారణపై సస్పెన్స్
♦ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ
♦ బహిరంగ విచారణకు విద్యుత్ సంస్థల వెనకడుగు
♦ కీలకంగా మారిన కమిషన్ నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై వ్యక్తమైన అభ్యంతరాలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) బహిరంగ విచారణ నిర్వహిస్తుందా? లేదా ? అన్న అంశం కీలకంగా మారింది. రాజకీయ నేతలు, విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై బహిరంగ విచారణ నిర్వహించాల్సిందేనని పిటిషన్‌దారులు గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు బహిరంగ విచారణ వద్దని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఈఆర్‌సీపై ఒత్తిడి పెంచాయి.
విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాన్ని ఆమోదించాలని ట్రాన్స్‌కో యాజమాన్యం కోరినట్లు తెలిసింది. తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావుతో మూడు రోజుల కింద ఈఆర్‌సీ సభ్యకార్యదర్శి సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అదేవిధంగా శనివారం స్వయంగా ఆయనే ఈఆర్‌సీ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్వీకరించిన అభ్యంతరాలపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన సమాధానాల పట్ల ఈఆర్‌సీ సంతృప్తి వ్యక్తం చేస్తే బహిరంగ విచారణ ఉండే అవకాశం లేదని ట్రాన్స్‌కో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఒప్పందం అమలుపై సర్వత్రా ఆందోళన
లోపభూయిష్టంగా రూపొందించిన ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా అనవసర భారం పడనుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందానికే కట్టుబడి ఉంది. విద్యుత్ కొనుగోలు ధరలు, విద్యుదుత్పత్తి కేంద్రంపై పెట్టుబడి వ్యయం లాంటి కీలక సమాచారం ఈ ఒప్పందంలో లేకపోగా, ఒప్పందంలో రాసుకున్న నిబంధనలు పూర్తిగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందంలోని లోపాలపై వివిధ వర్గాల నుంచి అందిన పిటిషన్లలో భారీ ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అందులో 30 అభ్యంతరాలను ఈఆర్‌సీ విచారణకు స్వీకరించింది. ఇలాంటి కీలక అంశాలపై గతంలో బహిరంగ విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోలేదు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెగ్యులేటరీ కమిషన్ వైఖరి పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయడానికి పరిమితమైందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.