సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీజ్ చేసిన 1,157 మంది ఉద్యోగుల్లో హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లడానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మంది ఉద్యోగులను పోస్టులతో సంబంధం లేకుండా చేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు, ఉద్యోగుల విభజనకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఇరు విద్యుత్ సంస్థలతో సమావేశమైన ఆయన ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మిగిలిన ఉద్యోగులను తీసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు జస్టిస్ డీఎం ధర్మాధికారికి నివేదించాయి. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రికి కూడా గుర్తు చేశాయి. దాంతో 613 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే 1,157 మంది ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల వివాదం దాదాపు సమసినట్లే. ఇదిలా ఉండగా 613 మందిలో 202 మందిని మాత్రమే చేర్చుకోగలమని, ఆ మేరకు తమకు మంజూరైన పోస్టులున్నాయని ఏపీ వాదించింది. అయితే మిగతా వారిని చేర్చుకోలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. అయితే ఏపీలో పనిచేస్తున్న 229 మందిని స్వచ్ఛందంగా తెలంగాణ ఇప్పటికే చేర్చుకున్నందున 613 మందిని నిరభ్యంతరంగా చేర్చుకోవాలని జస్టిస్ ధర్మాధికారి స్పష్టం చేశారు. ఆదేశాలతో తెలంగాణకు రావడానికి ఆప్షన్లు సమర్పించిన 265 మంది విషయంలో రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పరస్పరం చర్చించుకుని, కేసు టూ కేస్ పరిశీలించి...నిర్ణయం తీసుకోవాలని, తుది కేటాయింపులు తన అనుమతితో జరగాలని నిర్దేశించారు. తదుపరి సమావేశం నవంబరు 2, 3 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి విజయవాడలో జరుగనుంది. ఇదే సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల విభజనకు శాశ్వత పరిష్కారం కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment