సాక్షి, హైదరాబాద్: గత ఏప్రిల్ తరహాలోనే ప్రస్తుత మే నెలలో కూడా గృహాలు (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), తాగునీటి సరఫరా (ఎల్టీ–6బీ) కేటగిరీల విషయంలో మీటర్ రీడింగ్ తీయకుండా ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్నారు. 2019 మే నెలలో వసూలు చేసిన విద్యుత్ బిల్లులకు సమానమైన బిల్లును ప్రస్తుత మే నెలలో ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. గృహేతర/వాణిజ్య సముదాయా లు (ఎల్టీ–2) , సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4), సాధారణ (ఎల్టీ–7), తాత్కాలిక (ఎల్టీ–8) కేటగిరీల వినియోగదారులకు మే నెల విద్యుత్ బిల్లు ల చెల్లింపు విషయంలో కాస్త ఊరట లభించనుంది. మే 7 తర్వాత రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగిస్తే ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి కనీస బిల్లులు మాత్రమే వసూలు చేయనున్నారు.
లాక్‌డౌన్ పొడిగించకపోతే మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు చెల్లించాల్సి ఉం టుంది. ఈ మేరకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశముంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి తాత్కాలిక విధానంలో చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దనున్నారు. ఎస్‌ఎంఎస్, మొబైల్ యాప్, డిస్కంల వెబ్‌సైట్ల ద్వారా వినియోగదారులందరికీ వారికి సంబంధించిన మే నెల బిల్లుల వివరాల ను తెలియజేయాలని ఈఆర్సీ కోరిం ది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం మీటర్ రీడింగ్ సేకరించకుండా ప్రత్యామ్నాయ పద్ధతి లోనే విద్యుత్ బిల్లులు వసూ లు చేసే అవకాశముంది.
భారీ పరిశ్రమలకు వాస్తవ బిల్లింగ్..
హైటెన్షన్ కేటగిరీ (హెచ్‌టీ) పరిధిలోకి వచ్చే భారీ పరిశ్రమల నుంచి మీటర్ రీడింగ్ సేకరించి దాని ఆధారంగానే బిల్లులను జారీ చేస్తున్నారు. ప్రస్తుత మే నెలలో సైతం మీటర్ రీడింగ్ తీసి బిల్లులు చేయనున్నారు. అయితే, లాక్‌డౌన్ వల్ల పరిశ్రమలు నష్టపోయిన నేపథ్యంలో ఫిక్స్‌డ్ చార్జీల వసూళ్లను ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కేవలం ఎనర్జీ చార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోనుంది.
ఎవరూ నష్టపోకుండా చర్యలు..
లాక్‌డౌన్ కాలంలో మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా సగటున నెలకు ఎన్ని యూనిట్లు వినియోగించి ఉంటారని లెక్కించి ప్రత్యామ్నాయ విధానంలో వసూలు చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిచేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే అధికంగా బిల్లులు చెల్లించిన వారికి తదుపరి బిల్లులను ఈ మేరకు తగ్గించి సర్దుబాటు చేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే ఎవరైనా తక్కువ బిల్లులు చెల్లిస్తే తదుపరి కాలానికి సంబంధించిన బిల్లులను ఆ మేరకు పెంచి డిస్కంలు నష్టపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని డిస్కంలు తయారు చేసి ఈఆర్సీ నుంచి అనుమతి తీసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment