మీడియాతో మాట్లాడుతున్న బుగ్గన
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగలేదని, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ మేరకు కొంత బిల్లు పెరగవచ్చు కానీ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. కరోనా విపత్తు నియంత్రణకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా కష్టపడుతున్న వేళ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడలోని రహదారులు–భవనాల శాఖ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ..
అప్పుల్లో ముంచిన టీడీపీ సర్కారు..
► టీడీపీ సర్కారు విద్యుత్ వ్యవస్థను నష్టాల ఊబిలోకి గెంటేసి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలను కోలుకోలేని రీతిలో అప్పుల్లో ముంచేసింది. పెద్ద ఎత్తున బకాయిలను మిగల్చడమే కాకుండా అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే బకాయిలు తీర్చేసి విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది.
స్టాటిక్.. డైనమిక్.. తేడా మీరే చూస్తారు
► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా స్టాటిక్ పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. విద్యుత్తు వినియోగం ఆధారంగా శ్లాబులను నిర్ధారిస్తూ స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళానికి గురి చేశారు.
► ఏపీఈఆర్సీ ఇప్పుడు డైనమిక్ పద్ధతి అమలులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అదే శ్లాబులో ఉంటుంది. దీని ఫలితాలు వచ్చే రెండు నెలల్లో వినియోగదారులకు కనిపిస్తాయి.
శీర్షికకు, విషయానికి పొంతనేది
► విద్యుత్తు వినియోగదారులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడిస్తున్న బిల్లులు మూడు నెలల సగటు యూనిట్లను లెక్కించి ఇస్తున్నారు. మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది.
► విద్యుత్తు బిల్లులు పెరిగినట్లు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఎలాంటి పెనాల్టీ, అపరాధ రుసుము లేకుండా జూన్ 30 వరకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఈనాడు దినపత్రిక 15 వరకు అంటూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోంది. కొత్త టారీఫ్ చార్జీలపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. వార్త శీర్షికకు, అందులోని విషయానికి పొంతన లేకుండా.. బిల్లు చూస్తే కళ్లు తిరుగుతాయి, కరెంటు పిడుగులు, బిల్లు బాంబు.. అంటూ అసత్య ప్రచారానికి పాల్పడుతోంది. కళ్ల ముందే వాస్తవాలు కనిపిస్తున్నా అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప చార్జీలు పెంచడం వల్ల కాదు. విద్యుత్ బిల్లులపై సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించాం..
► 2014లో యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4.33 కాగా 2019 నాటికి టీడీపీ సర్కారు దీన్ని రూ.6.07కి తీసుకెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వం ఆరు నెలల్లోనే యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను రూ.5.66కి తగ్గించింది.
► 2018 అక్టోబర్‌లో గత ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.6.75కి కొనుగోలు చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 అక్టోబర్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.3.41 చొప్పున కొనుగోలు చేసింది.
► విద్యుత్తు వినియోగదారులు పరిశీలించుకునేందుకు గత రెండేళ్ల బిల్లులను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాం.
అతి తక్కువకు విద్యుత్తు ఇక్కడే..
► 500 యూనిట్లు అంటే రెండు లేదా మూడు ఏసీలను వినియోగించే వినియోగదారులకే చార్జీలు పెరిగాయి. 200 యూనిట్లు లోపు వాడేవారికి దేశంలో తక్కువ ధరకు విద్యుత్ అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే.
► రాష్ట్రంలో 0 – 50 యూనిట్ల వినియోగదారులకు అతి తక్కువగా చార్జీ యూనిట్‌కు రూ.1.45 మాత్రమే ఉంది. అదే తమిళనాడులో రూ. 2.50, కర్నాటకలో రూ.3.75, గుజరాత్‌లో రూ.3 వరకు ఉంది.
గత సర్కారు నిర్వాకాలకు ఈ లెక్కలే రుజువు..
► గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు బకాయిలను రూ.5,000 కోట్ల నుంచి రూ.19,400 కోట్లకు పెంచి దిగిపోయింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.5,000 కోట్లను చెల్లించింది. ఇక డిస్కమ్‌లకు సబ్సిడీలను ఇవ్వకుండా గత ప్రభుత్వం రూ.10,899 కోట్ల బకాయిలను మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.7,000 కోట్ల మేర సబ్సిడీలను చెల్లించింది, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులను టీడీపీ సర్కారు రూ.31,650 కోట్ల నుంచి రూ.63,500 కోట్లకు పెంచింది. మరోవైపు విద్యుత్ సంస్థల నష్టాలు 2015లో రూ.7,000 కోట్లు కాగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.30 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత ప్రభుత్వ సమర్ధత ఏపాటిదో అర్థం అవుతుంది.
చార్జీలు ఏపీలోనే చౌక
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే గృహ విద్యుత్ టారిఫ్ తక్కువగా ఉంది. ముఖ్యంగా 50 యూనిట్ల వరకు వినియోగించే పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో విద్యుత్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్నంత అతి తక్కువ విద్యుత్ టారిఫ్ మరే రాష్ట్రాల్లోనూ లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తై, తక్కువ ధరకే విద్యుత్ లభించే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో తక్కువ ధరలకు విద్యుత్ ఇవ్వడం లేదు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వాడకందారులకు బిహార్ గరిష్టంగా యూనిట్ రూ.6.40కి విద్యుత్ ఇస్తోంది. 200 యూనిట్లు లోపు వాడే వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం యూనిట్ రూ.3.60కే విద్యుత్ అందిస్తోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్‌ను అమలులోకి తెచ్చింది. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారి కొంత ఎక్కువగా అనిపించే వీలుంది. అయితే దేశంలోని పలు రాష్ట్రాలు రెండు నెలలకు మీటర్ రీడింగ్ తీయడం వల్ల వచ్చిన బిల్లులతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్, వేసవి కావడం వల్ల వాడకం పెరగడంతో గృహ విద్యుత్ వినియోగం మార్చి, ఏప్రిల్‌లో పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాలు తాజా పరిణామాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో టారిఫ్ మనకన్నా ఎక్కువగా ఉన్నందున అక్కడే బిల్లులు అధికంగా వచ్చే వీలుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment