సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమలకు లాక్‌డౌన్ షాక్ తగలకుండా ఏపీ ప్రభుత్వం పెద్ద సాయం చేసింది. విద్యుత్ డిమాండ్ చార్జీల భారం నుంచి వాటికి విముక్తి కల్పించింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొండంత ధైర్యమొచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 79 వేల ఎంఎస్‌ఎంఈలకు రూ.188 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది.
నెలకు రూ.62.70 కోట్లు
లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎంఎస్‌ఎంఈల పరిస్థితి దారుణంగా మారింది. పరిశ్రమలు తెరవకున్నా నిబంధనల ప్రకారం కనీస విద్యుత్ (డిమాండ్) చార్జీలు చెల్లించాలి. ఇవి ఆయా పరిశ్రమలు వినియోగించే విద్యుత్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు పనిచేస్తే నెలకు 330 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. దీని విలువ రూ.226 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలు నడవకపోవడం వల్ల నెలకు రూ.62.70 కోట్ల మేర డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం నుంచి విముక్తి కల్పించాలని ఎంఎస్‌ఎంఈలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వీటిని తొలగించింది.
ఎంఎస్‌ఎంఈలకు గరిష్టంగా రూ.10 లక్షల రుణం
లాక్‌డౌన్ వల్ల దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)ను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన రూ.200 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ విధివిధానాలను ఖరారు చేసింది. ముఖ్యంగా లిక్విడిటీ కొరతతో కరెంటు బిల్లులు, జీఎస్టీ, ఇతర పన్నులు, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సంస్థలకు లిక్విడిటీ పెంచే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగిలిన మొత్తాన్ని సిడ్బీ, లేదా ఇతర బ్యాంకుల నుంచి సమీకరిస్తారు. 6–8 శాతం అతి తక్కువ రేటుకు రూ.2లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రుణ చెల్లింపు కాలపరిమితి 3 ఏళ్లు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పథకం అమలుచేసే బాధ్యతను ఏపీఎస్‌ఎఫ్‌సీకి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment