సాధారణంగా వాడుకున్న విద్యుత్‌కే బిల్లు.. ఇప్పుడు బిల్లుపైనా చార్జీలు
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక కుదరదు
పంపిణీ సంస్థల యాప్, వెబ్‌సైట్లలో చెల్లింపులతో అదనపు చార్జీల వాత
వినియోగదారులపై నెలకు దాదాపు రూ.30 కోట్ల అదనపు భారం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్‌కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్‌కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇదీ సంగతి...!
ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్‌లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్‌ల వెబ్‌సైట్, వాటి మొబైల్ యాప్‌లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.
చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..
నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్‌ల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్‌పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్‌సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది.
డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్‌లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.
నిర్లక్ష్యంగా డిస్కమ్‌లు...
తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్‌లు తమ వెబ్‌సైట్, యాప్‌లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అంటే షాకులే..
76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది.
75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment