దోచుకోవడంలో ‘స్కిల్‌’ నిజమే | ED Confirmed Corruption Of Chandrababu Govt Between 2014-19, Check Out More Information | Sakshi
Sakshi News home page

Chandrababu Skill Scam: దోచుకోవడంలో ‘స్కిల్‌’ నిజమే

Published Wed, Oct 16 2024 4:00 AM | Last Updated on Wed, Oct 16 2024 4:52 PM

ED confirmed corruption of Chandrababu Govt between 2014-19

ఏపీఎస్‌ఎస్‌డీసీలో అది కుంభకోణమే.. షెల్‌ కంపెనీలతో కొల్లగొట్టారు

2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని నిర్ధారించిన ఈడీ

బోగస్‌ ఇన్వాయిస్‌లు.. విదేశాలకు నిధుల తరలింపు

హవాలా మార్గంలో తిరిగి దేశంలోని నిందితులకు చేరిన నిధులు  

ఇవన్నీ ఆధారాలతో సహా రుజువైనట్టు వెల్లడి.. షెల్‌ కంపెనీ డిజైన్‌ టెక్, సీమెన్స్‌ నాటి ఎండీ ఆస్తులు తాజాగా రూ.23.54 కోట్లు అటాచ్‌

ఇది వరకు రూ.31.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ.54.74 కోట్లు

‘స్కిల్‌’ క్రిమినల్‌ చంద్రబాబేనని సిట్‌ దర్యాప్తులో వెల్లడి

అందువల్లే బాబు అరెస్ట్‌.. రిమాండ్‌ ఖైదీగా 52 రోజులు జైల్లో 

తాజాగా ఈడీ దూకుడుతో ‘స్కిల్‌’ నిందితుల్లో గుబులు

సిట్‌ దర్యాప్తు సరైందేనని దేశ వ్యాప్తంగా చర్చ

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక రాజకీయ కక్ష లేదని స్పష్టత 

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్‌ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్‌ కంపెనీ డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్విల్కర్, సీమెన్స్‌ కంపెనీ అప్పటి ఎండీ సుమన్‌ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది. 

ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్‌ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.  దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 


స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిట్‌ చంద్రబాబును అరెస్ట్‌ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినట్టు.. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్‌’ క్రిమినల్స్‌లో గుబులు మొదలైంది.
గత ఏడాది డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ఎండీ, సీమెన్స్‌ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్‌ 

ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్విల్కర్‌ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు.  

ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్‌ టెక్‌ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో  సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్‌ సంతకం 

⇒ కేబినెట్‌ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీతో సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్‌ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. 

⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌ టెక్‌ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్‌–డిజైన్‌ టెక్‌ కంపెనీలు ప్రాజెక్ట్‌ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.  

⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్‌ఎస్‌డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్‌ ఫైళ్లలో సంతకాలు చేశారు.  

⇒ డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.

కడిగిపారేసిన కాగ్‌
రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్‌ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ  లెక్కల ప్రకారం ప్రాజెక్ట్‌ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. 

అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ తెలిపింది.

స్కిల్ స్కామ్ అంటే ఏంటి? అందులో చంద్రబాబు అవినీతి ఎంత

ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్‌
⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్‌ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 

⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్కిల్‌ స్కామ్‌పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. 

ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షెల్‌ కంపెనీల ప్రతినిధి మనోజ్‌ పార్థసానిలకు సిట్‌ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్‌ 9న అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్టైంది.  

⇒ సిట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.

పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..
యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్‌ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్‌ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్విల్కర్‌ తమ సన్నిహితులు ముకుల్‌ చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులు విడుదల చేశారు.  

ఆ నిధులను షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చా­­యన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్‌ బోస్, వికాస్‌ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్‌ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్ను
స్కిల్‌ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ కాపీని సిట్‌ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్‌ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

దాంతో ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్‌ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది.  

సీబీఐకి అప్పగించాలి  
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్‌ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ న్యాయస్థానంలో విచారణలో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement