సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 2023 – 27 నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం లాంటి పథకాల ద్వారా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో మరింత అండగా నిలిచేలా పాలసీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
కొత్తగా ఏర్పాటయ్యే ఎంఎస్‌ఎంఈలతో పాటు ఇప్పటికే ఏర్పాటైన యూనిట్లకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులను కల్పించనున్నారు.
ఏపీఐఐసీ అభివృద్ధి చేసే నూతన పారిశ్రామిక పార్కుల్లో 33 శాతం భూమిని ఎంఎస్‌ఎంఈలకు కేటాయించనున్నారు. ఇందులో కూడా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ స్పేస్‌లను ఈ రంగ యూనిట్ల కోసం ఏర్పాటు చేయనున్నారు. భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు, 6 శాతం ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక పార్కుల్లో రిజర్వేషన్లు కల్పించింది.
ప్రైవేట్ రంగంలో పార్కుల అభివృద్ధి
ప్రైవేట్ రంగంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. కనీసం 25 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు లేదా కనీసం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను నిర్మించే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
వీటి నిర్మాణ వ్యయంలో 25 శాతం లేదా గరిష్టంగా రూ.కోటిని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం సేకరించిన భూమికి సంబంధించి 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి 100 శాతం నాలా చార్జీలకు మినహాయింపు లభిస్తుంది.
టర్మ్ రుణాల వడ్డీపై 3 శాతం వడ్డీ రాయితీ చెల్లింపు గరిష్టంగా మూడేళ్లపాటు కోటి రూపాయలు లభించనుంది. పార్కుల్లో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు ఆధారంగా ఈ రాయితీలు చెల్లించనున్నారు. పార్కుల్లో 50 శాతం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే 50 శాతం రాయితీలు, 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలిన రాయితీలు చెల్లిస్తారు.
పాతవాటికి చేయూత
ఇప్పటికే ఏర్పాటైన ఎంఎస్‌ఎంల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ కష్టాల్లో ఉన్న సంస్థలకు చేయూతనందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను తెస్తోంది. ఎంఎస్‌ఎంఈల ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఆన్‌లైన్ ఫ్లాటఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జీఎస్టీ డేటాబేస్ ఆధారంగా ఎంఎస్‌ఎంఈల టర్నోవర్‌ను పర్యవేక్షిస్తూ ఒకవేళ తగ్గితే అందుకు కారణాలను అధికారులు పరిశీలిస్తారు. కోలుకునేందుకు సూచనలు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై చర్చిస్తారు.
ఇందుకు ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోటీ వాతావరణాన్ని తట్టుకుని వ్యయాలను తగ్గించుకోవడం, అప్‌గ్రెడేషన్ దిశగా ప్రోత్సహించేలా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
అద్భుతమైన పాలసీ: దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్, మౌలిక రంగ పరిశ్రమలకు అద్భుతమైన పాలసీ అని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ ప్రశంసించారు. స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, విశాఖలో స్టార్టప్ మిషన్ ఏర్పాటుకు ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు.
పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, ట్రక్ పార్కింగ్ వ్యవస్థల ఏర్పాటుతో రాష్ట్రంలో లాజిస్టిక్ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌కు దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
ఇలా ఆదుకున్నారు..
ఎంఎస్‌ఎంఈ రంగానికి తోడ్పాటునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సంఖ్య 1.10 లక్షలు కాగా గత మూడున్నరేళ్లలో కొత్తగా 1.56 లక్షల యూనిట్లు ఏర్పాటు కావడమే దీనికి నిదర్శనం.
రాష్ట్రంలో ఒక్కో ఎంఎస్‌ఎంఈ యూనిట్ సగటున 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్త యూనిట్ల ద్వారా సుమారు 10.04 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ సంవత్సరం రాయితీలను అదే ఏడాది చెల్లిస్తోంది.
రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను ఈ ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment