విద్యుత్ సౌధ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్‌రావు, కన్వీనర్ గంబో నాగరాజు నేతృత్వంలో ముట్టడికి ప్రయత్నించగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈశ్వర్‌రావు, నాగరాజు మాట్లాడుతూ.. తాము కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదని, సీఎం హామీ మేరకే కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నామని చెప్పారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరసన తెలిపేందుకు వస్తే అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సమ్మె ఆగదని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కమిటీల అభిప్రాయాలు తీసుకుని మధ్యాహ్నానికి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు 16 రకాల డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
కొలిక్కి రాని చర్చలు
సమ్మె విరమణ కోసం మంగళవారం సాయంత్రం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, సాయిలుతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చర్చలు జరిపారు. దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిగినా వివాదం కొలిక్కిరాలేదు. సమాన పనికి సమాన వేతనం, విద్యుత్ సంస్థల్లో విలీనం వేగవంతం, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆన్‌మాన్ గ్యాంగ్‌గా పని చేస్తున్న 1,600 మందిని ఆర్టిజన్లగా గుర్తించాలని యూనియన్ ప్రతినిధులు అధికారులను కోరారు. వివాదం న్యాయస్థానంలో ఉన్నందున పరిష్కరించలేమని అధికారులు వెల్లడించారు. విలీనం కేసులో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ లోగా పే–స్కేలు వర్తింపచేయాలని కార్మిక నేతలు కోరగా.. కౌంటర్ పిటీషన్ దాఖలు చేస్తామని, పే–స్కేలు వర్తింపజేయలేమని స్పష్టం చేశారు.
ఆర్టిజన్ల తొలగింపునకు చర్యలు
సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులను యాజమా న్యాలు ఆదేశించాయి. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు షోకాజ్ నోటీసులిచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించాయి. కాగా, కార్మికులను భయపెట్టి సమ్మె విరమింపజేయాలని యాజమాన్యాలు ఈ చర్యలకు దిగాయని కార్మిక నేతలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment