ప్రపంచ దేశాలకే ఆదర్శం
ప్రపంచ దేశాలకే ఆదర్శం
Published Fri, Apr 28 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
- శకునాల- గని మధ్య సోలార్ పార్కు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్
- నిర్మాణ పనుల పరిశీలన
- జూన్ నెలలో ప్రారంభానికి సన్నాహాలు
ఓర్వకల్లు : పెరిగిపోతున్న ఇంధన అవసరాలను అధిగమించే దిశగా గడివేముల మండలం శకునాల-గని గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ పార్కు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా మారుతుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. అజయ్‌జైన్‌తో పాటు జేసీ హరికిరణ్, ఆర్‌డీఓ హుసేన్ సాహెబ్, సోలార్ ప్రాజెక్టు ఎండీ ఆదిశేషు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి శుక్రవారం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ 1000 మెగా వాట్ల సామర్థ్యం కల్గిన పార్కుకు సంబంధించి ఇప్పటివరకు 900 మెగా వాట్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగతా 100 మెగావాట్ల పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఎండీ ఆదిశేషుకు సూచించారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఇటీవలే మరో 300 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కోసం సేకరించిన భూములను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనాథ్, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన... :
సోలార్ బాధిత రైతులకు పరిహారం చెల్లించే వరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంగీకరించేంది లేదని పేర్కొంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు నాగన్న, చంద్రబాబు, రామన్న తదితరులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తర్వాత అజయ్‌జైన్‌కు వినతిపత్రం అందించారు.
Advertisement