అక్కగారిపేట (పెళ్లకూరు) : విద్యుత్‌శాఖ అధికారుల అనుమతి లేకుండా వరి పైరు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు కూరపాటి దాసు (48) అనే వ్యవసాయ కూలి బలైపోయాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం క్రైస్తవమిట్ట గ్రామానికి చెందిన దాసు ట్రాక్టర్ డ్రైవర్‌గా వ్యవసాయ పనులు చేస్తుంటాడు. గ్రామానికి చెందిన తూపిలి సురేంద్రరావు తన వరి పొలాలకు పందుల బెడద కోసం విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లిన దాసు చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలాల్లో గాలించగా విద్యుత్ కంచె తగిలి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. రైతు నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ కూలీ దాసు బలైపోయాడంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కావాలనే చంపేశారు : కుటుంబ సభ్యులు
వ్యవసాయ కూలీ దాసును గ్రామానికి చెందిన సురేంద్రరావు పాత కక్షలతోనే కావాలనే విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి చంపేశారంటూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నోఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయని, మృతుడి భార్య లత తెలియజేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివశంకరరావు తెలిపారు.
అనాథలైన ఆడపిల్లలు
దాసు మృతితో ముగ్గురు ఆడ పిల్లలు అనాథలయ్యారు. రోజూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దాసు మృతితో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది.
విద్యుత్ కంచెకు కూలీ బలి
Published Mon, Sep 14 2015 3:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement