
కడగండ్లు
సాక్షి, ఏలూరు:వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. భూమిపై ఉపరి తల అవర్తనం.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు అక్కడక్కడా ఇళ్లు నేలకొరిగాయి. శివారు పల్లెలు, లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆకివీడులో వెంకయ్య వయ్యేరు కాలువకు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో 6 వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమడులు నీటమునిగాయి. కాలువలు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలనీలు, కార్యాలయాల్లోకి వర్షం నీరు చేరింది. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 95.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బియ్యం, కిరోసిన్‌ను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పా టు చేసింది. ఆచంట మండలంలో కూలిన 10 విద్యుత్ స్తంభాలను తిరిగి నిలబెట్టారు. ఆదివారం ఆరు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరాను సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ఏలూరులోని పవర్‌పేట, శ్రీనివాస థియేటర్ రోడ్డు, చాటపర్రు చంద్రబాబునాయుడు కాలనీలో
భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దేవరపల్లిలో దళితవాడ, స్టేట్‌బ్యాంక్ కాలనీ ముంపునకు గురయ్యాయి. దాదాపు 100 కుటుంబాల వారు ముంపుబారిన పడ్డారు. ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయూయి. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రెయిన్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది. ఆక్సిజన్ లోపం తలెత్తి రొయ్యలు మృత్యువాత పడే ప్రమా దం ఏర్పడింది. ద్వారకాతిరుమలలో ప్రహరీ గోడ కూలింది. రెడ్డికోపల్లి దగ్గర కొవ్వాడ కాలువ, ముదునూరు సమీపంలో ఆరిసెల కాలువ, పద్మవారిగూడెంలోని అల్లికాలువ పొంగుతున్నాయి.
పోలవరం మండలం కొత్తూరులో లో-లెవెల్ కాలువ నీరు రోడ్డెక్కి ప్రవహిస్తుండటంతో 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించా యి. చాగల్లు మండలం ఊనగట్ల బీసీ కాలనీ, ఊనగట్ల-చిక్కాల మధ్య, కల వలపల్లి ఎస్సీ కాలనీ, గరప్పాడులో వర్షం నీరు చేరింది. నిడదవోలు-ఐ.పంగిడి రహదారి మీదుగా నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలకు తహసిల్దార్లు వెళ్లి పరిశీలించారు. కొవ్వూరులో కోర్టు ప్రాంగణం ముని గిపోయింది. తాళ్లపూడి మండలం పైడిమెట్ట, అన్నదేవరపేట, గజ్జరం, తిరుగుడుమెట్ట, పెద్దేవం, వేగేశ్వరపురం గ్రామాల్లో వరిచేలు ముంపుబారిన పడ్డాయి. కొవ్వూరు-దొమ్మేరు మధ్య కుమారదేవం, నందమూరు ప్రాంతాల్లో పొలాలు మునిగాయి.
ఇందిరమ్మ కాలనీ ముంపునకు గురైంది. నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్లాబ్ నుంచి వర్షం నీరు కారడంతో ఉద్యోగులు గొడుగులు వేసుకుని మరీ రిజిస్ట్రేషన్లు చేశా రు. మునిసిపల్ కార్యాలయం రోడ్డులో భారీగా నీరు చేరింది. నారుమళ్లు నీట మునిగాయి. గొంతేరు, నక్కల, భగ్గేశ్వరం, కాజ డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉండిలో నారుమళ్లు మునిగాయి. ఉంగుటూరు మండలం కైకరం, నాచుగుంట, నారాయణపురం, సీతారాం పురం, తల్లాపురం, యల్లమిలి, బాదంపూడిలో వరిచేలు నీటమునిగాయి. తోకలపల్లి డ్రెయిన్ పొంగిపొర్లుతోంది. నిడదవోలులో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. పెరవలి మం డలం లోతట్టు ప్రాంతాల్లో చేరింది. నిడదవోలు-తిమ్మరాజుపాలెం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. తణుకులో ఇరగవరం కాలనీ, పైడిపర్రు ప్రాంతాల్లో నీరుచేరింది. పంట చేలు నీట మునిగాయి.
కిరోసిన్ సిద్ధం
ముంపుబారిన పడే అవకాశం ఉన్న 9 మండలాల్లోని 56 గ్రామాలకు 1,004 టన్నుల బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు మూడు నెలలకు అడ్వా న్స్ కోటా ఇచ్చామని, 40 వేల లీటర్ల కిరోసిన్ అందుబాటులోనే ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి డి.శివశంకరరెడ్డి తెలిపారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అల్పపీడనం నేపథ్యంలో ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సమయంలో సహాయం కోసం జిల్లా కార్యాలయంతోపాటు అన్ని డివిజన్ కార్యాలయూల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపడినా, స్తంభాలు పడిపోయినా వాటి సమీపానికి వెళ్లకుండా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు లేదా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తెలియజేయూలని ఆయన విజ్ఞప్తి చేశారు.