సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎదురైన బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖ సమీక్షలో ఇటీవల ఆదేశించారు. 6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశాలిచ్చారు.
ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ఎగువ సీలేరు వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీలేరులో రివర్సబుల్ పంపులను వ్యవస్థాపించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఏపీ జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించింది. గ్రిడ్ స్థిరీకరణ, సౌర, పవన విద్యుత్‌తో అనుసంధానం చేయడం, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించడం, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
గ్రిడ్‌పై భారం తగ్గుతుంది
ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంప్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. గ్రిడ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ఆయన వివరించారు.
శ్రీశైలం, పోలవరం తర్వాత ఇదే పెద్దది
1,350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను స్థాపించడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఏపీజెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. టోపోగ్రాఫికల్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, 76.9 శాతం జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, పోలవరం హైడ్రో ప్రాజెక్టుల తర్వాత ప్రతిష్టాత్మక ఎగువ సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు అన్ని అనుమతులను పొందడంతోపాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వాప్‌కాస్ లిమిటెడ్‌కు అప్పగించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment