Power generation plant
-
రాష్ట్రంలో భారీ విద్యుత్ ప్రాజెక్టు
కర్నూలు (సెంట్రల్)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ.. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు) కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల çసరిహద్దులోని పిన్నాపురంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరిస్తోంది. అంతేకాక.. ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, హైడల్ పవర్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది. ఇందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓర్వకల్ పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు. కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్ వపర్‌ను పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అని కూడా అంటారు. హైడల్ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే, కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. రూ.15వేల కోట్ల పెట్టుబడి.. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు. ఇక్కడ విద్యుదుత్పత్తి ప్రారంభమైతే విద్యుత్ కష్టాలు కొంతవరకు తీరుతాయి. ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్ డయా క్సైడ్ 15 మిలియన్ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్ కార్ల బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్ డయాౖక్సైడ్ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో 33,240 మెగావాట్ల ప్రాజెక్టులు ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారవుతోంది. నేడు సీఎం శంకుస్థాపన ఇక పాణ్యం మండలం పిన్నాపురంలో నిర్మించే ఈ హైడల్ పవర్ ప్రాజెక్టులోని పంప్డ్ స్టోరేజ్ పవర్ యూనిట్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఉ.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రాజెక్టు వద్దకు చేరుకుని శంకుస్థాపన చేస్తారు. మ.2.05 గంటలకు సీఎం తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
‘సీతారామ’ కొత్త ఆయకట్టు కొంతేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు ప్రశ్నల వర్షం కురిపి స్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రం నుంచి స్పష్టత కోరిన బోర్డు తాజాగా మరో లేఖను సంధిం చింది. గతంలో గరిష్ట వరద వచ్చినప్పుడు ఉండే ముంపు సమస్యలు, ప్రాజెక్టు డిజైన్లపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బోర్డు.. తాజాగా కొత్త ఆయ కట్టుకు ప్రతిపాదించిన నీటి వినియోగం, విద్యుత్ లెక్కలపై ప్రశ్నలు వేసింది. పాక్షిక వివరాలతో నివేదికను ఆమోదించలేమని, పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. బోర్డు సంధించిన ప్రశ్నలు ఇలా.. ► పాత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 33 టీఎంసీలను వినియోగిస్తూ 4.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదిం చారు. తదనంతరం సమీకృత దుమ్ముగూడెం ప్రాజెక్టును 50 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతి పాదించారు. కానీ ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 70 టీఎంసీల నీటిని తీసుకుంటూ కేవలం 3.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే ఎందుకు ప్రతిపాదించారో కారణాలు చెప్పాలి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పుడు గోదావరి నీటిమట్టం 62.86 మీటర్లుగా ఉంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు గరిష్ట నీటిమట్టం 60.43 మీటర్లుగా ఉంది. కానీ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌ను 56.5 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని వరద లెక్కల వివరాలు సమర్పించాలి. ► గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. మరి వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీలను ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలి. ► ఇక 70 టీఎంసీలను తరలిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవా? ► ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హెడ్‌రెగ్యు లేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకొనేలా డిజైన్ చేయగా కాల్వ సామర్థ్యాన్ని మాత్రం 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారు. దీనిపై తేడాలెందుకో తెలపాలి. ► ప్రాజెక్టు అప్రైజల్ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 694 మెగావాట్లుగా పేర్కొనగా డీపీఆర్‌లో వాటిని 725 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఏది సరైనదో వివరణ ఇవ్వాలి. ► స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధర, డీపీఆర్‌లో పేర్కొన్న యూనిట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకుగల కారణాలు తెలపాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 1,480 టీఎంసీల గోదావరి లభ్యత జలాల్లో 900 టీఎంసీలు తమవేనని తెలంగాణ చెబుతోంది. కానీ డీపీఆర్‌లో సాంకేతికంగా 1,480 టీఎంసీల నీటికి ఆమోదం లభించలేదని వ్యాప్కోస్ తెలిపినట్లుగా పేర్కొ న్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ నీటిని వినియోగిస్తుందో స్పష్టత ఇవ్వాలి. -
రాష్ట్రంలో పెరిగిన బొగ్గు నిల్వలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మెరుగుపడ్డాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 52,800 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 35,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 76 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి ఆటంకం లేకుండా జరపవచ్చు. ప్రతిరోజూ దాదాపు 22 ర్యాకుల బొగ్గు రాష్ట్రానికి వస్తుండగా.. మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత చాలావరకూ తగ్గినట్టేనని ఏపీ జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. ఏపీ జెన్కో భాగస్వామ్యం 36 శాతం 2020–21 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ వినియోగం 62,080 మిలియన్ యూనిట్లు. అంటే రోజుకి సగటున 170 మిలియన్ యూనిట్లు. ఇందులో ఏపీ జెన్కో 35 శాతం విద్యుత్‌ను అందించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 71,252 మిలియన్ యూనిట్ల గ్రిడ్ డిమాండ్ ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది రోజువారీగా చూస్తే సగటున 195 మిలియన్ యూనిట్లు. ఇందులో గత సెప్టెంబర్ వరకూ ఏపీ జెన్కో 90 మిలియన్ యూనిట్లు (46 శాతం) సమకూర్చేది. తరువాత బొగ్గు కొరత ఏర్పడి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో జెన్కో భాగస్వామ్యం తగ్గింది. ప్రస్తుతం 36 శాతం విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అందించగలుగుతోందని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనూ మెరుగుపడుతోంది బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా మూతపడ్డ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన కేంద్రం, పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఇంకా సరఫరా పునరుద్ధరించలేదు. మరోవైపు కోల్ ఇండియా లిమిడెడ్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు స్వయంగా ప్రతిరోజూ థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. మొత్తం 135 థర్మల్ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 14 కేంద్రాల్లో ఒక రోజు, 23 కేంద్రాల్లో రెండు రోజులు, 15 కేంద్రాల్లో 3 రోజులు, 16 కేంద్రాల్లో 4 రోజులు, 12 కేంద్రాల్లో 5 రోజులు, 12 కేంద్రాల్లో 6 రోజులు, ఒక కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. 8 కేంద్రాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అన్ని కేంద్రాలకు ఎంతోకొంత బొగ్గు అందించేలా కేంద్ర విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖ మంత్రులు నేరుగా పంపకాలు చేపడుతున్నట్టు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. సొంత బొగ్గు గనులున్న 16 కేంద్రాల్లో ప్రస్తుతానికి 6 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటినుంచే ఇతర కేంద్రాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఎక్కడా ఆరేడు రోజులకు మించి నిల్వలు ఉండటం లేదు. గతంలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం ఆ అవకాశాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏడు రోజులకు మించి ఎక్కడైనా నిల్వలు ఉంటే వాటిని ఇతర ప్లాంట్లకు మంత్రుల సూచనలతో అధికారులు తరలిస్తున్నారు. -
సీలేరులో మరో విద్యుత్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎదురైన బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ సమీక్షలో ఇటీవల ఆదేశించారు. 6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ఎగువ సీలేరు వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీలేరులో రివర్సబుల్ పంపులను వ్యవస్థాపించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఏపీ జెన్కోను ప్రభుత్వం ఆదేశించింది. గ్రిడ్ స్థిరీకరణ, సౌర, పవన విద్యుత్‌తో అనుసంధానం చేయడం, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించడం, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రిడ్‌పై భారం తగ్గుతుంది ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంప్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. గ్రిడ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ఆయన వివరించారు. శ్రీశైలం, పోలవరం తర్వాత ఇదే పెద్దది 1,350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను స్థాపించడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. టోపోగ్రాఫికల్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, 76.9 శాతం జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, పోలవరం హైడ్రో ప్రాజెక్టుల తర్వాత ప్రతిష్టాత్మక ఎగువ సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు అన్ని అనుమతులను పొందడంతోపాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వాప్కాస్ లిమిటెడ్‌కు అప్పగించిందన్నారు. -
సింహాద్రిలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్లో సాంకేతిక కారణాల వలన నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరిగి పునరుద్ధరించారు. సంస్థలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ బాయిలర్‌లో అమర్చిన ట్యూబ్‌కు లీకేజీ ఏర్పడి సోమవారం రాత్రి 6.30 గంటలకు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. యూనిట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి బుధవారం సాయంత్రానికి లైటప్ చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరిగిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం నాలుగు యూనిట్ల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నదని ఎన్టీపీసీ అధికార వర్గాలు వెల్లడించాయి. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయం..
సాక్షి, వెలగపూడి : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని అన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని మరోసారి స్పష్టం చేసారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని, రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. (ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది మేమే ) అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగుల జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చల్లో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి,విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్ ,సాయి క్రిష్ణలతో పాటు ముప్పైమంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
- వారానికో రోజు సమీక్ష - కొండ ప్రాంతవాసులకు పట్టాలు - పేదలకు 20వేల పక్కా ఇళ్లు - చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ప్లాంట్ - కార్పొరేషన్ అధికారులతో చంద్రబాబు - నగరపాలక సంస్థ అధికారులతో సీఎం భేటీ - ఇంకా పలు నిర్ణయాలు సాక్షి, విజయవాడ : ‘ఒక్క అమరావతే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను బాగా అభివృద్ధి చెందాలి. ఇందుకు కావాల్సిన అనుమతులను ఇప్పిస్తాం. ఇక్కడ ఫైల్స్ పెండింగ్‌లో ఉండకుండా తక్షణం క్లియర్ చేయిస్తా. నగరాభివృద్ధిపై వారానికి ఒకరోజు సమీక్ష నిర్వహిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులకు హామీ ఇచ్చారు. తన పేషీలోని అధికారులకు ఫోన్ చేసి ఇక నుంచి విజయవాడ నుంచి వచ్చే ఫైల్స్ తక్షణం క్లియర్ చేయమంటూ ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోనే బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం బస్సులోనే నగరపాలకసంస్థ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. ఇక నుంచి అప్పడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చే స్తుంటానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదిన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సూచించారు. కొండ ప్రాంతవాసులకు పట్టాలు నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడుతూ కొండప్రాంతాల్లో నివసించే పేదలందరికీ పట్టాలిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న ఇళ్లను గుర్తించి, అక్కడనుంచి కొండ పైకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో పేదలకు 20వేల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మహేంద్ర కంపెనీ ముందుకు వచ్చిందని, ల్యాండ్ పూలింగ్‌లో స్థలం సేకరించి, వారి చేత కట్టిస్తానని చంద్రబాబు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు సీఆర్డీఏ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. డంపింగ్ యార్డుకు కేటాయించిన 20 ఎకరాల స్థలం వేరే అవసరాలకు వాడుకోవాలని సూచిం చారు. కాల్వల బ్యూటిఫికేషన్ చేయాలని, కాల్వగట్లపై నివసించేవారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఖాళీ చేయించాలని సూచించారు. భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి తాను ప్రైవేటు కంపెనీలతో సంప్రదిస్తున్నట్లు అధికారులకు వివరించారు. సిబార్ డిస్నీల్యాండ్ స్థలం గురించి మాట్లాడుతూ దాని యజమానులతో సంప్రదించాలని అక్కడ మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని సూచిం చారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగులరమణారావు, కమిషనర్ వీరపాండ్యన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నగరపాలకసంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. జీ+2కు ‘మార్టిగేజ్ రద్దు’ 250 గజాలు లోపు భవననిర్మాణాలకు జీ+2 ఇళ్లు నిర్మించుకునేందుకు ‘మార్టిగేజ్’ చేయాల్సిన అవసరం లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులకు సూచించారు. వర్షపు నీరు వెళ్లేందుకు నగరంలో సరైన వ్యవస్థ లేనందున దానికి కావాల్సిన డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. విజయవాడ(తూర్పు, సెంట్రల్) నియోజకవర్గంలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన టెండర్లు పిలవాలని, వాటికి కావాల్సిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.