అసెంబ్లీ తర్వాతే ‘విద్యుత్ చార్జీ’
- టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు నేటితో గడువు ముగింపు
- మూడోసారి పొడిగింపు కోరనున్న డిస్కంలు
- 7.5 శాతం చార్జీల పెంపునకు సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి కొత్త టారీఫ్‌ను ప్రతిపాదించేందుకు మూడోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ముగిశాకే కొత్త టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. విద్యుత్ చట్టం ప్రకారం డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)తో కొత్త టారీఫ్‌ను గత నవంబర్ చివరిలోపే ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, అప్పట్లో డిసెంబర్ నెలాఖరులోగా గడువు పొడిగింపు కోరాయి. ఆ తర్వాత కూడా గడువు పొడిగించాలని కోరగా, జనవరి 16 వరకు ఈఆర్సీ గడువు పెంచింది. సోమవారంతో ఈ గడువు ముగుస్తున్నా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చార్జీల పెంపు ప్రతిపాదనలను మళ్లీ వాయిదా వేసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి. జనవరి 31 వరకు ఈ గడువు పొడిగింపు కోరే అవకాశాలున్నాయి.
దాదాపు రూ.2 వేల కోట్ల పెంపు..
రాష్ట్రంలో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య, తదితర కేటగిరీల వినియోగదారులపై సగటున 7.5 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు చార్జీల భారం పడనుంది. ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకానికి సంబంధించి ఈ నెల 4న కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వాస్తవ వ్యయం, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) మధ్య అంతరాన్ని 2019–20లోగా పూర్తిగా నిర్మూలించాలని, ఇందుకు ఏటా విద్యుత్ చార్జీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈ ఒప్పందంలో ప్రత్యేక నిబంధనను కేంద్రం చేర్చింది. ఈ మేరకు 2017లో 7.5 శాతం, 2018లో 8 శాతం, 2019లో 6 శాతం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందంలో అంగీకరించింది.