
స్మార్ట్‌గా చెక్
స్మార్ట్ మీటర్ల ప్రయోగంతో సిబ్బంది అక్రమాలకు అడ్డుకట్ట
జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ సరికొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ల ‘షాక్’కు ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నెలవారీ మీటర్ రీడింగ్ లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్న విద్యుత్ సిబ్బందికి స్మార్ట్ మీటర్లు కొరకరాని కొయ్యగా మారాయి. ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం వల్ల విద్యుత్ శాఖ రెవెన్యూ ఒక్క నెలలోనే రూ.40 లక్షలకు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనిని బట్టి గమనిస్తే విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ సమయంలో వినియోగదారులతో ఏ స్థాయిలో లాలూచీ పడుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది.
నల్లగొండ, న్యూస్‌లైన్, జిల్లాలో గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు కలిపి మొత్తం 5 లక్షల 40 వేల విద్యుత్ కనెక్షన్లున్నాయి. అయితే స్మార్ట్ మీటర్లు మాత్రం విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న మండల, పట్టణ కేంద్రాల్లోనే అమరస్తున్నారు. ఇప్పటి వరకు 2.33 లక్షల స్మార్ట్ మీటర్లు గృహాలకు అమర్చారు. దీంట్లో 1.72 లక్షల మీటర్ల నుంచి ఐఆర్ పోర్టు (ఇన్‌ఫ్రా పోర్టు రీడింగ్) మిషన్ ద్వారా మీటర్ రీడింగ్ నమోదు చేస్తున్నారు. అన్ని కేటగిరీల్లో కలుపుకుని నెలవారీ బిల్లుల వసూళ్లు రూ.36 కోట్లు ఉండగా..ఐఆర్ పోర్టు మిషన్‌ల ద్వారానే నెలకు రూ. పది కోట్ల వరకు బిల్లులు నమోదు చేస్తున్నారు. అంటే విద్యుత్ శాఖ నెలవారీ రెవెన్యూలో పది శాతం ఐఆర్ పోర్టు విధానం ద్వారానే వసూలవుతోంది.
పెరిగిన ఆదాయం..
స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆరు మాసాల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ సీఎండీ రిజ్వీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ విధానం అత్యంత పకడ్బందీగా అమలవుతోంది. మూడు మాసాల నుంచి పట్టణ, మండల కేంద్రాల్లో గృహాలకు స్మార్ట్ మీటర్లు అమర్చడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఈ మీటర్లు అమర్చి ఐఆర్‌పోర్టు మిషన్‌ల సహాయంతో మీటర్ రీడింగ్ నమోదు చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో విద్యుత్ శాఖకు రూ.75 లక్షల 27వేల రాబడి వస్తే...మే నెలకు వచ్చే సరికి అది కాస్తా రూ.కోటి 16 లక్షలకు పెరిగింది.
నెల వ్యవధిలో విద్యుత్ శాఖ రాబడి రూ.40 లక్షల 73 వేలకు పెరిగిందన్నమాట. ఈ విధానాన్ని అమలు చేయడంలో హుజూర్‌నగర్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉండగా, భువనగిరి, దేవరకొండ డివిజన్‌లు చివరి స్థానంలో ఉన్నాయి. హుజూర్‌నగర్ డివిజన్‌లో ఒక నెలలో రూ.12.58 లక్షల ఆదాయం పెరిగింది. దేవరకొండలో రూ.2.37 లక్షలు, భువనగిరిలో రూ.3.16లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ డివిజన్లలో స్మార్ట్ మీటర్ల అమర్చే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీనిపై అధికారులు పలు సమీక్షల్లో హెచ్చరించినా మార్పు కనబడటం లేదు.
అక్రమాలకు తెర
గతంలో విద్యుత్ శాఖ వినియోగించిన మెకానిక్ మీటర్లు సిబ్బందికి కాసులు కురిపించాయి. ఈ మీటర్ల సహాయంతో మీటర్ రీడింగ్‌కు వెళ్లినప్పుడు సిబ్బంది, వినియోగదారులతో లాలూచీ పడి యూనిట్ల సంఖ్యను తక్కువగా నమోదు చేయడం జరిగేది. ఉదాహరణకు ఒక సర్వీసులో 200 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే..దానిని 199 యూనిట్లుగా నమోదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన సంఘటనలు విద్యుత్ శాఖ దృష్టికి వెళ్లాయి. దీనివల్ల నెలవారీ బిల్లుల్లో లక్షల రూపాయల సొమ్ము సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు విద్యుత్ అధికారుల నిఘాలో వెల్లడైంది. దీనికి అడ్డుక ట్ట వేసేందుకు స్మార్ట్ మీటర్లు, ఐఆర్ పోర్ట్ విధానాన్ని తెరమీదకు తెచ్చారు.
కలిసొస్తున్న సమయం..
అక్రమాలు నియంత్రించడంతో పాటు విద్యుత్ సిబ్బందికి సమయం కూడా కలిసొస్తుంది. గతంలో మీటర్‌లో నమోదైన రీడింగ్‌ను సిబ్బంది తమ చేతి సహాయంతో మెకానిక్ మీటర్లపై నమోదు చేయడం జరిగేది. కానీ ప్రస్తుతం అలా కాకుండా ఐఆర్ పోర్టు మిషన్లు మీటరు ఎదుట పెడితే దానంతట అదే మీటర్ రీడింగ్ నమోదు చేస్తుంది. దీంతో గతంలో విద్యుత్ శాఖ షెడ్యూల్ ప్రకారం బిల్లులు ప్రతి నెల నమోదు చేస్తున్న 16,17 తేదీల నుంచి ప్రస్తుతం 13,14 తేదీలలోపే బిల్లింగ్ ప్రక్రియ ముగుస్తుంది.