ముందస్తు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా
స్మార్ట్ మీటర్లకు విద్యుత్ సంస్థ ఏర్పాట్లు
మొదటిగా ప్రభుత్వ కార్యాలయాలకు
రీచార్జి విధానంలోకి ఏపీ ఈపీ డీసీఎల్
బకాయిల బాధ ఉండదంటున్న అధికారులు
కొత్తపేట: రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీల చెల్లింపు విధానం ప్రీపెయిడ్ విధానంలోకి మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానే స్మార్ట్ మీటర్లు రానున్నాయి. మొదట మాన్యువల్ మీటర్ల నుంచి ప్రారంభమైన విద్యుత్ మీటర్లు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల వంతు వచ్చిoది. ప్రీపెయిడ్ ఆప్షన్‌తో ఈ మీటర్లు రూపొందించారు.
సాధారణంగా ఈ నెల వినియోగించిన విద్యుత్ బిల్లును వినియోగదారులు మరుసటి నెల చెల్లిస్తున్నారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల వరకు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ లెక్కన వినియోగదారుడికి బిల్లు చెల్లించడానికి దాదాపు నెల వరకు సమయం ఉంటుంది.
ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లలో ప్రీపెయిడ్ ఆప్షన్ జతచేశారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేయాల్సి ఉంటుంది. అలా చేయక పోతే సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
విద్యుత్ మీటర్లలో మార్పులు
మొదట మెకానికల్ (మాన్యూవల్) మీటర్లు ఉండేవి వాటిలో యూనిట్లు చూసి రీడర్లు బుక్‌లో రీడింగ్ రాసుకునేవారు. తర్వాత ఎలెక్ట్రో మెకానికల్ మీటర్లు, హై యాక్యురసీ మీటర్లు వచ్చాయి. ఆ తరువాత ఐఆర్ పోర్ట్ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇవన్నీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపొందించినవే. ఇప్పటి వరకు అమలవుతున్న విధానానికి అలవాటు పడిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్‌పై మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
జీతాలకు కోట్లు
విద్యుత్ శాఖ పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా విద్యుత్ శాఖ జీతాలు, పింఛన్లు చెల్లించడానికి రూ.కోట్లు కావాల్సి వస్తోంది. ఇక శాఖాపరంగా అభివృద్ధి కోసం వందల కోట్లు కావాల్సి వస్తోంది. వీటికి మూలాధారం విద్యుత్ బిల్లుల ద్వారా వచ్చే ఆదాయమే. జిల్లాలో నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల రూపంలో ఆదాయం వస్తోంది. అదే స్మార్ట్ మీటర్లు పెడితే ఇంకా పెరుగుతుందని అంచనా.
ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు
జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలు, పంచాయతీలు, పరిశ్రమలు, వ్యాపార, గృహావసరాలు కలిపి మొత్తం 6,12,317 సర్విసులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల పరంగా ఇప్పటి వరకు రూ.103 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఆ బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని నోటీసులు ఇచ్చినా వసూళ్లు మాత్రం అంతంత మాత్రమేనని ఆ శాఖ రెవెన్యూ అధికారులు చెపుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలే కదా విద్యుత్ సరఫరా కట్ చేయరనే భావన ఏర్పడడంతో అవి మొండి బకాయిలుగా మారాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం అమలులోకి వస్తే విద్యుత్ శాఖకు బకాయిల బాధ ఉండదు.
ఉపయోగాలు..
» సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో.. ఇక్కడ అదే విధంగా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
»బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా బంద్ అవుతుంది. రీచార్జి చేస్తేనే విద్యుత్ వెలుగులుంటాయి.
»బ్యాలెన్స్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
నష్టాలూ..
» విద్యుత్ సంస్థను నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వారి ఉపాధికి పెద్ద దెబ్బేనని చెప్పాచ్చు.
» అవగాహన లేమితో రీచార్జ్ చేసుకోవడంలో వినియోగదారులు ఏ మాత్రం అలసత్వం వహించినా, సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.
» విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment