మెగా ప్లాన్స్ : రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే శాఖలో రానున్న రెండేళ్ల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కనీసం 2లక్షల,30వేలమందిని నియమించాలని భారతీయ రైల్వే నిర్ణయించిందని తెలిపారు. అలాగే గత ఏడాది రైల్వే ఉద్యోగాలకోసం పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షా యాభైవేల మంది ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రైల్వేలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలను సృష్టించనునట్టు వెల్లడించారు. ఇప్పటికే నోటిఫై చేసిన ఖాళీలను భర్తీ చేసిన తర్వాత కూడా రైల్వేలో 1,32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దీనికి తోడు రానున్న రెండేళ్లలో దాదాపు లక్షమంది రిటైర్ కానున్నారని, ఈ పోస్టులను కూడా భర్తీ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.
131,328 పోస్టులకుగాను నియామక మొదటి దశ, 2019 మార్చిలో ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీ ప్రకారం 19,715, 9,857, 35,485 ఖాళీలను వరుసగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన అభ్యర్థులకు రిజర్వ్ చేస్తామన్నారు. అలాగే పార్లమెంట్ ఆమోదించిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 10 శాతం (సుమారు13,100 పోస్టులు) ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల అభ్యర్థులకు కేటాయిస్తామని, ఏప్రిల్ 20, 2020 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని పియూష్ గోయల్ వివరించారు.