రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు! | 2,000 jobs with rs 200 crore investment: CMS Info expectations | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!

Published Mon, Dec 21 2020 2:59 PM | Last Updated on Mon, Dec 21 2020 4:17 PM

2,000 jobs with rs 200 crore investment: CMS Info expectations - Sakshi

ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వైస్‌చైర్మన్‌ రాజీవ్‌ కౌల్‌ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్‌కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్‌ ఇన్ఫోలో.. బేరింగ్‌ పీఈ ఏషియాకు చెందిన సియాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ 100 శాతం వాటాను కలిగి ఉంది.  (మెడ్‌ప్లస్‌పై వార్‌బర్గ్‌ పింకస్‌ కన్ను!)

కంపెనీ కొనుగోలు
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్‌ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్‌ను సీఎంఎస్‌ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్‌ఐఎస్‌ఏ) గ్రూప్‌ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

రోజుకి రూ. 5,000 కోట్లు
రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో 1,13,981 ఆన్‌సైట్‌, 96,068 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్‌ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌, ఎస్‌ఐఎస్‌, రైటర్స్‌ కార్ప్‌ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement