CMS company
-
రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!
ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వైస్‌చైర్మన్ రాజీవ్ కౌల్ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్‌కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్‌లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్ ఇన్ఫోలో.. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కలిగి ఉంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) కంపెనీ కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్‌ను సీఎంఎస్ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్ఐఎస్ఏ) గ్రూప్ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) రోజుకి రూ. 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో 1,13,981 ఆన్సైట్, 96,068 ఆఫ్‌సైట్ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. -
కంపెనీ వేధింపులు తాళలేక చనిపోతున్నా... !
సాక్షి, హైదరాబాద్: కంపెనీ వేధింపులు తాళలేక నూతలగంటి నర్సింగ్(30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో నూతలగంటి నర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం రోజులుగా తనకు యాజమాన్యం నుంచి వేధింపులు మొదలయ్యాయని, తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకొన్నాడు. నర్సింగ్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం వేధింపులతోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని, నర్సింగ్ మృతదేహంతో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆఫీస్ కార్యలయం ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. -
రూ. 10 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి
కాకినాడ(తూర్పుగోదావరి): కాకినాడలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సీఎమ్‌యస్ సంస్థకు సంబంధించి 10 లక్షల రూపాయల నగదుతో ఆదివారం ఉడాయించాడు. దుర్గా భరణికుమార్ అనే వ్యక్తి సీఎమ్‌యస్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సీఎమ్‌యస్ సంస్థ యాజమాన్యం విధుల్లో భాగంగా అతడికి ఏటీఎమ్‌లో నగదు పెట్టే బాధ్యతను అప్పగించింది. పది లక్షల రూపాయల నగదును ఏటీఎంలో పెట్టకుండా దుర్గా భరణి అటునుంచే అటే డబ్బుతో పారిపోయాడు. దాంతో సీఎమ్‌యస్ సంస్థ యజమాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకుని ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సినీ ఫక్కీలో రూ.13 లక్షలు అపహరణ
సాక్షి, అనంతపురం : ‘మీ డబ్బులు కింద పడిపోయాయి. చూసుకోండి’ అని ఏమార్చిన దుండగులు రూ.13 లక్షల నగదున్న బ్యాగుతో ఉడాయించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రధాన శాఖ ఉంది. ఈ బ్యాంక్‌కు సంబంధించి నగరంలో దాదాపు 8 ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిలో డబ్బును లోడ్ చేసేందుకు అనంతపురానికి చెందిన సీఎంఎస్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాన శాఖలోని ఏటీఎం సెంటర్లో డబ్బులు అయిపోవడంతో లోడ్ చేసేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది బ్యాంక్‌కు వెళ్లారు. మేనేజర్ పీరయ్యతో చర్చించాక రూ.13 లక్షలున్న బ్యాగును తీసుకుని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది మిషన్‌లో నగదును లోడ్ చేస్తుండగా బయటున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు లోపలికి వెళ్లి ‘సార్ ఇక్కడ డబ్బులు పడ్డాయి. మీవేనేమో చూడండి’ అని రూ.100 నోటును చూపించాడు. అది తమది కాదని, ఇప్పుడే ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకుని వెళ్లాడని, బహుశా అతడిదే అయి ఉంటుందని బయటకు తొంగి చూస్తుండగా.. బయటే ఉన్న మరో వ్యక్తి లోపలికి చొరబడి కింద ఉన్న బ్యాగును తీసుకుని ఉడాయించాడు. గుర్తించిన సిబ్బంది ‘దొంగ..దొంగ..’ అని అరుస్తుండగానే మరో వ్యక్తి కూడా పారిపోయాడు. వీరి కేకలు ఉన్న బ్యాంక్ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ పీరయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘డబ్బుతో మాకు సంబంధం లేదు. ఏటీఎంలో డబ్బును లోడ్ చేసే కాంట్రాక్ట్‌ను సీఎంఎస్ సంస్థకు ఇచ్చాం. అంతా వారే చూసుకుంటారు’ అని అన్నారు. కాగా మంత్రి పరిటాల సునీత సమీప బంధువు సోమవారం హిందూపురంలో ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లగా ఇదే రీతిలో రూ.20 లక్షల నగదున్న బ్యాగుతో ఉడాయించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే పట్టపగలు జిల్లా కేంద్రంలో మరో దోపిడీ జరగడంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. సీఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎం మిషన్‌లో డబ్బులు లోడ్ చేయడానికి వస్తున్నారన్న విషయం బ్యాంకు సిబ్బంది, సీఎంఎస్ సిబ్బందికి మాత్రమే తెలుసు. ఇలాంటి సమయంలో ఏటీఎం కేంద్రం వద్దకు ధైర్యంగా రావడమే కాకుండా, బ్యాగులో నగదు ఉన్న విషయం ముందే తెలుసుకుని సిబ్బందిని మాటల్లో పెట్టి డబ్బు బ్యాగుతో ఉడాయించారంటే ఇది ఇంటి దొంగలా పనా.. లేక అంత రాష్ట్ర ముఠా సభ్యుల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.