టాటా కమ్యూనికేషన్స్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ జట్టు
• అందుబాటులోకి రానున్న 4.4 కోట్ల వై–ఫై హాట్‌స్పాట్లు
• ప్లాన్ ధర రూ.999 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ రోమింగ్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ తాజాగా టాటా కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు అంతర్జాతీయంగా 4.4 కోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించింది. ‘దేశీ మొబైల్ ఆపరేటర్లలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. దీంతో మా మొబైల్ సబ్‌స్క్రైబర్లు అంతర్జాతీయంగా వై–ఫైను ఉపయోగించుకోవచ్చు.
హైస్పీడ్ డేటా సర్వీసుల కోసం టాటా కమ్యూనికేషన్స్‌తో జతకట్టాం. విదేశీ పర్యటనలోని మా కస్టమర్లు ఈ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో నిర్ణీత మొత్తానికి అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు’ అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వై–ఫై ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌ల ధర మూడు రోజులకు రూ.999గా, 15 రోజులకు రూ.1,599గా, 30 రోజులకు రూ.1,999గా ఉందని వివరించారు. ఈ మొబైల్ అప్లికేషన్ ఎక్కడెక్కడ హాట్‌స్పాట్స్ ఉన్నాయో చూపిస్తుందన్నారు.