మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలపైనా కసరత్తు
యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్‌ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ మార్కెట్‌పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment