యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.1,978 కోట్లు
ఆదాయం 23 శాతం పెరుగుదల
ముంబై : ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,978 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.1,667 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ బీఎస్‌ఈకి నివేదించింది. గత క్యూ1లో రూ.9,980 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 23 శాతం వృద్ధితో రూ.12,234 కోట్లకు పెరిగిందని వివరించింది.
వడ్డీ ఆదాయం రూ.8,289 కోట్ల నుంచి రూ.9,936 కోట్లకు, ఇతర ఆదాయం (వడ్డీయేతర) రూ.1,691 కోట్ల నుంచి రూ.2,298 కోట్లకు వృద్ధి చెందాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.34% నుంచి 1.38%కి... నికర మొండి బకాయిలు 0.44 శాతం నుంచి 0.48 శాతానికి పెరిగాయని తెలిపింది. స్థూల మొండి బకాయిలు రూ.3,463 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 0.5% క్షీణించి రూ.580 వద్ద ముగిసింది.