
ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ
స్వల్ప నష్టాల ముగింపు
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది.