ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి.
హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్‌ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్‌ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.
క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్‌ది. ఆమెను కూడా పైన బెడ్‌రూమ్‌లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్‌ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు.
ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.
జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్‌ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్‌రూమ్‌లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.
ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.
2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో అది జెన్నిఫర్‌దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్‌కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్‌తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.
పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు.
రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment