ఉత్తమ కార్పొరేట్ నిర్వహణ... ప్రైవేటు బ్యాంకుల బలం
* తక్కువ మొండిబకాయిలపై కేసీ చక్రవర్తి కామెంట్
* ప్రభుత్వ బ్యాంకులకన్నా మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణ
ముంబై: బ్యాంకింగ్ రంగానికి పెద్ద సమస్యగా ఉన్న మొండిబకాయిల (ఎన్‌పీఏ) విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ రంగరాజన్ పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెర్స్‌తో పాటు ఎన్‌పీఏల అత్యుత్తమ నిర్వహణ, జవాబుదారీతనం, కష్టించి పనిచేసే తత్వం వంటి అంశాలు ఎన్‌పీఏలను కట్టడి చేయడంలో ప్రైవేటు బ్యాంకులకు కలిసి వస్తున్న అంశాలని శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు. పదవీవిరమణ సమయానికి రెండు నెలల ముందుగానే ఏప్రిల్ చివరివారంలో రాజీనామా చేసిన చక్రవర్తి నిర్మొహమాటంగా మాట్లాడతారనే పేరుంది.
గణాంకాలను చూస్తే...
గత డిసెంబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక ప్రకారం, 2015 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు మొత్తం రుణాల్లో 4.9 శాతానికి పెరుగుతున్నాయి. ప్రైవేటు రంగం విషయంలో ఈ రేటు 2.7 శాతంగా ఉండనుంది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 2015 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 4.4 శాతానికి చేరనున్నాయి. 2013 సెప్టెంబర్‌లో ఈ రేటు 4.2 శాతం. పాత తరం ప్రైవేటు రంగ బ్యాంకుల సంగతి పక్కనబెడితే, కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు కేవలం 1 శాతం వద్ద ఎన్‌పీఏలను కట్టడి చేయగలుగున్నాయి. నిర్వహణ లోపమే మొండిబకాయిల సమస్యకు ప్రధాన కారణమని చక్రవర్తి పేర్కొన్నారు. ఒకవైపు ఆర్థికపరమైన, మరోవైపు నియంత్రణ పరమైన రెండు సమస్యలూ ఇందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఒక విస్పష్ట విధానం అవసరమని పేర్కొన్నారు.