![Guest Column On chilkur balaji temple rangarajan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Narayana.jpg.webp?itok=VgLzyFE9)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్‌పై ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు ఆయన ఇంట్లోకి జొరబడి దాడి చేశారు. తమని తాము శ్రీరాముని వంశానికి చెందినవారమని చెప్పుకొన్న ఆ గుంపు, రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని, తాము ఏర్పాటు చేసుకున్న ‘శ్రీరామ సైన్యం’లోకి ఇక్ష్వాకు వంశస్తులను ఎంపిక చేయించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. దానికి ఆయన నిరాకరించినందుకు ఆయనపై భౌతిక దాడి చేశారు. హిందూత్వ భావ జాలానికి ప్రతినిధులుగా వ్యవహరించే వారంతా ఇలాంటి దాడులే గతంలో చేస్తే ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఈరోజు రంగరాజన్ పైన జరిగిన దాడిని మాత్రం మూకుమ్మడిగా ఖండిస్తూ వస్తున్నారు.
నిజానికి ఇది మొదటి దాడి కాదు, ఇలా విద్వేషంతో జరుగుతున్న దాడుల పరంపరలో చివరిది కూడా కాకపోవచ్చు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ రాష్ట్ర స్థాపన కోసం తాము చేసే ప్రయత్నానికి సహకరించమని పలువురు హిందువులు గౌరవంగా చూసే, పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తిపై దాడి చేయడం ఈ సంఘటనలో గల కొత్త అంశం. ఎవరైనా హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నారని, మతానికి నష్టం కలిగిస్తున్నారని ఆరో పించి, అలా నష్టం కలిగించిన వారిని శిక్షించే పని కూడా తామే చేయడం ఇప్పటివరకు మనం చూశాం. ఇటీవల తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై జరిగిన దాడి కూడా మత విశ్వాసాలను ఆయన గౌరవించలేదన్న ఆరోపణ మీదనే! ఇప్పుడు మాత్రం మత విశ్వాసాలను గౌరవించి సనాతన ధర్మాన్ని పాటించి, దాని ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించే అర్చకుని పైన దాడి జరిగింది.
ఇది అత్యంత హేయమైన చర్య. బహుశా వారికి రంగరాజన్, అతను ఆలయాన్ని నడిపే పద్ధతి, ఆయనకి ఈ వ్యవస్థ పట్ల గల గౌరవం కూడా నచ్చలేదని తెలుస్తోంది. అంటే వచ్చిన వారికి భారత రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం లేదన్నది స్పష్టం. వారు తమ సొంత ఊహా ప్రపంచంలో, తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ఒక ఉన్మాద స్థితిలో ఉన్న మూక. ఇది సాధా రణ హిందూ మతస్థులపైన అదుపు
తప్పిన హిందూత్వ విద్వేషం చేసిన దాడి!
ఎదుటి వ్యక్తుల విశ్వాసాలు మన విశ్వాసాలకు భిన్నమైనవి అయినందువల్ల మాత్రమే ద్వేషించాలి అన్న అభిప్రాయం సాధారణ హిందూ జన సామాన్యానికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు యువతలోకి క్రమంగా వచ్చి చేరుతున్న అసహన వాతావరణం రంగరాజన్ పైన జరిగిన దాడి ద్వారా మనకు తెలుస్తుంది. దాడికి వచ్చిన శ్రీరామసేన ఏర్పాటు చేసిన వీర రాఘవరెడ్డి అనే యువకుడు తన యూట్యూబ్ ఛానల్‌లో చిత్రవిచిత్రమైన వీడియోలు పెట్టాడు. వాటిని చూసినప్పుడు అతను ఎలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆ సేన ఏర్పాటు చేశాడో మనకు అర్థం అవుతుంది.
మన దేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26న అమలైన నాటికంటే ముందే ఈ దేశంలో మనుస్మృతి అనే రాజ్యాంగం ఉన్నదని, అది అసలు ఈ దేశపు రాజ్యాంగం అని, ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగం మన భారత దేశపు విలువలకు సరిపోదని అతని ప్రగాఢ విశ్వాసం. నిజానికి ఈ విశ్వాసం అతనికి మాత్రమే లేదు ఈ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీ సైద్ధాంతిక భావజాలానికి కారణమైన సంస్థ కూడా నమ్ముతున్నట్లుంది. సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక విలువలకు వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తే కలిగే విపరిణామాలు ఇలాగే ఉంటాయి. దాన్ని ఒంట పట్టించుకున్నటువంటి యువత దారి తప్పుతుంది. అలాంటి వారే ఈరోజు ఈ రకంగా దాడులకు పాల్పడు తోందని అర్థం చేసుకోవాలి. విద్వేషాలకు స్వస్తి పలికితేనే సమాజానికి శ్రేయస్కరం.
– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక.
Comments
Please login to add a commentAdd a comment