ఆలస్యమే అయినా... మేల్కొన్నట్లేనా? | Sakshi Guest Column On Agriculture sector By Paparao | Sakshi
Sakshi News home page

ఆలస్యమే అయినా... మేల్కొన్నట్లేనా?

Published Sun, Oct 1 2023 4:48 AM | Last Updated on Sun, Oct 1 2023 4:48 AM

Sakshi Guest Column On Agriculture sector By Paparao

సుమారుగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలను శాసిస్తోన్న ‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు నేడు ప్రశ్నించబడుతు న్నాయి. నిన్నటి వరకూ ఈ విధానాలకు ప్రతి నిధులుగా ఉన్న ఆర్థికరంగ మేధావులు కూడా నేడు భిన్నమైన గొంతుకలను వినిపిస్తున్నారు. 

ఈ క్రమంలో, ఈ మధ్యకాలంలో మన దేశంలోని ఇరువురు ప్రముఖుల ప్రకటనలు లేదా ఇంటర్వ్యూలు మనదేశంలో కూడా నయా ఉదారవాద విధానాలను అనివార్యంగా విడనాడవలసిన అవసరాన్ని చెబుతున్నాయి. వీరిలో ఒకరు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రంగ రాజన్‌.

రెండవవారు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ కె. బెరి. రంగ రాజన్‌ మాటలు నేడు వ్యవస్థలో మౌలికంగానే తలెత్తుతోన్న ప్రశ్నలకు అద్దం పడుతున్నాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్న  ఉపాధి అవకాశాలను సరిపడా సృష్టించలేని అభివృద్ధి దేనికి అనేది. అలాగే ఆయన తలసరి ఆదాయం పెరిగితేనే అది అసలైన దేశాభివృద్ధి అన్నారు. దానితో పాటుగా నిరుపేదలకు రాయితీలు అవసరమేనని స్పష్టీకరించారు.

గతంలో దేశంలో పెట్రోలియం ధరలకు సంబంధించి సబ్సిడీల రద్దులను ప్రతిపాదించిన కమిటీలలో ఒకదానికి నాయకత్వం వహించిన రంగరాజన్‌ నోట వెలువడిన ఈ మాటలు చాలా కీలకమైనవి. వ్యవస్థలో నేడు మారుతోన్న ఆలోచనలకూ... నయా ఉదారవాద సంస్కరణల వైఫల్యానికీ ఈ మాటలు అద్దంపడుతున్నాయి. 

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలనే సూక్ష్మంగా ‘నయా ఉదారవాదం’ అంటున్నాం. ప్రపంచంలో 1980ల నుంచీ... మనదేశంలో 1991 అనంతరం మొదలైన ఈ విధానాలు  కార్పొరేట్‌లకు మరింతగా రాయితీలు ఇవ్వడాన్ని ప్రతిపాదించాయి. అలాగే, జన సామాన్యానికి ఇచ్చే సబ్సిడీలు, సంక్షేమ పథకాలపై కోతలను ప్రతిపాదించాయి.

ఈ విధానాల అమలు క్రమంలోనే నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య, అలాగే విడివిడిగా వివిధ దేశాలలో అంతర్గతంగా కూడా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ధనికులు మరింత ధనికులూ, పేదలు మరింత పేదలూ అవుతున్నారు. నేడు పరాకాష్ఠకు చేరుకుంటున్న ఈ పరిస్థితి  ఈ విధానాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలోనే రంగరాజన్‌ వంటివారు కూడా తమ పాత ఆలోచనలను పరిత్యజించవలసి వస్తోంది. 

మరో పక్కన నీతి ఆయోగ్‌ సుమన్‌ బెరి 1950ల నుంచి బలమైన నమూనాగా ఉన్న  మొత్తం ఆర్థిక నమూనానే ప్రశ్నిస్తున్నారు. ఈ నమూనా ప్రకారంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధి క్రమం: తొలుత వ్యవసాయక ప్రాధాన్యత గలదిగా ఉండి, తరువాత సరుకు ఉత్పత్తి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఉన్నదిగానూ... అనంతరం (చివరగా) సేవా రంగం ప్రాధాన్యత దిశగా సాగాలి.

అయితే, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్న ఆర్థిక పరిస్థితులూ, అలాగే భారీగా ఆటోమేషన్‌ దిశగా అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం వంటి వాటి దృష్ట్యా నేడు మనదేశానికి ఈ పాత దశల అభివృద్ధి నమూనా పనికి రాదనేది సుమన్‌ బెరి ప్రతిపాదన. ఈ సందర్భంగా ఆయన ‘భూగోళం మరో చైనాను భరించలేదు’ అని పేర్కొన్నారు.

అంటే, నేడు భూగోళంపై జరుగుతోన్న పర్యావరణ మార్పులూ... వినాశనం దృష్ట్యా చైనా స్థాయిలో పారిశ్రామిక సరుకు ఉత్పత్తి చేయగల మరో దేశం అవసరం లేదన్నమాట. అటువంటిదే జరిగితే ప్రపంచంలో కాలుష్యం మరింత వేగంగానూ, తీవ్రంగానూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన భారతదేశం సరుకు ఉత్పత్తి రంగంలో చైనాతో పాటుగా ఎదిగే ప్రయత్నాన్ని ప్రశ్నించారు. దీనిలో భాగంగానే ఆయన ఏది ఏమైనా సరే భారీ వృద్ధిరేట్లను సాధించాలనే దృక్పథాన్ని విమర్శిస్తూ... దాని స్థానే నేడు భారత్‌కు కావాలిసింది హేతుబద్ధమైన, పర్యావరణం పట్ల చైతన్యం గల వినియోగం, ఉత్పత్తి అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంలోనే, 2014లో ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని మోదీ ఆరంభించిన నేపథ్యంలో మాజీ రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ అయిన రఘురామ్‌ రాజన్‌ మాటలను కూడా గుర్తుచేసుకోవచ్చు. ఆయన ప్రకారంగా ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం పేరిట ప్రపంచానికి మరో చైనా అవసరం లేదు.  

నిజానికి మనం కొద్ది దశాబ్దాల క్రితమే పారిశ్రామిక సరుకు ఉత్పత్తి దిగ్గజంగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయాం... బస్సు మిస్సయ్యాం!  సరుకు ఉత్పత్తి రంగంలో ముందుగానే 1980లలో ప్రయాణం ప్రారంభించిన చైనా నేడు శాచ్యురేషన్‌ స్థాయిని సాధించి ఉంది. అదీ విషయం. అంటే, రఘురామ్‌ రాజన్‌ ఈ మాటలను అంతర్జాతీయ మార్కెట్‌ తాలూకు  అవసరాలు, డిమాండ్‌ స్థాయుల గురించి వివరిస్తూ చెప్పారు. 

అయితే, గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం తన దృష్టినంతా సరుకు ఉత్పత్తిరంగం పైననే పెట్టింది. దీనిలో భాగంగానే  2014లో ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం ముందుకు వచ్చింది. అనంతరం 2019లో భారీస్థాయిలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గించింది. ఇక తరువాత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలతో దేశంలో భారీ పారిశ్రామికీకరణను తలపెట్టింది. కానీ, ఈ ప్రయత్నాలు ఏవీ ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు.

ఈ కారణం చేతనే కోవిడ్‌ అనంతర కాలంలో అంతర్జాతీయంగా ముందుకు వచ్చిన ‘చైనా+1’ ఆలోచన కూడా మనదేశానికి సంబంధించినంత వరకూ పెద్దగా ఫలితాలను సాధించలేదు. మరో పక్కన దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. అనేక ఇతరేతర ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.

కాబట్టి నేడు మనం పాత దశలవారి సిద్ధాంతం అయిన వ్యవసాయరంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం, అనంతరం సేవారంగంలోకి ప్రయాణం అనే దానికి ఇక ఎంత మాత్రమూ అంటిపెట్టుకోలేము. సరికొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలి. ప్రధాని మోదీ కూడా ‘ఏదేమైనా వృద్ధిని సాధించడమే ఏకైక లక్ష్యమ’ని ఇక ఎంతమాత్రమూ అనలేము అంటూ ఈమధ్య పేర్కొనటాన్ని గమనించవచ్చు. 

ఈ నేప«థ్యంలో ముందుకు వచ్చినవే సుమన్‌ బెరి ఆలోచనలు. వాస్తవానికి నేడు ప్రపంచమంతటా పెరిగిపోతున్న సాంకేతికత దృష్ట్యా సరుకు ఉత్పత్తిరంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇదీ సమస్య తాలూకు మరో కోణం. అంటే, మనం సరుకు ఉత్పత్తిరంగంపై దృష్టిపెట్టి, దానిలో ఒకవేళ బాగా ముందుకు వెళ్ళగలిగినా అది మన ప్రధాన సమస్య అయిన నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు.

ఈ నేపథ్యంలో మనకు ఉన్న మెరుగైన మార్గాంతరంగా వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం అనేది ఉంది. దీనినే సుమన్‌ బెరి ప్రతిపాదిస్తున్నారు. ఆయన ప్రకారం మనం పర్యావరణ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కరించలేకపోవడం దృష్ట్యా, సరుకు ఉత్పత్తిరంగాన్ని మన ప్రాధా న్యతగా చేసుకోరాదు. మనం చేయవలసింది, వ్యవసాయ రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదగగలగడం.

నేడు మన దేశ జనాభాలో 55–60 శాతం మేరకు వ్యవసాయరంగంలోనే ఉన్న నేపథ్యంలో, వారి ఉత్పాదకతతోపాటు, వారి ఆదాయాలను కూడా పెంచేదిశగా చర్యలు తీసుకుంటే అవి దేశీయంగానే డిమాండ్‌ కల్పనకూ... వ్యవసాయరంగాన్ని ఒక మెరుగైన ఉపాధి రంగంగా యువకుల ముందు ఉంచగలిగేటందుకూ ఉపయోగపడతాయి. అటు వంటి విధానాలు, దేశంలోని నగర ప్రాంతాలలో కూడా ఆర్థిక కార్య కలాపాల వృద్ధికి ఉపయోగపడతాయి. ఒక రచయితగా నేను 2014లో ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం ఆరంభం అయిన నాటి నుంచి పదే పదే వ్యాసాలలో, ఉపన్యాసాలలో వివరించినది ఇదే!

స్థూలంగా నేడు మనదేశంలో కూడా సరికొత్త ఆలోచనల పవనాలు వీస్తున్నాయి. కానీ, పుణ్యకాలం కాస్త అయిపోయిన తరువాత అన్నట్టుగా పది సంవత్సరాల విలువైన కాలాన్ని వృ«థా చేసుకుని నేడు మనం మరలా బండి చక్రాన్ని కనుగొంటున్నట్లుగా ఇది ఉంది. ఏదేమైనా, నేటికైనా మన దేశ ఆర్థిక నమూనా పాత సైద్ధాంతిక చట్రాలను బద్దలు కొట్టుకొని సరైన దారిలోకి ప్రయాణిస్తుందని ఆశిద్దాం.
డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్‌: 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement