వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలని సంకల్పించారు. 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. 2019లో నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భక్తులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది.
భయంకరమైన దట్టమైన అరణ్యం. మధ్యలో ఓ చిన్నగుడి. అందులో ఓ దైవం. అట్నుంచి ఇటూ, ఇట్నుంచీ అటూ చెదురుమదురుగా వెళ్తుండే బాటసారులు ఆగి, ఆ దైవాన్ని దర్శించుకొని, ప్రశాంత చిత్తంతో ప్రార్థన చేసి, అంతా మంచి జరగాలని భక్తితో వేడుకోవడం... ఒక పెద్ద కొండ.... కొండ శిఖరం పైన ఓ ఆలయం. వందల కొద్దీ మైళ్ళ దూరం నుంచి జనం ఆర్తితో నడిచి, కాళ్ళు పడిపోతున్నా ఆ దైవాన్ని స్మరించుకుంటూ కొండెక్కి, భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకోవటం.. అది అడవికానీ, కొండకానీ, కుగ్రామం కానీ ఎక్కడ దేవాలయం వున్నా, భక్తుల ప్రార్థనలనీ, పూజలనీ వేదోక్తంగా దైవానికి నివేదించే సంధాత అర్చకుడు. ఆలయాలకి ఆదాయాలు ఏవిూ లేని రోజుల్లో, రోడ్లు, లైట్లు కూడా లేని కాలంలో సయితం ‘‘సమాజం పట్ల ఇది మన కర్తవ్యం’’ అని భావిస్తూ నిలువునా మంచు కురుస్తున్నా, ఆకాశం కుండపోతగా వర్షిస్తున్నా నిర్దిష్ట విధి విధానంలో కచ్చితంగా నిర్ణీత సమయాల్లో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలను అతను నిరాటంకంగా సాగిస్తూ వచ్చాడు.
ఆలయాలు వుంటేనే అర్చకుడికి పాత్ర వుంది. అలా ఆలయాలని నెలకొల్పి, ఆ ఆలయాల ద్వారా భక్తి పరిమళాలు సమాజంలో వ్యాపించాలని ఆకాంక్షించిన చక్రవర్తులు, రాజులు, జమీందారులు, శక్తి కలిగిన దాతలు కొండల్లో, కోనల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా దేవాలయాలను నిర్మింపజేశారు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరంతరం కొనసాగాలన్న లక్ష్యంతో ఆయా దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరిగేలా తగిన మాన్యాల్ని కూడా ఆ స్థాపక ధర్మకర్తలు ఏర్పాటు చేశారు. అలా దేవాలయాల ఉనికి, అర్చకుల ధర్మకర్తల మనుగడ అనాదిగా ఒకదానికొకటి పెనవేసుకుపోయాయి. తరాల తరబడి ఆ స్థాపక ధర్మకర్తల వారసులు, వంశపారంపర్యంగా ఈ అర్చకులూ ధర్మప్రచారానికి ఆలంబనగా ఈ దేవాలయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్నారు.
కానీ....1987లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. అందుకు తగిన కారణంగా–తిరుమల తిరుపతి దేవస్థానాల్లోని మిరాసీ వ్యవస్థను ప్రభుత్వం చూపించింది. అలా నేరుగా చెప్పకుండా, ముందు మిరాసీ వ్యవస్థ మీద చల్లా కొండయ్య కమిషన్ వేసింది. కమిషన్ లక్ష్యానికి అనుగుణంగా ఒక పత్రికలో ‘కలియుగ వైకుంఠపాళి’ అనే పేరుతో వ్యాసాలు వరుసగా ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమిషన్ ముందు ప్రజల అభిప్రాయాలు ప్రశ్నావళికి వారు ఇచ్చిన సమాధానాలు ఈ దినపత్రిక ఆఫీసుకు ఎలా చేరాయి? ఇది ప్రజలను ఒక పథకం ప్రకారం మిరాసీ వ్యవస్థపై బురద జల్లే కుట్ర కాదా? కమిషన్ నివేదిక ఇచ్చే ముందే మాయచేసే కుట్ర కాదా? చివరికి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఎన్.టి.రామారావు ప్రభుత్వం ముందస్తు ఎజెండా ప్రకారం మిరాసీ వ్యవస్థని రద్దు చేసింది.
రాష్ట్రంలో 30 వేలకు పైగా దేవాలయాలున్నాయి. అన్ని దేవాలయాలకూ తిరుమల దేవాలయంలా కోట్లలో ఆదాయాలున్నాయా? అలాంటి చోట వంశపారంపర్య హక్కుదారులు కోట్లకు కోట్లు సంపాదిస్తారా? అయినా, వంశపారంపర్య అర్చక వ్యవస్థని ఒక్క తిరుమల సాకుగా అన్ని దేవాలయాల్లో ఎలా రద్దు చేస్తారు?.... ఈ అంశం మీద అర్చకులందరికీ కడుపు మండిపోయింది. చిలుకూరులోని బాలాజీ ఆలయానికి చెందిన (ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు) ప్రొఫెసర్ సౌందరరాజన్ ఆధ్వర్యంలో అర్చకులు ఉద్యమించారు. ఆ ఒక్క ప్రొఫెసర్–ఏ అర్చక సంఘం కలిసి వచ్చినా, రాకపోయినా సుప్రీంకోర్టు దాకా పోరాడారు. ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అని పుస్తకాలు రాసి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రచారం చేశారు. ప్రతి పార్టీ నాయకుణ్ణి కలిసి–మీ ఎన్నికల ప్రణాళికలో ‘‘ఈ క్రూరమైన చట్ట సవరణని రద్దు చేస్తాం’’ అని ప్రకటించండి–అని బతిమాలారు, అర్థించారు, ఆక్రోశించారు.
ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2006లో ముఖ్యమంత్రి వైఎస్సార్ అప్పటి రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు గారిని పిలిచి చెప్పారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలి... నేను వాళ్లకి వాగ్దానం చేశాను. మాట తప్పానని నాకు మాట రాకూడదు...’’ చివరికి 2007లో 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ, శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. దాని ప్రకారం వంశపారంపర్య అర్చకత్వం అర్చకులకు ఒక బాధ్యత. వాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనీ, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలనీ, అర్చక శ్రేయోనిధి ఏర్పాటు చేయాలనీ... ఇలాంటి అనేక కొత్త అంశాలతో ఆ చట్టం వచ్చింది.
ఇరవయ్యేళ్లుగా పోరాడి అలసిపోయిన అర్చకులంతా డాక్టర్ రాజశేఖరరెడ్డిని హైదరాబాద్‌లోని తిరునిలయంలో 2007 డిసెంబర్ 15వ తేదీనాడు అత్యంత ఘనంగా సత్కరించి, తమ కృతజ్ఞత చాటుకున్నారు..’’. ఇటీవల వెలువడిన ‘‘వైఎస్‌ఆర్ ఛాయలో’’ అనే పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని జి. వల్లీశ్వర్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం చేసిన కృషిని ఉటంకిస్తూ మహానేత అర్చకులపట్ల సానుభూతితో వ్యవహరించిన తీరును ఉటంకించారు. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పే ముగింపు అని ఎండోమెంట్ శాఖాధికారులు భావిస్తున్నారు. కానీ, మన ఆలయ సంస్కృతిని ధ్వంసం చేయగల ఈ మహమ్మారి నుంచి విముక్తి లభించటానికి ‘30/87 చట్టాన్ని ప్రభుత్వం సవరించటం’ ఒక్కటే పరిష్కారం. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా విఫలమయ్యాం.
ఆశ్చర్యం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉంది. దేవాలయాల ఆదాయంలోంచి 21.5%ను ప్రభుత్వం దాని బొక్కసంలోకి గుంజుకుంటున్నది. ఔరంగజేబ్ కాలంనాటి జిజియా పన్నుకు (మతావలంబనకు విధించే పన్ను), దీనికీ తేడా ఏమీలేదు. ఈ విషయాన్ని 2009లో ఏర్పాటయిన అర్చకుల వేతన స్కేళ్ల కమిటీ కూడా వేలెత్తి చూపింది. గత ప్రభుత్వం అయితే మోసాలలోకే పెద్ద మోసపూరిత పని చేసింది. అర్చకుల సంక్షేమం, వేతన స్కేళ్ల కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జి.ఓ.ఎంఎస్ నం.76ను ఫిబ్రవరి 16, 2017న విడుదల చేసింది.
దీన్ని చూసి మురిసిపోయిన అర్చకస్వాములు ఈ చరిత్రాత్మక జీ.ఓ.ను తీసినందుకు అప్పటి ముఖ్యమంత్రి (చంద్రబాబుని) ఆకాశానికెత్తేసి అభినందన మాలలతో ముంచెత్తారు. ఆ పొగడ్తల మత్తులో ఆ జీఓ అమలు నిలిచిపోయింది.. తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. సవరించిన చట్టానికి వ్యతిరేకంగా తిరుమల మరియు తిరుచానూరు అర్చకులను చంద్రబాబు పదవీ విరమణ చేయించారు కూడా. కానీ వైఎస్సార్ చట్టంలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ లేదు.
2019లో చారిత్రాత్మకమైన ప్రజా మద్దతుతో ఎంపికైన వైఎస్సార్ తనయుడుగా నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు ధన్యవాదాలు. దేవాలయాలపై మేనిఫెస్టోలో చేర్చిన అంశం ఇది... మేనిఫెస్టోయే తనకి పవిత్ర గ్రంథం అని చెప్పే ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు. హామీలు గుప్పించడం, ఆకాంక్షలు చొప్పిం చడం, అమలు దగ్గరకొచ్చేసరికి బెల్లం కొట్టిన రాయిలాగా పోజి వ్వడం–ఈ లక్షణాలు ప్రభుత్వాల విశ్వసనీయతను పెంచవని రాజ్యాంగం కూడా మొత్తుకుంటున్నది. అర్చకుల విషయంలో ఇదేకదా ఇప్పటి వరకు జరుగుతున్నది. హిందువులు అన్ని విషయాల్లో సహకరిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16.2.2017 నాటి జీ.ఓ.76ను జీ.ఓ.ఎం.ఎస్. నెం. 439 ద్వారా అమలుపరచడం ద్వారా శుభారంభం పలికింది. అర్చకులను ఆదుకోవడంలో తద్వారా దేవాలయాలను కాపాడుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్Sమోహన్‌రెడ్డి తమ తండ్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారు. వారికి భక్తుల, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది.
సి.ఎస్. రంగరాజన్
వ్యాసకర్త దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త
ఈ–మెయిల్ : csranga@gmail.com
Comments
Please login to add a commentAdd a comment