archakulu
-
బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారు. వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేటి నుంచి కార్యరూపం దాల్చనుంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా అర్చకుడు మదనగోపాలస్వామికి తొలి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. (జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో) అర్చక సమాఖ్య కార్యదర్శి ఆత్రేయబాబు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అర్చకులకు తీరని ద్రోహం చేశారన్నారు. అర్చకులతో బలవంతపు పదవీ విరమణలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అన్ని ప్రభుత్వాలు అర్చకులను నిర్లక్ష్యం చేశాయన్నారు. పుష్కరకాలం తర్వాత సీఎం జగన్ అర్చకుల జీవితాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. మా కుటుంబాల్లో జీవనజ్యోతి వెలిగించారని సంతోషం వ్యక్తం చేశారు. (అర్చకుల కల సాకారం) -
అర్చకుల పరంపరకు నీరాజనం
వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలని సంకల్పించారు. 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. 2019లో నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భక్తులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది. భయంకరమైన దట్టమైన అరణ్యం. మధ్యలో ఓ చిన్నగుడి. అందులో ఓ దైవం. అట్నుంచి ఇటూ, ఇట్నుంచీ అటూ చెదురుమదురుగా వెళ్తుండే బాటసారులు ఆగి, ఆ దైవాన్ని దర్శించుకొని, ప్రశాంత చిత్తంతో ప్రార్థన చేసి, అంతా మంచి జరగాలని భక్తితో వేడుకోవడం... ఒక పెద్ద కొండ.... కొండ శిఖరం పైన ఓ ఆలయం. వందల కొద్దీ మైళ్ళ దూరం నుంచి జనం ఆర్తితో నడిచి, కాళ్ళు పడిపోతున్నా ఆ దైవాన్ని స్మరించుకుంటూ కొండెక్కి, భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకోవటం.. అది అడవికానీ, కొండకానీ, కుగ్రామం కానీ ఎక్కడ దేవాలయం వున్నా, భక్తుల ప్రార్థనలనీ, పూజలనీ వేదోక్తంగా దైవానికి నివేదించే సంధాత అర్చకుడు. ఆలయాలకి ఆదాయాలు ఏవిూ లేని రోజుల్లో, రోడ్లు, లైట్లు కూడా లేని కాలంలో సయితం ‘‘సమాజం పట్ల ఇది మన కర్తవ్యం’’ అని భావిస్తూ నిలువునా మంచు కురుస్తున్నా, ఆకాశం కుండపోతగా వర్షిస్తున్నా నిర్దిష్ట విధి విధానంలో కచ్చితంగా నిర్ణీత సమయాల్లో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలను అతను నిరాటంకంగా సాగిస్తూ వచ్చాడు. ఆలయాలు వుంటేనే అర్చకుడికి పాత్ర వుంది. అలా ఆలయాలని నెలకొల్పి, ఆ ఆలయాల ద్వారా భక్తి పరిమళాలు సమాజంలో వ్యాపించాలని ఆకాంక్షించిన చక్రవర్తులు, రాజులు, జమీందారులు, శక్తి కలిగిన దాతలు కొండల్లో, కోనల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా దేవాలయాలను నిర్మింపజేశారు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరంతరం కొనసాగాలన్న లక్ష్యంతో ఆయా దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరిగేలా తగిన మాన్యాల్ని కూడా ఆ స్థాపక ధర్మకర్తలు ఏర్పాటు చేశారు. అలా దేవాలయాల ఉనికి, అర్చకుల ధర్మకర్తల మనుగడ అనాదిగా ఒకదానికొకటి పెనవేసుకుపోయాయి. తరాల తరబడి ఆ స్థాపక ధర్మకర్తల వారసులు, వంశపారంపర్యంగా ఈ అర్చకులూ ధర్మప్రచారానికి ఆలంబనగా ఈ దేవాలయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్నారు. కానీ....1987లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. అందుకు తగిన కారణంగా–తిరుమల తిరుపతి దేవస్థానాల్లోని మిరాసీ వ్యవస్థను ప్రభుత్వం చూపించింది. అలా నేరుగా చెప్పకుండా, ముందు మిరాసీ వ్యవస్థ మీద చల్లా కొండయ్య కమిషన్ వేసింది. కమిషన్ లక్ష్యానికి అనుగుణంగా ఒక పత్రికలో ‘కలియుగ వైకుంఠపాళి’ అనే పేరుతో వ్యాసాలు వరుసగా ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమిషన్ ముందు ప్రజల అభిప్రాయాలు ప్రశ్నావళికి వారు ఇచ్చిన సమాధానాలు ఈ దినపత్రిక ఆఫీసుకు ఎలా చేరాయి? ఇది ప్రజలను ఒక పథకం ప్రకారం మిరాసీ వ్యవస్థపై బురద జల్లే కుట్ర కాదా? కమిషన్ నివేదిక ఇచ్చే ముందే మాయచేసే కుట్ర కాదా? చివరికి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఎన్.టి.రామారావు ప్రభుత్వం ముందస్తు ఎజెండా ప్రకారం మిరాసీ వ్యవస్థని రద్దు చేసింది. రాష్ట్రంలో 30 వేలకు పైగా దేవాలయాలున్నాయి. అన్ని దేవాలయాలకూ తిరుమల దేవాలయంలా కోట్లలో ఆదాయాలున్నాయా? అలాంటి చోట వంశపారంపర్య హక్కుదారులు కోట్లకు కోట్లు సంపాదిస్తారా? అయినా, వంశపారంపర్య అర్చక వ్యవస్థని ఒక్క తిరుమల సాకుగా అన్ని దేవాలయాల్లో ఎలా రద్దు చేస్తారు?.... ఈ అంశం మీద అర్చకులందరికీ కడుపు మండిపోయింది. చిలుకూరులోని బాలాజీ ఆలయానికి చెందిన (ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు) ప్రొఫెసర్ సౌందరరాజన్ ఆధ్వర్యంలో అర్చకులు ఉద్యమించారు. ఆ ఒక్క ప్రొఫెసర్–ఏ అర్చక సంఘం కలిసి వచ్చినా, రాకపోయినా సుప్రీంకోర్టు దాకా పోరాడారు. ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అని పుస్తకాలు రాసి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రచారం చేశారు. ప్రతి పార్టీ నాయకుణ్ణి కలిసి–మీ ఎన్నికల ప్రణాళికలో ‘‘ఈ క్రూరమైన చట్ట సవరణని రద్దు చేస్తాం’’ అని ప్రకటించండి–అని బతిమాలారు, అర్థించారు, ఆక్రోశించారు. ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2006లో ముఖ్యమంత్రి వైఎస్సార్ అప్పటి రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు గారిని పిలిచి చెప్పారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలి... నేను వాళ్లకి వాగ్దానం చేశాను. మాట తప్పానని నాకు మాట రాకూడదు...’’ చివరికి 2007లో 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ, శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. దాని ప్రకారం వంశపారంపర్య అర్చకత్వం అర్చకులకు ఒక బాధ్యత. వాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనీ, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలనీ, అర్చక శ్రేయోనిధి ఏర్పాటు చేయాలనీ... ఇలాంటి అనేక కొత్త అంశాలతో ఆ చట్టం వచ్చింది. ఇరవయ్యేళ్లుగా పోరాడి అలసిపోయిన అర్చకులంతా డాక్టర్ రాజశేఖరరెడ్డిని హైదరాబాద్‌లోని తిరునిలయంలో 2007 డిసెంబర్ 15వ తేదీనాడు అత్యంత ఘనంగా సత్కరించి, తమ కృతజ్ఞత చాటుకున్నారు..’’. ఇటీవల వెలువడిన ‘‘వైఎస్ఆర్ ఛాయలో’’ అనే పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని జి. వల్లీశ్వర్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం చేసిన కృషిని ఉటంకిస్తూ మహానేత అర్చకులపట్ల సానుభూతితో వ్యవహరించిన తీరును ఉటంకించారు. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పే ముగింపు అని ఎండోమెంట్ శాఖాధికారులు భావిస్తున్నారు. కానీ, మన ఆలయ సంస్కృతిని ధ్వంసం చేయగల ఈ మహమ్మారి నుంచి విముక్తి లభించటానికి ‘30/87 చట్టాన్ని ప్రభుత్వం సవరించటం’ ఒక్కటే పరిష్కారం. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా విఫలమయ్యాం. ఆశ్చర్యం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉంది. దేవాలయాల ఆదాయంలోంచి 21.5%ను ప్రభుత్వం దాని బొక్కసంలోకి గుంజుకుంటున్నది. ఔరంగజేబ్ కాలంనాటి జిజియా పన్నుకు (మతావలంబనకు విధించే పన్ను), దీనికీ తేడా ఏమీలేదు. ఈ విషయాన్ని 2009లో ఏర్పాటయిన అర్చకుల వేతన స్కేళ్ల కమిటీ కూడా వేలెత్తి చూపింది. గత ప్రభుత్వం అయితే మోసాలలోకే పెద్ద మోసపూరిత పని చేసింది. అర్చకుల సంక్షేమం, వేతన స్కేళ్ల కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జి.ఓ.ఎంఎస్ నం.76ను ఫిబ్రవరి 16, 2017న విడుదల చేసింది. దీన్ని చూసి మురిసిపోయిన అర్చకస్వాములు ఈ చరిత్రాత్మక జీ.ఓ.ను తీసినందుకు అప్పటి ముఖ్యమంత్రి (చంద్రబాబుని) ఆకాశానికెత్తేసి అభినందన మాలలతో ముంచెత్తారు. ఆ పొగడ్తల మత్తులో ఆ జీఓ అమలు నిలిచిపోయింది.. తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. సవరించిన చట్టానికి వ్యతిరేకంగా తిరుమల మరియు తిరుచానూరు అర్చకులను చంద్రబాబు పదవీ విరమణ చేయించారు కూడా. కానీ వైఎస్సార్ చట్టంలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ లేదు. 2019లో చారిత్రాత్మకమైన ప్రజా మద్దతుతో ఎంపికైన వైఎస్సార్ తనయుడుగా నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు ధన్యవాదాలు. దేవాలయాలపై మేనిఫెస్టోలో చేర్చిన అంశం ఇది... మేనిఫెస్టోయే తనకి పవిత్ర గ్రంథం అని చెప్పే ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు. హామీలు గుప్పించడం, ఆకాంక్షలు చొప్పిం చడం, అమలు దగ్గరకొచ్చేసరికి బెల్లం కొట్టిన రాయిలాగా పోజి వ్వడం–ఈ లక్షణాలు ప్రభుత్వాల విశ్వసనీయతను పెంచవని రాజ్యాంగం కూడా మొత్తుకుంటున్నది. అర్చకుల విషయంలో ఇదేకదా ఇప్పటి వరకు జరుగుతున్నది. హిందువులు అన్ని విషయాల్లో సహకరిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16.2.2017 నాటి జీ.ఓ.76ను జీ.ఓ.ఎం.ఎస్. నెం. 439 ద్వారా అమలుపరచడం ద్వారా శుభారంభం పలికింది. అర్చకులను ఆదుకోవడంలో తద్వారా దేవాలయాలను కాపాడుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్Sమోహన్‌రెడ్డి తమ తండ్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారు. వారికి భక్తుల, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది. సి.ఎస్. రంగరాజన్ వ్యాసకర్త దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త ఈ–మెయిల్ : csranga@gmail.com -
శతమానం భవతి
పట్నంబజారు (గుంటూరు): ‘శతమానం భవతి.. శతాయుః పురుషశ్శతేంద్రియ.. ఆయుష్యేవేంద్రియే.. ప్రతితిష్ఠతి..’ అంటూ వేదపండితులు, అర్చకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించారు. వంశపారంపర్య అర్చకత్వానికి ప్రభుత్వం ఆమోదించడంతో పండిత లోకం పొంగిపోయింది. తమ కల సాకారమైందని హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. గత పాలకులెవరికీ పట్టని తమ గోడు తలకెత్తుకుని తుది ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. వైఎస్ జగన్ చిత్రపటానికి అర్చకులు కనకాభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని గులాబీ పూలతో అభిషేకించారు. అర్చకులు సాధారణంగా తాము ఆరాధించే దేవుణ్ణి తప్ప మరెవర్నీ స్తుతించరు. అలాంటిది మంగళవారం గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) ఆధ్వర్యంలో దేశంలోనే మరే ఇతర ముఖ్యమంత్రికీ జరగని అభిషేకం జగన్మోహన్రెడ్డికి చేసి ఘనంగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. నిజమైన జననేత.. జగన్ వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నేత లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఎన్నికల హామీల అమలుకు పూనుకున్న తమ నేత జగన్, నిజమైన జననేత అన్నారు. ఏళ్లనాటి అర్చకుల కలను సాకారం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న చట్ట సవరణను అధికారం చేపట్టిన ఐదు మాసాల్లోపే సీఎం జగన్ అమలు చేయడం సంతోషించదగ్గ అంశమన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ ఇది యావత్ బ్రాహ్మణ సమాజం సంతోషించాల్సిన సమయమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఇంత వేగంగా అమలు పరచడం ఆనందదాయకమన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తమను దారుణంగా దగా చేశారని ధ్వజమెత్తారు. అర్చకులను పట్టించుకుంది నాడు తండ్రి, నేడు తనయుడే అర్చకుల సమస్యలను పట్టించుకున్నది నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు ఆయన తనయుడు జగనే. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో 76 నంబరుతో అర్చకులకు వెలుగు దొరికిందని భావించాం. అయితే ఆ జీవో అప్పట్లో పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన జీవో నంబరు 439 ఎంతో ఉపయోగకరంగాఉంటుంది. – శ్రీకంఠ నందీశ్వరశాస్త్రి, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు -
అర్చకుల కల సాకారం
సాక్షి, అమరావతి: ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. అలాంటి ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఏదైనా ఆలయంలో అర్చకులుగా చేరినవారి కుటుంబాలకు ఆ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వం చేసుకోవడానికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి తమ ఆలయ వివరాలతో దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో ఏదైనా ఆలయంలో నిర్ణీత జీతభత్యాల మేరకు నియమితులైతే వంశపారంపర్య అర్చకునిగా కొనసాగుతారో.. లేదంటే నియమితులైన చోట పనిచేస్తారో ఎంచుకునే వీలు అర్చకులకే కల్పించారు. ఏ ఆలయానికి ఎవరు వంశపారంపర్య అర్చకత్వానికి అర్హులో తేల్చుతూ దేవదాయ శాఖ కమిషనర్ పారదర్శకంగా ఒక జాబితాను తయారు చేస్తారు. అర్హత ఉన్న అర్చకులు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, కుటుంబ వారసత్వ పట్టిక, అందుకు సంబంధించిన అఫిడవిట్లను దేవదాయ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వంశపారంపర్య అర్చకత్వానికి గుర్తింపు పొందిన వారు.. తమ తదనంతరం వారసులుగా ఎవరు కొనసాగుతారో తెలపాలి. వంశపారంపర్య అర్చకుడిగా నియమించాలంటే కనీస వయసును 16 ఏళ్లుగా నిర్ణయించారు. ఒక ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉన్న కుటుంబం వేరొక ఆలయానికి బదిలీపై వెళ్లడానికి అనుమతించరు. రూ.ఐదు లక్షల ఆదాయం లోపు ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంలో సెక్షన్ 144 అమలుకు మినహాయింపునిచి్చ.. కొత్త నిబంధనలు రూపొందిస్తారు. ధారి్మక పరిషత్ నియమ నిబంధనలకు అనుగుణంగా వంశపారంపర్య అర్చకులకు అందించే ప్రయోజనాలను ఆలయాల వారీగా ప్రత్యేకంగా పేర్కొంటారు. 12 ఏళ్ల తర్వాత విధివిధానాలు ఖరారు వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేవదాయ శాఖ చట్టానికి చట్ట సవరణ తీసుకొచ్చారు. దీనికనుగుణంగా పూర్తి విధివిధానాలతో తుది ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ ముగియక ముందే ఆయన దివికేగారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అర్చకులను మోసం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు మాయమాటలతో మభ్యపెట్టి అర్చకుల తీవ్ర ఒత్తిడితో 2017, ఫిబ్రవరి 16న వంశపారంపర్య అర్చకత్వం అమలుపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి మరోసారి మోసపుచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాదయాత్రలో అర్చకులు కలిసినప్పుడు ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచి్చన మాటను నిలబెట్టుకున్నారు. దేవాలయాల రక్షణకు దోహదం వంశపారంపర్య అర్చకత్వం అమలుకు ఆమోదం తెలపడం పట్ల అర్చక కుటుంబాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూమెంట్ కన్వీనర్ ఎంవీ సౌందర్యరాజన్, సీఎస్ రంగరాజన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సానుకూల చర్యలు దేవాలయాలను రక్షించడానికి సహాయపడతాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. దివంగత సీఎం వైఎస్సార్ చేసిన చట్టాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు కూడా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్రిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దింటి రాంబాబు, తదితరులు విమర్శించారు. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, బ్రాహ్మణ సంఘాల నేత ద్రోణంరాజు రవికుమార్ కూడా వేర్వేరుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహం అర్చకుల వారసత్వపు హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహమన్నారు. అర్చకుల జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయ వ్యవస్థను కాపాడటంలో అర్చకుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. హిందూ, ధార్మిక, దేవదాయ ధర్మాదాయ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం ఇదే కృషిని కొనసాగించాలన్నారు. కాగా, అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారమవ్వడంతో అర్చకుల జీవితాల్లో ఇక వెలుగులు నిండుతాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. -
శ్రీవారి అర్చక నిలయంలో హైడ్రామా
తిరుమల: శ్రీవారి అర్చక నిలయంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా సంభావన అర్చకులు మణికంఠ, మారుతీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మణికంఠపై కక్ష్య సాధించటం కోసం మధు అనే కానిస్టేబుల్ సహాయంతో అర్చక నిలయానికి మారుతీ స్వామి ఇద్దరు మహిళలను పంపారు. మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీస్వామి, ఆ ఇద్దరు మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మణికంఠ స్వామి గదికి చేరుకున్న ఆ మహిళలు ఆయనను చితకబాదారు. మణికంఠ అరుపులు విన్న స్థానికుల సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. పథకం ప్రకారం మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీ స్వామి ప్రయత్నించారని ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. ఈ మేరకు పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధు అనే కానిస్టేబుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మణికంఠ స్వామి మీడియాతో మాట్లాడుతూ...తాను సాధారణ అర్చకుడినని ,తనకు మారుతిస్వామికి ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్యానించడం గమనర్హం. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
010 పద్దు ద్వారా జీతాలు చెల్లించండి
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని అర్చకులు, ఉద్యోగులు, దేవాదాయ సంస్థల సిబ్బందికి జీత భత్యాలు ట్రెజరీ 010 పద్దు ద్వారా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల వేతన అర్చక, ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ విత్తనాల శ్రీనివాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక షిర్డీసాయి కల్యాణ మండపంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతనాల విషయంలో స్పష్టంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 19 ఏళ్లు, చట్టంలో మార్పులు చేసి ఎనిమిదేళ్లు గడచిపోయిందన్నారు. సవరించిన దేవాదాయ చట్టం 3187 ప్రకారం అర్చకులకు, ఉద్యోగులకు ఒకనిధి ఏర్పాటుచేసి, ఆ నిధి నుంచి జీతభత్యాలు ఇవ్వాలని జారీచేసిన జీఓలు 280, 326, 417 అమలుకు నోచుకోవడంలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులకు వినతి పత్రాలిచ్చినా ఫలితంలేదని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు వినతి పత్రం అందించామని తెలిపారు. సమావేవంలో అర్చక జేఏసీ కన్వీనర్ జి.శ్రీనివాసు. ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ వి.శ్రీనివాసు, కొడవటిగంటి లక్ష్మణాచార్యులు, ఎం.అజయ్ పాల్గొన్నారు. -
వైభవంగా కడప రాయుడి కల్యాణం
కడప కల్చరల్ : కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా వధూవరులుగా అలంకరించి కొలువుదీర్చారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమహన్, పార్థసారథి తదితరులు కల్యాణ క్రతువును నిర్వహించారు. మహా మంగళసూత్రాలను భక్తులకు దర్శింపజేసి స్వామి పక్షాన అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం లాజహోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. అనంతరం ఉభయదారులతో పూజలు చేయించి వారికి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. హాజరైన భక్తులందరికీ మంగళాక్షతలతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
2న హైదరాబాద్‌లోఅర్చక శంఖారావం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల రెండోతేదీన హైదరాబాద్‌లో ‘అర్చక శంఖారావం’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. వారు ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. రెండోతేదీన ఉదయం 9 గంటలకు సామూహిక బ్రహ్మయజ్ఞం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాశాంతియాగం పూర్ణాహుతి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు సభాకార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సభలో పలు రాజకీయపార్టీల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, అర్చకసంఘ ప్రతినిధులు ప్రసంగిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల అర్చక సమాఖ్య నాయకులు, అర్చకులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో పాల్గొనే అర్చకులు విధిగా ఆగమ సాంప్రదాయ పద్ధతిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.