
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారు. వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేటి నుంచి కార్యరూపం దాల్చనుంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా అర్చకుడు మదనగోపాలస్వామికి తొలి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. (జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో)
అర్చక సమాఖ్య కార్యదర్శి ఆత్రేయబాబు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అర్చకులకు తీరని ద్రోహం చేశారన్నారు. అర్చకులతో బలవంతపు పదవీ విరమణలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అన్ని ప్రభుత్వాలు అర్చకులను నిర్లక్ష్యం చేశాయన్నారు. పుష్కరకాలం తర్వాత సీఎం జగన్ అర్చకుల జీవితాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. మా కుటుంబాల్లో జీవనజ్యోతి వెలిగించారని సంతోషం వ్యక్తం చేశారు. (అర్చకుల కల సాకారం)
Comments
Please login to add a commentAdd a comment