జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో | IVR Krishnarao Article On Priests | Sakshi
Sakshi News home page

జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో

Published Wed, Oct 30 2019 1:40 AM | Last Updated on Wed, Oct 30 2019 1:42 AM

IVR Krishnarao Article On Priests - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలంగా అర్చకులు కంటున్న కలలు నెరవేరేలా గత సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగ భద్రత, అర్హత కలిగిన వారసత్వ గుర్తింపు, చిన్న దేవాలయాలపై దేవాదాయ శాఖ పెత్తనాన్ని తొలగించే ఈ ఉత్తర్వుల కోసం అరకొర జీతాలతో, సదుపాయాలతో గ్రామాల్లో దేవాలయాల్ని  అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్న అర్చకులు ఎదురుచూస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇది సాధించటం కోసం అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారులు, రాజకీయ నాయకులు లేరు. 1987లో మొదలైన ఈ కష్టాలకు 2007లో రాజశేఖర్‌ రెడ్డి చట్ట సవరణ ద్వారా వెసులుబాటు కల్పిస్తే ఒక దశాబ్దం తర్వాత దానిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆచరణ రూపంలో తీసుకువచ్చారు. 2017 లో ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ముసాయిదా తయారై జీవో 76 రూపంలో విడుదలైనా, ఆనాటి ప్రభుత్వం వాటిని నిర్ధారించకుండానే వదిలేసింది. ఈరోజు శాశ్వత ప్రాతిపదికలో జీవో 439 ద్వారా ఆ అంశాలను నిర్ధారించారు.

 1987వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సమూలంగా చల్లా కొండయ్య కమిషన్‌ సిఫార్సు మేరకు సవరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చారు. అంతవరకు ఉన్న వ్యవస్థను నాశనం చేయడంలో ఈ చట్టం సఫలీకృతం అయింది. కానీ దానికి ప్రత్యా మ్నాయంగా మరొక విధానాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చట్టంలో ఎక్కడా కనిపించలేదు. సంస్కరణ ప్రధానంగా కాకుండా, ఎవరి మీదనో ద్వేషంతో, కోపంతో చట్టాలు తీసుకొని వస్తే దాని దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ చట్ట సవరణలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని మిరాసి హక్కులను తొలగించారు. ఈ మొత్తం చట్టంలో హర్షించదగిన సంస్కరణ ఇది ఒకటి. మరి ఇంక ఏ దేవాలయంలో లేని విధంగా తిరుమల దేవాలయంలో స్వామి వారికి సేవ చేసినందుకు ఆలయ ఆదాయంలో రకరకాల సేవలకు భాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మిరాసీలు చాలా ఉన్నా ప్రధానమైనది అర్చక మిరాసి. ఆలయ ఆదాయం పెరగటంతో మిరాసీదారులకు కూడా ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఈ మిరాసి రద్దుతోపాటు వారసత్వ హక్కు, చిన్న గ్రామాలలో అర్చకులకు వచ్చే దక్షిణలు, దేవాలయాల్లో సేవ చేసినందుకు ఏర్పాటుచేసిన సర్వీస్‌ ఈనాములను రద్దు చేశారు. దేవాదాయ శాఖను విస్తృతపరచి ఆదాయం లేని చిన్న చిన్న దేవాలయాలను కూడా  దేవాలయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.

 గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాలను వాటిని అంటిపెట్టుకుని అరకొర ఆదాయంతో పనిచేస్తున్న అర్చకులను ఈ సంస్కరణ బాగా దెబ్బ తీసింది. వారికున్న చిన్న ఆదాయపు వనరులను తీసివేశారు కానీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎటువంటి వనరులను ఏర్పాటు చేయలేకపోయింది. చిన్న ఆలయాల నిర్వహణకు ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పోయింది. ఈ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన భిన్న ఉత్తర్వులను అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో తాత్సారం ప్రదర్శించింది. రాజకీయంగా పట్టించుకోని, స్పందిం చని నిరంకుశ ప్రభుత్వం, అవినీతిమయమైన, చలనం లేని దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఆ రోజుల్లో చిన్న దేవాలయాల్లోని పురోహితులు పడిన కష్టాలు వర్ణనాతీతం. చట్ట సవరణ వారికి వ్యతిరేకంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. అధికార యంత్రాంగం విస్తరించి చిన్న దేవాలయాలు కూడా వారి పరిధిలోకి రావటంతో ఆ వచ్చే అరకొర ఆదాయం ఈ అధికారుల జీతాలకే సరిపోయింది. ఈ సమస్య కేవలం అర్చకులకే కాదు. దేవాలయానికి ఇతరత్రా సేవలు చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మొదలైనవారు కూడా అనుభవించారు.

ఈ చిన్న చిన్న కులాల వారి కుండే సర్వీస్‌ ఈనాములను కూడా తొలగించారు. గ్రామాలలోని చిన్న దేవాలయాల్లో చాలామంది బ్రాహ్మణ కులాలకు సంబంధించని లింగాయతులు, బోయలు, తంబళ్ల కులస్తులు, చాద్ధాట వైష్ణవులు అర్చకత్వం నిర్వహిస్తుంటారు. వీరందరు కూడా ఈ నూతన చట్టంతో తరతరాల వృత్తిని వదిలి పెట్టలేక, సరైన జీవనభృతి లేక కష్టాలు అనుభవించారు. ఈ సమయంలో చిన్న గ్రామాలలోని దేవాలయాల అర్చకుల తరఫున నాయకత్వం వహించి దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన ఘనత చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు డాక్టర్‌ ఎమ్‌వీ సౌందర్‌రాజన్‌కి దక్కు తుంది. సుప్రీంకోర్టు దాకా ఈ అంశంపై జరిగిన కేసులలో వీరు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ప్రజాభిప్రాయాన్ని చిన్న దేవాలయాల అర్చకుల సమస్యలు అర్థం చేసుకునే విధంగా కూడగట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.  సుప్రీంకోర్టు తన తీర్పులో చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక విధానాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆనాటి మంద తోలు మూర్ఖ ప్రభుత్వం ఈ సమస్యలపై కమిటీలు వేయడం వరకే పరిమితం అయింది కానీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు.

 ప్రభుత్వ అధినేతల నిర్లక్ష్య ధోరణితో ఏకపక్షంగా అధికారులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అర్చకులను ఎటువంటి పారితోషికం లేకుండా పదవీ విరమణ చేయించటం, వారి వారసులకు అర్చకత్వం బాధ్యతలు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. ఈ వేధింపులు తాళలేక మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపురంలో భీష్మ సేనా చారి అనే పురోహితుడు గుడిగంటకు ఉరి వేసు    కుని 2001లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.  2004లో ప్రభుత్వం మారటంతో ఈ సమస్యపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి సారించింది. 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అఖిలపక్ష సిఫార్సు మేరకు చట్టాన్ని సవరించి వారసత్వ హక్కులను గుర్తించింది. ఆ చట్ట సవరణకు అనుగుణంగా  విధివిధానాలను రూపొందించి ఈరోజు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది..

 రాష్ట్రంలో ఆదాయం బాగా వచ్చేటటువంటి దేవాలయాలు చాలా కొద్ది మాత్రమే. ఆ ఆలయా లకు చిన్న గ్రామాలలో ఉండే ఆలయాలకు ఒకే విధమైన విధివిధానాలు ఉండాలి అనుకోవడం అవివేకం. గ్రామాలలోని చిన్న దేవాలయాలను ప్రత్యేకంగా పరిగణించి గ్రామ సమాజం యొక్క ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో అధికార యంత్రాంగం నియంత్రణ లేకుండా నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ఈ విధి విధానాలు ఆ లక్ష్య సాధనకు తప్పకుండా ఉపయోగపడతాయి. అర్హతలేని వారసత్వానికి ఎక్కడా తావులేదు. ప్రభుత్వం కూడా  సరైన విధానాలు ఏర్పాటు చేసి, సరైన ప్రావీణ్యం ఉన్నవారే ఎంపిక అయ్యేటట్లు చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వారికి ఇచ్చే పారితోషికం తగిన స్థాయిలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద దేవాలయాల ఆదాయాన్ని దీనికి కేటాయించడం ద్వారా కనీసం అర్చ కునికి 15 వేల రూపాయల నెలసరి పారితోషికం వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయవచ్చు. అదేవిధంగా ధార్మిక ఉద్యోగులను దేవాదాయశాఖ పరిధి నుంచి తొలగించి ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం హిందూ ధర్మంపై అవగాహన, విశ్వాసం ఉన్న వారితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.

దేవాలయాల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. విద్యాసంస్థల పేరుతో, మరొక పేరుతో చాలామంది చౌకగా దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు. మరికొందరు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. వీరందరిని దేవాదాయ భూముల నుంచి తొలగించి భూములు ఆలయాలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సరైన ఆదాయవనరులు ఏర్పడి దేవాలయాలు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హత కలిగిన అర్చకులు, న్యాయబద్ధమైన పారితోషికం ఉన్ననాడు గ్రామాలలోని దేవాలయాలను హిందూధర్మ పరిరక్షణ ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. అర్చకులలో సామాజిక స్పృహ ఒక ప్రధాన బాధ్యతగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఈనాడు ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాగతింపదగినది. భవిష్యత్తులో గ్రామాలలో దేవాదాయ వ్యవస్థను బలోపేతం చేయటానికి మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement